రాక్షస పాలనతో విసిగెత్తాం: వైఎస్ జగన్

హైదరాబాద్: చంద్రబాబు రాక్షస పాలనతో ప్రజానీకం విసిగెత్తిపోయారని ప్రతిపక్ష నాయకుడు వైఎస్
జగన్ అభిప్రాయ పడ్డారు. అసెంబ్లీ సమావేశాలు నిర్వహించిన తీరు, చంద్రబాబు ప్రభుత్వం
సాగిస్తున్నచెడ్డ పరిపాలన మీద ఆయన హైదరాబాద్ లోని పార్టీ కేంద్రకార్యాలయంలో
మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు చేస్తున్న అన్యాయాలు ఆయనకే అద్దం పెట్టి
చూపించేందుకే ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు.

 రాష్ట్రాన్ని పట్టి కుదిపేస్తున్న సెక్సు
రాకెట్ అంశాన్ని ఐదు రోజుల్లో ముగించేందుకు తాపత్రయ పడ్డారని, అందుకోసం ఎన్నెన్నో
నాటకాలు ఆడారాని వైఎస్ జగన్ చెప్పారు.

‘‘ టైం పాస్ కోసం స‌భ న‌డిపారు. శీతాకాల స‌మావేశాల్లో మొద‌టిరోజు వాయిదా
తీర్మానం ఇచ్చాకా,
రెండు సార్లు స‌భ
వాయిదా ప‌డిన‌ త‌రువాత చంద్ర‌బాబుకు అంబేద్క‌ర్ గుర్తుకు వ‌చ్చారు. అంబేద్క‌ర్‌ను
అడ్డుపెట్టుకునేందుకు ప్ర‌య‌త్నం చేశారు. ఏనాడు ఆయ‌న‌కు అంబేద్క‌ర్ గుర్తుకు రాలేదు. జ‌యంతి, వ‌ర్ధంతి స‌భ‌లు న‌డ‌ప‌లేదు. కానీ సెక్సు రాకెట్ నుంచి తప్పించుకొనేదుకు
అంతటి గొప్ప వ్యక్తిని కూడా అడ్డగోలు రాజకీయాల కోసం వాడుకొన్నారు.’’ అని వైఎస్
జగన్ మండిపడ్డారు.

తర్వాత రోజు మరెన్నో డ్రామాలకు తెర తీశారని వైఎస్ జగన్ వివరించారు.

‘‘ సెక్సు రాకెట్ నుంచి చ‌ర్చ‌ను ప‌క్క‌దారి ప‌ట్టించేందుకు రాష్ట్ర‌వ్యాప్తంగా
వ‌డ్డీవ్యాపారుల‌పై దాడులు చేయించారు. సాధార‌ణ కేసుగా కొట్టివేసేందుకు సీఎం ప్ర‌య‌త్నించారు.
ఈ వ్య‌వ‌హారంలో ప్ర‌శ్నిస్తుంద‌ని రూల్స్ కు విరుద్ధంగా ఎమ్మెల్యే రోజ‌మ్మ‌ను
ఏడాది పాటు స‌స్పెండ్ చేశారు. ’’ అని ఆయన నిలదీశారు. సెక్సు రాకెట్ నుంచి తనను,
తెలుగు తమ్ముళ్లను రక్షించేందుకు అన్ని పన్నాగాలు పన్నారని వైఎస్ జగన్
పేర్కొన్నారు.

తమను తిట్టడమే పనిగా అసెంబ్లీ సమావేశాలు జరిగాయని ఆయన సోదాహరణంగా వివరించారు.
ఈ హడావుడిలోనే కీలక బిల్లులు ఆమోదించుకొన్నారని ఆయన మండిపడ్డారు.

 ఎలాంటి చ‌ర్చ లేకుండా 8 కీల‌క‌మైన బిల్లుల‌కు ఆమోదం తెలిపారని,
వీటిలో ఐదు బిల్లుల్న అయితే అలా పెట్టగానే ఆమోదించి పంపించారని వివరించారు.

 బాక్సైట్ తవ్వకాల విషయంలో అన్నీ అబద్దాలు ఆడుతున్నారని వైఎస్ జగన్ వివరించారు.

‘‘బాక్సైట్‌పై  2011లో గ‌వ‌ర్న‌ర్‌కు లేఖ రాశారు. అప్ప‌ట్లో
పంచాయ‌తీ తీర్మానం జ‌రుగ‌లేద‌ని, ప‌ర్య‌వ‌రాణానికి ముప్పు ఉంద‌ని అభ్యంత‌రాలు
తెలిపారు. ఇప్పుడు మాత్రం బాక్సైట్ 

