<strong>కాకినాడ ప్రజల తీర్పును వైయస్‌ఆర్ సీపీ స్వాగతిస్తుంది</strong><strong>ప్రలోభాలు, బెదిరింపులతో కాకినాడ, నంద్యాల ఎన్నికలు</strong><strong>వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ</strong>హైదరాబాద్: అధికార దుర్వినియోగానికి పాల్పడి నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో గెలిచి అభివృద్ధికి ప్రజలు ఇచ్చిన తీర్పు అని చంద్రబాబు మాట్లాడడం విడ్డూరంగా ఉందని, స్వీట్లు పంచుకోవడం సిగ్గుచేటని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు. కాకినాడ కార్పొరేషన్ ప్రజలు ఇచ్చిన తీర్పును వైయస్‌ఆర్ సీపీ గౌరవిస్తుందన్నారు. చంద్రబాబు ప్రలోభాలు, బెదిరింపులకు ధైర్యంగా పోరాడి 10 మంది కార్పొరేటర్లు గెలిచారన్నారు. హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వాసిరెడ్డి పద్మ కాకినాడ ఫలితాలపై మీడియాతో మాట్లాడారు. కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి, వ్యవసాయమంత్రి ప్రచారంలో దిగి, బెదిరింపులు, ప్రలోభాలకు గురిచేశారన్నారు. నంద్యాల, కాకినాడ అఖండ విజయమని, చంద్రబాబు సంబరాలు చేసుకోవడం విచిత్రంగా ఉందన్నారు. బాబు పాలనకు సంబంధించిన విజయం కాదని, కేవలం అధికార దుర్వినియోగం, డబ్బు పంచడం వల్ల వచ్చిన విజయమన్నారు. <br/>నంద్యాల మోడల్ కాకినాడ కార్పొరేషన్‌లో ప్రయోగించారని వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. ఓటర్లకు చేతిలో రూ.10 వేలు పెట్టడం, ప్రలోభాలకు లొంగకుంటే మెడపై కత్తిపెట్టడమే నంద్యాల మోడల్ అన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 23 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరిగాయని, దాంట్లో టీడీపీకి చిత్తు చిత్తుగా ఓడిపోయిందన్నారు. అధికారంలో ఉండి దక్కించుకున్న ఒక్క ఎమ్మెల్యే, ఒక కార్పొరేషన్ చూసి విర్రవీగడం బాబు విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు.