సంతాప తీర్మానాన్ని రాజకీయం చేస్తున్నారు

  • ఎన్‌టీఆర్‌ లాగే భూమాను బాబు మానసిక క్షోభకు గురి చేశారు
  • బాబు చేసిన మోసాన్ని తట్టుకోలేకే క్షోభతో నాగిరెడ్డి కన్నుమూశారు
  • నంద్యాల సీటు మా పార్టీదే..సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటాం
  • మీడియాతో వైయస్ జగన్ చిట్ చాట్ 
అమరావతి: స్వర్గీయ ముఖ్యమంత్రి ఎన్‌టీ రామారావు మాదిరిగానే నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిని చంద్రబాబు మానసిక క్షోభకు గురి చేశారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. భూమా నాగిరెడ్డి సంతాప తీర్మానాన్ని కూడా టీడీపీ రాజకీయం చేస్తుందని వైయస్‌ జగన్‌ అన్నారు. ఇంత దిగజారుడు రాజకీయాలు అవసరమా అని వైయస్‌ జగన్‌ సూటిగా ప్రశ్నించారు. మంగళవారం అసెంబ్లీలోని వైయస్‌ఆర్‌సీఎల్సీ కార్యాలయంలో మీడియాతో వైయస్‌ జగన్‌ చిట్‌చాట్‌లో మాట్లాడారు. అసెంబ్లీ జరుగుతున్న తీరు చూస్తుంటే సిగ్గుతో తల దించుకోవాల్సి వస్తోందన్నారు. తండ్రి మృతి చెందిన 24 గంటల్లోనే అఖిలప్రియను అసెంబ్లీకి  తీసుకురావడం చంద్రబాబు కుసంస్కారానికి నిదర్శనమని వైయస్‌ జగన్‌ అన్నారు.  

భూమా చనిపోయిన విషయం తెలియగానే తాను, అమ్మ ఇద్దరం భూమా అఖిలప్రియతో ఫోన్‌లో మాట్లాడామన్నారు. చంద్రబాబు మంత్రి పదవి ఆశ చూపడం వల్లే భూమా పార్టీ మారారని, ఆ విషయం ఆయనే తమ పార్టీ నేతలతో చెప్పినట్లు గుర్తు చేశారు. పార్టీ మారిన మూడు రోజుల్లోనే బాబు మంత్రి పదవి ఇస్తానని చెప్పారని,  ఏడాది గడిచినా ఇవ్వలేదని భూమానే తమ పార్టీ నేతలతో చెప్పారని పేర్కొన్నారు. చివరి నిమిషంలో చంద్రబాబు నాగిరెడ్డిని మోసం చేశారని, ఆ మానసిక క్షోభను తట్టుకోలేక మృతి చెందారన్నారు. భూమా హుందాతనాన్ని కాపాడేందుకే తాము సభకు వెళ్లలేదన్నారు. తాము సభకు వెళితే చంద్రబాబు చేయించిన తప్పులు, భూమా చేసిన పనులు గురించి మాట్లాడాల్సి వచ్చేదని అన్నారు. అవన్నీ రికార్డుల్లో వెళ్లేవని, అందుకే తాము సభకు వెళ్లలేదని వైయస్‌ జగన్‌ పేర్కొన్నారు.

పార్టీ మారిన వారితో బాబు సభలో రాజకీయాలు మాట్లాడించారని వైయస్ జగన్ మండిపడ్డారు. తనకు, చంద్రబాబుకు నక్కకు నాగ లోకానికి ఉన్నంత తేడా ఉందని అన్నారు. వైయస్‌ఆర్‌సీపీ ప్రారంభించినప్పుడు మా వాళ్లతో రాజీనామా చేయించి మళ్లీ గెలిపించుకున్నానని వైయస్‌జగన్‌ చెప్పారు. భూమా మరణించారు, ఇప్పుడు ఆయనపై వివాదాలు అనవసరమన్నారు. నంద్యాల సీటు మా పార్టీదే అని, గతంలో ఏ పార్టీకి చెందిన ఎమ్మెల్యే మరణిస్తే..ఆ సీటు ఆ పార్టీకే కేటాయించేవాళ్లమని గుర్తు చేశారు. నంద్యాల ఉప ఎన్నికపై సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని వైయస్‌ జగన్‌ పేర్కొన్నారు.
Back to Top