హైదరాబాద్ః మహిళా సాధికారత అంశంపై ఏపీ అసెంబ్లీ దద్దరిల్లింది. ఈ అంశంపై వాడివేడిగా జరిగిన చర్చలో ప్రతిపక్ష వైస్ఆర్ సీపీ నేతలు ప్రభుత్వాన్ని ఎండగట్టారు. మహిళలకు కుట్టుమిషన్లు ఇచ్చామని టీడీపీ ప్రభుత్వం చెబుతోందని... అయితే ఎవరికి ఇచ్చారో, ఎప్పుడు ఇచ్చారో ఎవరికీ తెలియదని ఉప్పులేటి కల్పన ఎద్దేవా దేశారు. డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తామని చెప్పి మాట తప్పారని విమర్శించారు. మొదట రుణాలు పూర్తిగా మాఫీ చేస్తామన్నారు. తర్వాత రూ. 10 వేలు అని, చివరకు కేవలం రూ.3 వేలకు మాఫీ పరిమితం చేశారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన పేర్కొన్నారు.ప్రభుత్వ నిర్వాకంతో డ్వాక్రా గ్రూపులు నిర్వీర్యం అయ్యాయని, ఏ గ్రేడ్ సంఘాలు.. బి గ్రేడ్ కు పడిపోయాయన్న విషయాన్ని సభలో గుర్తుచేశారు. రుణాలు చెల్లించకపోవడంతో కొత్తరుణాలు ఇవ్వడం లేదని ఆమె తెలిపారు. ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ లో ఎంతమంది మహిళలకు రుణాలు ఇచ్చారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రుణమాఫీలపై ప్రభుత్వం సరిగా స్పందించడం లేదని, చెప్పిన దాంట్లోనూ కోతలు విధించడమే ఏపీ ప్రభుత్వం పని అంటూ ఉప్పులేటి కల్పన విమర్శించారు.