ప్రొద్దుటూరులో ఉద్రిక్తత

జ‌ల‌దీక్ష‌ను భ‌గ్నం చేసిన పోలీసులు
ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్‌రెడ్డి అరెస్టు
మున్సిప‌ల్ కార్యాల‌యం వ‌ద్ద‌ ఖాళీబిందెల‌తో మ‌హిళ‌ల నిర‌స‌న‌

 వైయ‌స్ఆర్ జిల్లా:  మంచినీటి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాల‌ని కోరుతూ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో  ప్రొద్దుటూరు మున్సిపల్‌ కార్యాలయం వ‌ద్ద చేప‌ట్టిన జ‌ల‌దీక్ష‌ను పోలీసులు భ‌గ్నం చేశారు.  ఆదివారం అర్ధ‌రాత్రి నుంచి జ‌ల‌దీక్ష చేయ‌ల‌ని ఎమ్మెల‍్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి భావించ‌గా ఆయ‌న్ను బలవంతంగా అదుపులోకి తీసుకొని దీక్షా శిబిరాన్ని తొల‌గించారు. అయితే ఆయన సోమవారం ఉదయం తన అనుచరులతో వచ్చి మున్సిపల్‌ కార్యాలయం ఎదుట శివ‌ప్ర‌సాద్‌రెడ్డి జలదీక్ష మొదలుపెట్టారు. కాసేపటికే పెద‍్దఎత్తున పోలీసులు వచ్చి ఆయనను మ‌రోమారు అరెస్టు చేయ‌డంతో ఉద్రిక్త‌త నెల‌కొంది. ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్‌రెడ్డిని అరెస్టు చేయ‌డంతో  పార్టీ శ్రేణులు, మ‌హిళ‌లు ఆగ్ర‌హించారు. ఖాళీ బిందెల‌తో మున్సిప‌ల్ కార్యాల‌యం వ‌ద్ద బైఠాయించి నిర‌స‌న తెలిపారు. 

ప్రొద్దుటూరు ప‌ట్ట‌ణంలో తీవ్ర నీటి ఎద్ద‌డి నెల‌కొన‌డంతో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళ‌న బాట ప‌ట్టింది. ప్ర‌ధానంగా ప్రతి ఏటా మైలవరం డ్యాం నుంచి టీఎంసీ నీటిని పెన్నానదిలోకి విడుదల చేసేందుకు శాశ్వత జీఓను విడుదల చేయాలని, కుందూ పెన్నా వరద కాలువ పనులకు సంబంధించిన టెండర్‌ ప్రక్రియను వెంటనే పూర్తి చేసి పనులు మొదలు పెట్టాలని, చెన్నమరాజుపల్లె సమీపం నుంచి రామేశ్వరం హెడ్‌ వాటర్‌ వర్క్స్‌ వరకు పైపులైన్‌ ద్వారా వరద నీటిని తరలించాలని, తాత్కాలికంగా సమస్య పరిష్కారం కోసం పట్టణంలోని 40 వార్డులకు రోజూ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్‌రెడ్డి  మంగళవారం ఉదయం 10 గంటల వరకు వేలాది మంది మద్దతుతో దీక్ష చేయనున్నారు.   
Back to Top