టీడీపీ యాత్రలకు బ్రేకులుచేయని పనులను చేసినట్టుగా తమ్ముళ్ల ప్రచారంఎక్కడిక్కడ నిలదీస్తున్న ప్రజలుబిక్కముఖం వేసిన పచ్చనేతలు
యలమంచిలి: టీడీపీ నేతలు చేస్తున్న దొంగ యాత్రలకు ఎక్కడిక్కడ బ్రేకులు పడుతున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా...జన చైతన్యయాత్రల పేరుతో ప్రజల్లోకి వెళ్లిన టీడీపీ నేతలను జనం ఎక్కడిక్కడ అడ్డుకుంటున్నారు. వాగ్దానాలు అమలు చేయకుండా ఏం మొహం పెట్టుకొని వస్తున్నారని ప్రజలు నిలదీస్తున్నారు.
విశాఖపట్నం జిల్లాలో తెలుగు తమ్ముళ్లకు డ్వాక్రా మహిళలు భారీ ఝలక్ ఇచ్చారు. జనచైతన్య యాత్రల పేరుతో ప్రచారం చేయడానికి యలమంచిలి మండలం కట్టుపాలెం గ్రామంలో తెలుగుదేశం నాయకులు కరపత్రాలతో ప్రజల్లోకి వెళ్లారు. ఏమీ చేయకుండానే అదీ చేశాం ఇదీ చేశామని చెప్పడంపై డ్వాక్రామహిళలు భగ్గుమన్నారు. చేయని పనులను చేసినట్లుగా కరపత్రాల్లో ముద్రించి ప్రచారం నిర్వహించడంపై కోపోద్రిక్తులయ్యారు.
ఎన్నికలకు ముందు పూర్తిగా రుణమాఫీ చేస్తామన్నారని, అయితే ఇప్పటికీ గ్రామంలో డ్వాక్రా మహిళలకు రుణాలు మాఫీ కాలేదని వారు పచ్చనేతలను నిలదీశారు. రుణాలను మాఫీ చేయాలని మహిళలు నిలదీయడంతో తెలుగు తమ్ముళ్లు బిక్కమొహం వేశారు. ఊర్లో రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని, దోమలు ఎక్కువగా ఉన్నాయని ఏవీ సరిగా లేకపోయినా అన్నీ చేసినట్లు ఎందుకు ప్రచారం చేసుకుంటున్నారని టీడీపీ కార్యకర్తలను స్థానికులు ప్రశ్నించారు. దీంతో, తమ్ముళ్ల ముఖాలు వాడిపోయాయి.