మహిళల కన్నీటిలో టీడీపీ కొట్టుకుపోవడం ఖాయం

రాజంపేట: మహిళల కన్నీటిలో టీడీపీ ప్రభుత్వం కొట్టుకుపోవడం ఖాయమని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మహిళా విభాగం పట్టణ అధ్యక్షురాలు దండు చంద్రలీల హెచ్చరించారు. మహిళ పార్లమెంటు సదస్సుకు ఎమ్మెల్యే ఆర్‌కే రోజాను పిలిపించి అవమానించిన తీరు బాధాకరంమని ఆమె తీవ్రంగా ఖండించారు. పట్టణంలోని సాతుపల్లెలోని తన స్వగృహంలో సోమవారం చంద్రలీల విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు అండతోనే టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఎక్కడపడితే అక్కడ మహిళలపై రెచ్చిపోతున్నారని ధ్వజమెత్తారు. ఈ మూడేళ్లలో వారు చేసిన అఘాయిత్యాలను పత్రికల్లో చూసి అమ్మాయిలను బయటికి పంపేందుకు తల్లితండ్రులు భయపడాల్సిన దుస్ధితి నెలకొందన్నారు. ప్రశ్నిస్తే చాలు దాడులకు తెగబడటం ఏంటని ప్రశ్నించారు. మహిళలు, రైతులు, కూలీల హక్కులను కాలరాసే విధంగా చంద్రబాబు పాలన సాగుతోందన్నారు. మహిళ ప్రజాప్రతినిధి రోజాను అరెస్టు చేయడం సిగ్గుచేటన్నారు. స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ తన కోడలిని గౌరవించడం మొదట నేర్చుకోవాలని సూచించారు. మహిళలనే కాదు, దళితులను కూడా అవమానించే విధంగా సీఎం చంద్రబాబునాయుడు గతంలో అనేక మార్లు విమర్శలు చేశారని ఆరోపించారు. టీడీపీ మూడేళ్ల పాలనలో అభివృద్ధి అంటే ప్రజలను నానారకాలుగా ఇబ్బందులకు గురిచేయడమేనని దుయ్యబెట్టారు. మహిళలను గౌరవించే సంస్కృతి లేని టీడీపీ సర్కారుకు  2019 ఎన్నికల్లో ఆ మహిళల ఓట్లతో పతనంకాకతప్పదన్నారు. ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వానికి మహిళలు శాపనార్ధాలు అనేకం తగిలాయని గుర్తుచేశారు. మహిళాభివృద్ధికి పాటుపడాల్సిందిపోయి వారి పట్ల సీఎం ఆయన అనుచరగణం చేస్తున్న అహంకారపూరితమైన పోకడలకు చరమగీతం పాడేరోజులు దగ్గరలో ఉన్నాయని ఆమె హెచ్చరించారు. సమావేశంలో మహిళా విభాగం నాయకురాళ్లు సంజీవమ్మ, నవ్యత, బుజ్జి, రమా తదితరులు పాల్గొన్నారు. 

తాజా ఫోటోలు

Back to Top