టీడీపీది రౌజీయిజం

వెల్లంపల్లి శ్రీనివాస్‌
విజయవాడః రాష్ట్రంలో చంద్రబాబు పాలన రౌడీయిజాన్ని తలపిస్తోందని వైయస్‌ఆర్‌ సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్‌ ధ్వజమెత్తారు. విజయవాడ 48వ డివిజన్‌లో ఉన్న వైయస్‌ఆర్‌ సీపీ జెండా దిమ్మెను రాత్రికి రాత్రే కూల్చేసి కొందరు టీడీపీ గుండాలు వారి జెండా దిమ్మెను నిర్మించుకున్నారని మండిపడ్డారు. కార్పొరేషన్‌ అధికారులు ధ్వంసం చేసినా మళ్లీ వైయస్‌ఆర్‌ సీపీ జెండా దిమ్మె స్థలంలో అక్రమంగా నిర్మించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్‌ఆర్‌ సీపీ జెండాను కూల్చేయడానికి టీడీపీ వ్యక్తులు రౌడీల్లా, గుండాల్లా వచ్చి దాడులకు తెగబడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి ఆటోయూనియన్‌ల కార్మికులను టీఎన్‌టీయూసీలో చేరకపోతే మీ ఆటోలు తిరగనివ్వం అంటూ బెదిరింపులకు గురిచేస్తున్నారని,  టీడీపీ బెదిరింపులకు కార్మికులు తలొగ్గొద్దని ఆటో యూనియన్‌ కార్మికులకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. పోలీసులు కూడా పచ్చచొక్కాలకు తోడ్పాటును అందించడంపై మండిపడ్డారు. ఖాకీలు చట్టం ప్రకారం నడుచుకోవాలి కానీ అధికార పార్టీకి వత్తాసు పలకడం ప్రజాస్వామ్యం కాదని సూచించారు. 

బాబుది దుష్టపరిపాలన
పుణ్యశీల, కార్పొరేటర్‌
చంద్రబాబు పరిపాలనలో మహిళా ప్రజాప్రతినిధులకు, అధికారులకు గౌరవం లేకుండా పోయిందని వైయస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ విజయవాడ కార్పొరేటర్‌ పుణ్యశీల మండిపడ్డారు. రూల్స్‌ వ్యతిరేకంగా ఉన్న టీడీపీ జెండాను కూల్చివేసిన కార్పొరేషన్‌ మహిళా అధికారినిపై టీడీపీ నేతలు తీవ్ర దుర్భాషలాడారని చెప్పారు.మహిళా అధికారిని పట్టుకొని యూస్‌లెస్‌ ఫెలో, నీ అంతు చూస్తాం, అధికార పార్టీ డబ్బులిస్తుందా.. లేక వైయస్‌ఆర్‌ సీపీ ఇస్తుందా అంటూ తీవ్ర పదజాలంతో దూషించారని ఆవేదన  వ్యక్తం చేశారు. రూల్స్‌కు వ్యతిరేకంగా రోడ్డు మీదున్న వైయస్‌ఆర్‌ సీపీ జెండాను కూల్చి టీడీపీ జెండాను నిర్మించడానికి మీకు ఏం అధికారం ఉందంటూ వారిని ప్రశ్నించారు. మహిళలను గౌరవిస్తున్నామంటూనే నీచమైన రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. రూల్స్‌ అందరికీ ఒక్కటే ఉంటాయని తెలుగుదేశం పార్టీ నేతలు తెలుసుకోవాలన్నారు. టీడీపీ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడితే  ఊరుకునే పరిస్థితి లేదన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రజల తరుపున పోరాడుతుందని హెచ్చరించారు. 

 
Back to Top