త‌వ్వ‌కాల కోసం ప్ర‌తాప‌రెడ్డి అనే వ్య‌క్తి రూ.5300 కోట్ల‌తో పెట్టుబ‌డులు పెట్టారని శ్వేత
పత్రంలో చెబుతారు. జీవో-97ను ఆయన ర‌ద్దు చేయ‌డు. ప్ర‌తాప్‌రెడ్డి
కోర్టుకు వెళ్లి తవ్వకాలకు ఆమోదం తెచ్చుకొనే మాదిరిగా నాటకాన్ని
నడిపిస్తున్నారు.’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా ల్యాండ్ మాఫియా చెలరేగిపోతోందని వైఎస్ జగన్ ఉదహరించారు.
ప్రభుత్వమే ఇందుకు ప్రోత్సహిస్తోందని అడ్డగోలుగా భూముల్ని కట్ట బెడుతోందని
ఉదాహరణలతో సహా చెప్పారు. ‘‘ అవినీతి ఏ స్థాయికి చేరిందంటే విలువైన భూములు చౌక‌ధ‌ర‌ల‌కు
క‌ట్ట‌బెడుతున్నారు. బాల‌క్ర‌ష్ణ బంధువుల‌కు 2013లో ద‌ర‌ఖాస్తు చేసుకున్నార‌ని 500 ఎక‌రాలు రూ.250 కోట్ల విలువైన భూముల‌ను రూ.5 కోట్ల‌కు అప్ప‌గించారు. చిత్తూరుజిల్లా తిరుపతి దగ్గర
కరకంబాటి  దగ్గర గ‌ల్ల అరుణ‌మ్మ‌కు 22 ఎక‌రాలు ఒక్కొ ఎక‌రా ప్ర‌స్తుతం 

రూ.2.50 కోట్ల ధ‌ర ఉంది. దీన్ని కారుచౌక‌గా అప్ప‌గించారు.
దీన్ని రూ.22 ల‌క్ష‌ల‌కు ఇచ్చారు. మ‌రో దారుణ‌మైన‌ విషయం
విశాఖపట్నంలో జరిగింది. విశాఖ ప‌ట్నంలోని ఖరీదైన ప్రాంతమైన మధురపూడి దగ్గర ఎక‌రా
రూ.15 కోట్లు ఉంటుంది. కానీ రూ.50 ల‌క్ష‌ల‌కు ఇస్తున్నారు. ఏపీఐఐసీ నుంచి చంద్ర‌బాబు
బినామీల‌కు ఇదే రూ.50 ల‌క్ష‌ల‌కు ఇచ్చేలా మార్గం సుగుమం
చేస్తున్నారు. శ్రీ‌కాకుళం ప‌ట్ట‌ణంలో, కాకినాడ నగరంలో  త‌న పార్టీ ఆఫీస్‌ లకు భూములు ఇచ్చేందుకు జీవోలు
ఇచ్చేశారు’’ అని వైఎస్ జగన్ ఉదాహరణలు చెప్పారు.

ఇక, రాజధాని విషయంలో అయితే అడ్డగోలు కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు.

‘‘రాజ‌ధాని ప‌రిధిలోని సింగ‌పూర్ దేశానికి చెందిన ప్ర‌యివేట్ కంపెనీకి భూములు 

ఇచ్చేందుకు కుట్ర చేస్తున్నారు. నామినేష‌న్ ప‌ద్ద‌తిలో దొంగ‌దారిలో ఇచ్చేందుకు
ఏకంగా అసెంబ్లీలో 99 ఏళ్ల‌కు లీజ్‌కు 3 వేల ఎక‌రాలు ఇస్తున్నారు. ’’ అని
వివరించారు. కల్తీ మద్యం వ్యవహారానికి చంద్రబాబు ప్రభుత్వానిదే బాధ్యత అని
వివరించారు.

ఇసుక మాఫియాలో చంద్రబాబు, ఆయన
కుమారుడికే ముడుపులు అందుతున్నాయని చెప్పారు. ‘‘చంద్ర‌బాబు సీఎం కాక‌ముందు రూ.40 క్యూబిక్ మీట‌ర్‌. ప్ర‌స్తుతం 15 రేట్లు పెరిగింది. ఇసుక మీద 15 నెల‌ల కాలంలో రూ.800 కోట్ల ఆదాయం అంటున్నారు. రూ.1500 కోట్ల ఆదాయం వ‌చ్చి ఉండాలి. సీఎం లెక్క‌ల
ప్ర‌కారం రూ.600 కోట్లే ఆదాయం అంటారు. నేరుగా లోకేష్‌కు
ఇందులో వాటాలు వెళ్తున్నాయి. ’’ అని వివరించారు.

మొత్తంగా రాష్ట్రంలో అన్ని రకాలుగా అవినీతి, విచ్చలవిడితనం పెరిగిపోయి మాఫియా
సంస్క్రతి ఏర్పడిందని వైఎస్ జగన్ చెప్పారు.  ఇసుక మాఫియా,
ల్యాండ్ మాఫియా, మద్యం మాఫియా, సెక్సు రాకెట్ మాఫియా నడుస్తోందని ఆయన అన్నారు.
స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానం తెస్తున్నట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 

Back to Top