()టీడీపీ పాలనలో మహిళలకు తీరని అన్యాయం()మహిళలపై ప్రభుత్వం వివక్ష చూపిస్తోంది()నాణేనికి ఒకవైపే కాదు బాబు రెండు వైపులా చూడు
అసెంబ్లీః అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు మహిళలకు వివక్ష తప్పలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉప్పులేటి కల్పన, గిడ్డి ఈశ్వరీలు ఆవేదన వ్యక్తం చేశారు. శాసనసభ వాయిదా పడిన అనంతరం ఎమ్మెల్యేలు ఉప్పులేటి కల్పన, గిడ్డి ఈశ్వరీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. నేడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మహిళలకు ప్రాధాన్యత దక్కుతుందని ఆశించాం.. కానీ నిరాశే ఎదురైందని మహిళా ఎమ్మెల్యేలు వాపోయారు. మహిళల పట్ల చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే, రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేబినెట్ లో 33 శాతం మంత్రి పదవులను మహిళలకు కేటాయించాలన్నారు. డ్వాక్రా మహిళల రుణాలను పూర్తిగా రద్దు చేయాలని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబును కోరారు.
టీడీపీ అధికారంలోకి వచ్చాక మహిళలకు పూర్తి అన్యాయం జరుగుతోందని ఉప్పులేటి కల్పన అన్నారు. మహిళాదినోత్సవం సందర్భంగా చంద్రబాబు చేసిన ప్రకటన...అరచేతిలో వైకుంఠం చూపించేలా ఉందని తూర్పారబట్టారు. ఇచ్చిన హామీలను ఏమాత్రం అమలు చేయని చంద్రబాబు..మహిళలను పూర్తిగా మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. దాన్ని ప్రశ్నిస్తామనే చంద్రబాబు తమకు సభలో మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని ఫైరయ్యారు. బీజేపీ సైతం టీడీపీకి చక్కగా హారతిచ్చి ప్రోత్సహిస్తుందని మండిపడ్డారు.
మహిళలపై ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఈశ్వరి మండిపడ్డారు. మైనర్ బాలిక నుంచి 40 ఏళ్ల ముదక వరకు అత్యాచారాలు, అఘాయిత్యాలు జరుగుతున్నాయన్నారు. ఇంకా మహిళలు భద్రత కోల్పోయి జీవిస్తున్నారన్నారు. చంద్రబాబు నాణెనానికి ఒకవైపు మాత్రమే చూస్తూ ప్రసంగం చేస్తున్నారని, రెండు వైపులా చూడాలని సూచించారు. రాజకీయాలకు అతీతంగా మంత్రి కుమారుడి కేసులో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తన కుమారుడు తప్పు చేస్తే మంత్రి రావెల కిషోర్‌బాబు సిగ్గులేకుండా దాన్ని ప్రతిపక్షనేత వైయస్ జగన్‌పై తోసేయడం దారుణమన్నారు.
చట్టసభలంటే ఒకరికొకరు దుమ్ము ఎత్తిపోసుకోవడం కాదు... ప్రజలకు మనం ఎటువంటి భద్రత కల్పిస్తున్నామనేదే ముఖ్యం అన్నారు. రాష్ట్రంలోని అన్ని మహిళా సంఘాలకు, మహిళలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉండి న్యాయం చేయాలని ఆకాంక్షించారు. చట్టసభల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని గిడ్డి ఈశ్వరి డిమాండ్ చేశారు. శాసనసభలో ఆమె మాట్లాడుతూ... అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఓ మహిళగా జన్మించి, ప్రజలకు సేవ చేసే అవకాశం తనకు రావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఆస్తిహక్కు ఆడపిల్లకు అవసరమని, ఆస్తిహక్కు స్వర్గీయ ఎన్టీఆర్ హయాంలో ఆడపిల్లకు కేటాయించినా, గ్రామాలు, గిరిజన ప్రాంతాల్లో అమలు కావడం లేదన్నారు. ప్రభుత్వం వాటిపై దృష్టిసారించాలని కోరారు.