తరలిపోతున్న పరిశ్రమలు

మహేశ్వరం:

ఏటా పదిహేను లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తానని ముఖ్యమంత్రిగారు చెప్పారనీ, అందులో పది శాతం మందికి కూడా ఇంతవరకూ ఉపాధి కల్పించలేదనీ దివంగత మహానేత తనయ శ్రీమతి వైయస్ షర్మిల చెప్పారు. మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర సందర్భంగా ఆమె బుధవారం మహేశ్వరం నియోజకవర్గంలో పర్యటించారు. ఆరు వేల లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తెస్తానని కిరణ్‌కుమార్‌రెడ్డి గారు గొప్పలు చెప్పుకుంటున్నారని చెప్పారు. కరెంటు సరఫరా లేక ఉన్న పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయి, కొన్ని పరిశ్రమలు ఉత్పత్తిని తగ్గించుకున్నాయి, మరికొన్ని పరిశ్రమలు నడిచే పరిస్థితి లేకపోవడంతో కంపెనీల్లో పనిచేసే లక్షలాదిమంది యువకులు ఉద్యోగాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. వాళ్ల కుటుంబాల భవిష్యత్తు రోడ్డున పడుతోంది. ఇవేవీ మీకు పట్టదా..?’’ అని షర్మిల ప్రశ్నించారు. ముఖ్యమంత్రి  నిర్లక్ష్యంతోనే రాష్ట్రంలో విద్యుత్తు సంక్షోభం ఏర్పడిందన్నారు. పక్క రాష్ట్రాల్లో కూడా విద్యుత్తు సంక్షోభం ఉన్నప్పటికీ వాళ్లు ముందస్తు ప్రణాళికతో విద్యుత్తు కొనుగోలు చేసి సమస్యను అధిగమించారనీ, మన రాష్ట్రంలో మాత్రం ముఖ్యమంత్రి తన సీటును పదిలపరుచుకునే పనిలో పడి ప్రజా సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్నారనీ ఆమె విమర్శించారు.

     ' ప్రభుత్వం ఉండి కూడా ప్రజలకు ప్రయోజనం లేదు. వైఎస్సార్ 7 గంటల ఉచిత విద్యుత్తు ఇస్తానన్నారు... ఇచ్చి చూపించారు. ఆయన బతికే ఉంటే 9 గంటల ఉచిత విద్యుత్తు ఇచ్చి తీరేవారు. కానీ ఈ పాలకులు ఉచిత విద్యుత్తును ఏ క్షణంలోనైనా ఎత్తివేసినా ఆశ్చర్యం లేదు. కరెంటు రెండు మూడు గంటలైనా ఉండడం లేదని రైతులు, ప్రజలు కన్నీళ్లు పెట్టుకుంటుంటే మన ముఖ్యమంత్రి.. కరెంటు లేకపోతే ఏం? కిటికీలు, తలుపులు తీసి పడుకోండి అని అంటున్నారు. ఆయన మాత్రం ఏసీలో ఉంటూ.. ప్రజలకు ఇలా ఉచిత సలహాలు పడేస్తారు’’ అని విమర్శించారు.

అవిశ్వాసం పెట్టు బాబు!
     చంద్రబాబు ఆయన హయాంలో నాలుగు వేల మందిని పొట్టనబెట్టుకొని ఏ గ్రామాలనైతే శ్మశానాలుగా మార్చారో మళ్లీ అవే గ్రామాల్లో పాదయాత్ర పేరుతో తిరుగుతున్నారని షర్మిల నిప్పులు చెరిగారు. ‘గ్రామాల్లో తిరుగుతూ వైయస్ చేసిన వాగ్దానాలనే తాను కూడా చేస్తానంటూ ప్రజలకు హామీలు ఇస్తున్నారు. వైయస్ఆర్‌గారు రైతుల కోసం 12 వేల రుణ మాఫీ చేస్తే.. ఇప్పుడు నేను కూడా ఇస్తాను అని చెప్తున్నారు. ఫీజు రీయింబర్సుమెంటు పథకం అమలు చేస్తే.. ఇప్పుడు నేను చేస్తానని చెప్తున్నారు. రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ చేసి చూపిస్తే.. ఆయన ఇప్పుడు నేను కూడా చేస్తానని వాగ్దానం చేస్తున్నారు.
అయ్యా..! చంద్రబాబునాయుడు గారు ఇప్పుడు మీరు చేస్తున్న వాగ్దానాలన్నీ వైయస్ఆర్ ఏనాడో చేసి చూపించారు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు నక్క జిత్తుల మాటలతో ప్రజలను నమ్మించడానికి మీరు ఎన్ని వాతలు పెట్టుకున్నా.. నక్క నక్కే..పులి పులే..’ అని అన్నారు. చంద్రబాబు నాయుడుకు వాగ్దానాల్లో నిజాయతీ ఉండద ని, ఆయనకు నిజంగా ప్రజలపై ప్రేమే ఉంటే.. పాదయాత్రల పేరుతో కాలయాన చేయక ఈ ప్రభుత్వంపై ఎందుకు అవిశ్వాస తీర్మానం పెట్టడం లేదని నిలదీశారు. ఓవైపు అసమర్థ ప్రభుత్వం అంటూనే మరోవైపు అదే ప్రభుత్వాన్ని ఎందుకు కాపాడుతున్నారని ప్రశ్నించారు.

జాబులు ఎవరికి ఇస్తున్నాడమ్మా?
     ‘జొన్నరొట్టెలు తినుకుంటా పిలగాండ్లను సదివించినాం. ఒక్కని కన్నా గౌరిమెంటు ఉద్దానం (ప్రభుత్వ ఉద్యోగం) లేదు. టీవీల జూత్తే కిరణ్‌కుమార్‌రెడ్డి ఆరు లచ్చల మంది పిలగాండ్లకు ఉద్దానాలు ఇత్తున్నా అని చెప్పుతుండు. ఆయన ఎవరికి ఇత్తున్నాడమ్మా..? మా పిల్లలను సూడు.. మా బతుకులు సూడు! సిన్నతనాన పిల్లగాండ్లను మాతోటి పనికి తీసుకొనిపోయినా... వాడు ఈపాటికి సేతికొచ్చేటోడు. ఇటు జాబ్ లేదు.. అటు ఎండకు పని జేయలేడు. పిల్లలు ఎలా బతకాలమ్మా?’’ అని సిరిగిరిపురం గ్రామానికి చెందిన తిరుపమ్మ అనే మహిళ షర్మిలతో ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం మన్సాన్‌పల్లి నుంచి ప్రారంభమైన షర్మిల పాతయాత్ర మహేశ్వరం, సిరిగిరిపురం, హర్షగూడ, మంఖాల్ మీదుగా తక్కుగూడ కు చేరింది. అన్ని గ్రామాల్లో షర్మిల రచ్చబండ కార్యక్రమంలో పాల్గొని ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రాత్రి 7 గంటలకు తక్కుగూడ శివారులో ఏర్పాటు చేసిన బస ప్రాంతానికి చేరుకున్నారు.

Back to Top