రైతుల జీవితాలతో బాబు సర్కార్ చెలగాటం

పట్నంబజారుః రైతు జీవితాలతో చెలగాటమాడుతున్న చంద్రబాబు సర్కార్‌ భస్మీపటలం అవ్వక తప్పదని వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నం పెట్టే రైతన్న ఆత్మహత్యలకు పాల్పడుతుంటే..కళ్ళుండీ చూడలేని కబోదుల్లా పాలకులు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. బాబు అధికారంలోకి వచ్చిన నాటి నుండి అతివృష్టి..అనావృష్టితో రాష్ట్రం అతాలకుతలమైందని విమర్శించారు. అరండల్‌పేటలోని పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. బాబుది అంతా ప్రచార ఆర్భాటమేనన్నారు. ఈ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేయకుండా మొండి చేయి చూపుతోందని మండిపడ్డారు.  ఆధార్‌ కార్డు,  పాస్‌ పుస్తకం,  బ్యాంకు అకౌంట్‌ పుస్తకాలంటు కాళ్ళు అరిగేలా తిప్పుతున్నారని దుయ్యబట్టారు. కనీసం పండించిన పంటకు గిట్టుబాటు ధర కూడా కల్పించలేని దౌర్భగ్య పరిస్ధితుల్లో చంద్రబాబు ప్రభుత్వం ఉందని విమర్శించారు. దీంతో పాటు రైతు కూలీల పరిస్ధితి మరింత దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పనులు అటకెక్కితే..నిధులు కూడా పక్కదారి పట్టాయని ఆరోపించారు. జిల్లాలో ఉపాధి హామీకి సంబంధించి ఇవ్వాల్సిన వేతనాలపై ఇప్పటికే జిల్లా అధికారులను కలిశామని, స్పందించకుంటే నవంబర్‌ మొదటి వారంలో ఎన్‌ఆర్‌జీసీని ముట్టడిస్తామని స్పష్టం చేశారు. రైతుల సమస్యలు పట్టని ప్రభుత్వాన్ని నిలదీసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరించారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆతుకూరి ఆంజనేయులు మాట్లాడుతూ.... దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి నిష్పక్షపాతంగా రైతు రుణమాఫీ చేశారన్నారు. రుణమాఫీపై రాష్ట్ర ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుధ్ధి లేదని, సిగ్గుఎగ్గు ఉంటే ఇచ్చిన హామీకి కట్టుబడి ఉంటారన్నారు. అన్ని వర్గాల ప్రజల సమస్యలను తెలుసుకునేందుకే జననేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర చేపడుతున్నారని తెలిపారు. సమావేశంలో వైయస్సార్‌ సీపీ నేతలు షేక్‌ గులాంరసూల్, నూనె ఉమామహేశ్వరరెడ్డి, పానుగంటి చైతన్య, బత్తుల దేవానంద్, దుగ్గెంపూడి బాలఅంజిరెడ్డి, షేక్‌ ఖాజామొహీద్దీన్, పల్లపు మహేష్‌ తదితరులు పాల్గోన్నారు.

Back to Top