తొమ్మిది సిలిండర్లు అందరికీ ఇవ్వాలి!

హైదరాబాద్

25 అక్టోబర్ 2012: 'దీపం' కనెక్షన్లకు మాత్రం ఏడాదికి అదనంగా సబ్సిడీపై మూడు సిలిండర్లు ఇస్తామంటూ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు చేసిన ప్రకటన దురదృష్టకరమని వైయస్ఆర్‌  కాంగ్రెస్‌ పార్టీ  అధికార ప్రతినిధి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. అదేదో దసరా కానుకలాగా, వరంలాగా అదనపు సిలిండర్ల ప్రకటన చేశారనీ, రాష్ట్రంలో మొత్తం గ్యాస్ కనెక్షన్లు కోటీ అరవైలక్షలైతే 'దీపం' పథకం కింద ఉన్న కనెక్షన్లు 39 లక్షలు మాత్రమేనని ఆయన వైయస్ఆర్ సీపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో అన్నారు. నిజానికి వీరంతా ఏడాదికి ఐదారు సిలిండర్లు వాడేవారేననీ, కాగా ఎక్కువ సిలిండర్లు వాడే మిగతా కోటీ ఇరవై లక్షల మందికి ఆరు సిలిండర్లు మాత్రమే ఇస్తామనడం ఏం న్యాయమని ఆయన ప్రశ్నించారు. తక్కువ వాడేవారికి ఎక్కువ, ఎక్కువ వాడేవారికి తక్కువ సిలిండర్లు ఇస్తామంటున్నారని ఆయన ఎత్తిపొడిచారు.
కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలలో అదనంగా సబ్సిడీపై సరఫరా చేయాలంటూ సాక్షాత్తు యుపిఎ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీయే చెప్పినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. 33 ఎంపీలను గెలిపించినందుకు బహుమతిగా ఇలా చేస్తున్నారేమోనని రాంబాబు వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఢిల్లీ, కేరళ వంటి రాష్ట్రాలు అదనపు సిలిండర్లను సబ్సిడీపై ఇవ్వాలంటూ నిర్ణయించిన సంగతిని ఆయన ఉదాహరించారు. మిగతా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో సైతం అదనపు సిలిండర్లను సబ్సిడీపై అందించడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు.
హాస్టళ్లకు కూడా ఆరేనా?
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు 70 శాతం పైలుకే ఉన్నారనీ, వారు చదువుకునే హాస్టళ్లకి కూడా ప్రభుత్వం ఆరు సిలిండర్లే ఇస్తామంటోందని ఆయన ఆక్షేపించారు. "వారికిచ్చే మెస్ చార్జీలు రోజుకు రూ. 17.50 మాత్రమే. వందమందికి వంట చేయాలంటే నెలకు 120 సిలిండర్లు కావాలి. కానీ ప్రభుత్వం ఇచ్చేది ఆరేనట. కాబట్టి వారు రూ. 1014 చెల్లించి మిగతా 114 సిలిండర్లను కొనుక్కోవాలి. ప్రభుత్వం వంద మందికి ఇచ్చే మొత్తం యాభై వేల రూపాయలైతే, ఒక్క గ్యాస్‌ కొనుక్కోవడానికే రూ. 75 వేలు అవుతుంది." అని ఆయన వివరించారు. కనుక ఈ పిచ్చి ఆలోచన కట్టిపెట్టి, కళ్లు తెరిచి విద్యార్థుల హాస్టళ్లకు అన్ని సిలిండర్లనూ సబ్సిటీ రేటుకే ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. మిగతా ప్రజలందరికీ కనీసం తొమ్మిది సిలిండర్లైనా సబ్సిడీపై ఇవ్వాలని ఆయన కోరారు.
రాములమ్మ చెప్పిన నిజం!
చంద్రబాబు తాను అధికారంలోకి వస్తే పది సిలిండర్లు ఇస్తామంటున్నారనీ, నిజానికి తాను సబ్సిడీలకు వ్యతిరేకమని చంద్రబాబు స్వయంగా చెప్పుకున్నారనీ రాంబాబు గుర్తు చేశారు. ఈ ప్రభుత్వానికి యూజర్‌ చార్జీలు తెచ్చిన చంద్రబాబే ప్రధాన సలహాదారంటూ షర్మిల చేసిన వ్యాఖ్యలను ఆయన ఉదాహరించారు. చంద్రబాబు ఏం కోరుకుంటున్నారో ఈ ప్రభుత్వం అదే చేస్తున్నదని ఆయన వ్యంగ్యంగా అన్నారు. మహబూబ్‌నగర్‌  జిల్లా ఐజ గ్రామంలో రాములమ్మ అనే ఒక సామాన్య మహిళ చంద్రబాబును ఉద్దేశించి నువ్వు వచ్చింది నీ ఓట్ల కోసమే తప్ప మా కోసం కాదంటూ మొహం మీదే చెప్పిందని, ఇదంతా రికార్డు కూడా అయిందనీ రాంబాబు చెప్పారు. ఈ ఉదంతం చూస్తుంటే దేవతావస్త్రాల కథ గుర్తుకు వస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. అధికారంలోకి వస్తే మొదటి సంతకం రైతు రుణమాఫీ ఫైలుపై చేస్తానని చంద్రబాబు చెబుతున్నారనీ, నిజానికి దీనిపై సంతకం పెట్టాల్సింది కేంద్రప్రభుత్వమనీ, అది రాష్ట్ర బడ్జెట్‌కు సాధ్యమయే విషయం కాదనీ ఆయన ఎద్దేవా చేశారు. మద్యనిషేధం, రెండు రూపాయల కిలో బియ్యం పథకాలను ఎత్తివేసిన బాబు ఇప్పుడు హామీలు గుప్పిస్తున్నారని ఆయన విమర్శించారు.

తాజా వీడియోలు

Back to Top