టీడీపీకి చెంగల వెంకటరావు షాక్

విశాఖపట్నం, సెప్టెంబర్‌ 1: విశాఖ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పెద్దదెబ్బ తగిలింది. పాయకరావుపేట మాజీ శాసనసభ్యుడు చెంగల వెంకట్రావు ఆ పార్టీకి శనివారంనాడు రాజీనామాచేశారు. వచ్చేనెల (అక్టోబర్) 15వ తేదీన వైయస్సార్‌ కాంగ్రెస్‌ గౌరవ అధ్యక్షురాలు వైయస్‌ విజయమ్మ సమక్షంలో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నట్లు ఆయన ప్రకటించారు.

పాయకరావు పేట ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ నేతలే తనను దెబ్బతీశారని, తన ఓటమికి కారణమయ్యారని వారందరిపై ధ్వజమెత్తుతూ.. తన రాజీనామాకు కారణాన్ని ఆయన వివరించారు.

నీతినిజాయితీగా 13 ఏళ్లుగా పార్టీని నమ్ముకొంటే.. ఈ నాయకులంతా తనను అన్ని విధాలా అవమానించారని ఆక్రోశం వెలిబుచ్చారు.

ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు ఇటాలియన్ మహిళ, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాను ఎదుర్కొనగలిగిన దమ్మున్న ఏకైక వ్యక్తి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి అని చంగల పేర్కొన్నారు. అందుకే జగన్‌పై అక్రమకేసులు బనాయించి వేధిస్తున్నారని ధ్వజమెత్తారు.

అప్పుడు ఎన్టీఆర్‌ను గుండెల్లో నిలిపి ఆరాధించినట్లుగా.. ప్రజానీకం ఇప్పడు వైయస్‌ రాజశేఖరరెడ్డిని గుండెల్లో గుడి కట్టి ఆరాధిస్తున్నారన్నారు.

 

Back to Top