పట్టిసీమ పునాదితో టీడీపీ సమాధి: అంబటి

హైదరాబాద్: పట్టిసీమ ప్రాజెక్టు పునాది టీడీపీకి సమాధిగా మారబోతోందని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు జోస్యం చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రాజెక్టుల యాత్రకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని ఆయన అన్నారు. శనివారం హైదరాబాద్లో అంబటి రాంబాబు విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్పై టీడీపీ నేతలు అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని ఆరోపించారు. వైఎస్ జగన్పై బురద జల్లడం మానుకోవాలని ఆయన ఈ సందర్భంగా టీడీపీ నేతలకు హితవు పలికారు.

రూ. 300 కోట్ల ముడుపులకు కక్కుర్తి పడి ప్రారంభించిన పట్టిసీమ ప్రాజెక్టు చివరకు టీడీపీకి శనిగా మారబోతోందని ఆయన జోస్యం చెప్పారు. ఇప్పటికైనా పట్టిసీమను పక్కన పెట్టి పోలవరాన్ని పూర్తి చేయాలని అంబటి రాంబాబు టీడీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శేషాచలం ఎన్కౌంటర్పై సీఎం చంద్రబాబు నోరు మెదపకపోవడానికి కారణమేంటో అర్థంకావడం లేదన్నారు. దీనిపై చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. అలాగే బాధ్యత గల సీఎం ఈ అంశంపై వెంటనే ప్రజలకు సమాధానం చెప్పాలని అంబటి రాంబాబు... చంద్రబాబుకు సూచించారు.
Back to Top