రాహుల్ గాంధీకి స్క్రిప్ట్ ఇచ్చింది టీడీపీనే

  • ప్రత్యేకహోదా కోసం పోరాడుతున్న ఏకైక పార్టీ వైయస్సార్సీపీ
  • ఏపీ గురించి రాహుల్ కు పూర్తిగా తెలియదేమో..?
  • బాబు తన రెండు కళ్ల సిద్ధాంతంతో ఏపీ కన్ను పొడిచాడు
  • వైయస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి
విశాఖపట్నంః ప్రత్యేకహోదా విషయంలో వైయస్సార్సీపీ ఆసక్తి చూపడం లేదని రాహుల్ గాంధీ మాట్లాడడం పట్ల వైయస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు.  ఏపీ గురించి రాహుల్ కు పూర్తిగా తెలియదేమోనని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.  రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధన కోసం ఈ మూడేళ్లలో వైయస్ జగన్ అనేక పోరాటాలు చేశారని గుర్తు చేశారు. హోదా కోసం దీక్షలు, బంద్ లు, ధర్నాలు, హర్తాళ్ లు, యువభేరి, నిరవధిక నిరాహార దీక్ష సహా  36 ప్రోగ్రామ్స్ చేశారని తెలిపారు. ఏపీకి ప్రాణవాయువు లాంటి ప్రత్యేక హోదా వచ్చేంతవరకు పోరాటం కొనసాగిస్తామని, ప్రత్యేకహోదా ఇచ్చే పార్టీకే కేంద్రంలో తాము మద్దతిస్తామని వైయస్ జగన్ స్పష్టంగా చెప్పారని విజయసాయిరెడ్డి తెలియజేశారు. 

ఏపీ విభజనకు ముఖ్య కారకులు ఎవరో తెలుసుకొని మాట్లాడాలని కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలనుద్దేశించి విశాఖలో జరిగిన పార్టీ ప్లీనరీ సమావేశంలో విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని విడగొట్టాలని చంద్రబాబు కేంద్రానికి లెటర్ రాసి ఆంధ్రప్రదేశ్ కు తీరని ద్రోహం చేశాడని విజయసాయిరెడ్డి నిప్పులు చెరిగారు. బాబు రెండు కళ్ల సిద్ధాంతంతో ఏపీ కన్ను పొడిచాడని, ఏమీ ఎరుగనట్టు ముసలి కన్నీరు కారుస్తున్నాడని ధ్వజమెత్తారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీకి స్నేహపాత్రుడని విజయసాయిరెడ్డి అన్నారు.  రాహుల్ గాంధీ చదివిన స్క్రిప్ట్ టీడీపీ ఇచ్చిందేనని చెప్పారు. హోదా కోసం గత మూడేళ్లుగా పోరాడుతున్న వైయస్సార్సీపీపై నిందలు వేయడం దారుణమన్నారు. టీడీపీ, కాంగ్రెస్ , బీజేపీలు కలిసి రాష్ట్రానికి హోదా ఇవ్వకుండా వైయస్సార్సీపీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని స్పష్టంగా తెలుస్తోందన్నారు.

వైయస్ జగన్ ఇటీవల ప్రధానిని కలిసినప్పుడు ఏపీకి ప్రత్యేకహోదా తో పాటు విశాఖకు రైల్వే జోన్ ఇవ్వాలని మెమొరాండంలో రిప్రజెంటేషన్ కూడ ఇచ్చారని విజయసాయిరెడ్డి తెలిపారు.  రాహుల్ సందేషమిచ్చేముందు అది చదువుకుంటే బాగుండేదన్నారు. ఆయనకు రఘువీరారెడ్డి అయినా చెప్పి వుండాల్సిందని అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన 600హామీల్లో చంద్రబాబు ఏ ఒక్క ప్రధాన హామీ నెరవేర్చలేదని విజయసాయిరెడ్డి విమర్శించారు. రైతు, డ్వాక్రా రుణమాఫీ ఏదీ నెరవేర్చలేదన్నారు. బాబు వస్తే జాబు వస్తందన్న చంద్రబాబు...తన కొడుకుకి తప్ప ఎవరికి ఉద్యోగాలు ఇచ్చిన పాపాన పోలేదన్నారు. రాబోయే ఎన్నికల్లో వైయస్సార్సీపీ గెలుపే లక్ష్యంగా పనిచేసి వైయస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేసుకుందామని విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. 

ఒక్క విశాఖపట్నంలోనే టీడీపీ నేతలు లక్ష ఎకరాల భూములను కబ్జా చేశారని  విజయసాయిరెడ్డి ఆరోపించారు. భూకబ్జా వ్యవహారంలో మంత్రి గంటా శ్రీనివాసరావు సహా పలువురు టీడీపీ ఎమ్మెల్యేల పాత్ర ఉందని, ఈ గ్యాంగ్‌కు మంత్రి నారా లోకేశ్‌ లీడర్‌గా ఉన్నారని పేర్కొన్నారు. వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చాక ఎవరినీ వదిలిపెట్టబోమని, ఈ భూకబ్జా వ్యవహారంపై దర్యాప్తు జరిపించి.. దోచుకున్న సొమ్మునంతా రీకవరీ చేసి పేదలకు పంచుతామని ఆయన అన్నారు. 
 


Back to Top