తెలంగాణపై మీ వైఖరి చెప్పండి


హైదరాబాద్, 7 డిసెంబర్ 2012:

తెలంగాణఫై అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తన అభిప్రాయం మొదట స్పష్టం చేయాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. కేంద్ర హోంశాఖ మంత్రులు మారినప్పుడు అఖిల సమావేశాలు పెట్టి తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారని విమర్శించింది. ఇప్పటికే రెండు సార్లు అఖిలపక్ష సమావేశాలు నిర్వహించి ఏమీ తేల్చలేకపోయిన కాంగ్రెస్ పార్టీ ఇపుడు మరోసారి అఖిలపక్ష సమావేశమంటూ డ్రామాలు ఆడుతోందని ఆరోపించింది.

     సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన తెలంగాణపై నిర్ణయం తీసుకోకుండా కాంగ్రెస్ పార్టీ కాలయాపన చేస్తోందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ పార్టీ కేంద్ర కార్యాలయంలో భేటీ అయింది. సమావేశానంతరం కమిటీ సమన్వయకర్త కొణతాల రామకృష్ణ, సభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణపై కాంగ్రెస్ తన వైఖరి చెప్పకుండా తప్పించుకు తిరుగుతోందని వారు విమర్శించారు. మొదటిసారి జరిగిన అఖిలపక్ష సమావేశంలో తెలంగాణకు అనుకూలంగా మాట్లాడిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రెండో సమావేశంలో యూ టర్న్ తీసుకున్నారని ఎద్దేవా చేశారు.

     తెలంగాణ విషయంలో తమ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టమైన వైఖరితో ఉన్నారని కొణతాల రామకృష్ణ చెప్పారు. ఈ సారి జరిగే అఖిలపక్ష సమావేశానికి ఇంకా ఆహ్వానం అందలేదని, అందితే పార్టీ తరపున ఒక వ్యక్తినే పంపి నిర్ణయం తెలియజేస్తామన్నారు. ఇతర పార్టీల మాదిరిగా ఇంతకు ముందు ఇద్దరు వ్యక్తులను పంపి భిన్నాభిప్రాయాలు చెప్పబోమని ఆయన స్పష్టం చేశారు.

పార్టీ ఎంపీలకు భయపడే అఖిలపక్షం
     తెలంగాణ ప్రజలను ఎంతో కాలంగా మభ్యపెడుతున్న కాంగ్రెస్ పార్టీ తప్పనిసరి పరిస్థితుల్లో అఖిలపక్ష సమావేశమంటూ మరోసారి మోసం చేస్తోందని బాజిరెడ్డి ధ్వజమెత్తారు. ఎఫ్‌డీఐలపై ఓటింగ్ సమయంలో తెలంగాణ ప్రాంత ఎంపీలు ఓటింగ్‌కు దూరమైతే పరువుపోతుందనే భయంతోనే కాంగ్రెస్ పార్టీ అఖిలపక్షం డ్రామా ఆడుతోందన్నారు. ఈ నాటకాలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

కేంద్ర చట్టం ప్రకారమే సహకార ఎన్నికలు నిర్వహించాలి

     కేంద్ర ప్రభుత్వం ప్రవేశన పెట్టిన నూతన చట్టం ప్రకారమే రాష్ట్రంలో సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని కొణతాల రామకృష్ణ డిమాండ్ చేశారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి రాజకీయాలకు అతీతంగా సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించారన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం సహకార ఎన్నికలపై ద్వంద్వ ప్రమాణాలు అవలంబిస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకు వచ్చిన చట్టం ప్రకారం ఫిబ్రవరి మాసంలో జరపాల్సిన ఎన్నికలను అంతకంటే ముందే నిర్వహించాలని నిర్ణయంతీసుకోవడం దురదృష్టకరమన్నారు.

Back to Top