సూర్యాపేటలో నేడు భారీ బహిరంగసభ

సూర్యాపేట 11 నవంబర్ 2012: టిడిపి సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వర రావు ఆదివారం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. వైయస్ఆర్ సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ సమక్షంలో ఆయన వైయస్ఆర్ సీపీలో చేరతారు. దీని కోసం సూర్యాపేటలో ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు భారీ బహిరంగసభను నిర్వహిస్తున్నారు. సుమారు 30 ఎకరాల విస్తీర్ణంలో నిర్వహిస్తున్న సభకు దాదాపు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిట్టా బాలకృష్ణారెడ్డి, కేకే. మహేందర్ రెడ్డి, సోమిరెడ్డి తదితర నాయకులు బహిరంగసభ ఏర్పాట్లను పర్య వేక్షి స్తున్నారు. సూర్యాపేట, తుంగతుర్తి, హుజూర్ నగర్ నియోజకవర్గాల నుండి ఈ సభకు భారీగా జనం హాజరౌతారని భావిస్తున్నారు. భూవనగిరి సభ విజయవంతమైన నేపథ్యంలో సూర్యాపేట సభకు కూడా భారీగా జనం వస్తారని అంచనా వేస్తున్నారు. వైయస్ఆర్ సీపీ నాయకులు కేకే.మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, నల్లగొండ జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలుస్తుందన్నారు. వైయస్ఆర్ సీపీలో బలమైన నేత సంకినేని చేరికతో నల్లగొండ జిల్లాలో రాజకీయ సమీకరణలు మారతాయని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే ఉప్పునూతల, జిట్టా వంటి నేతలు వైయస్ఆర్ సీపీ లో చేరిన విషయం తెలిసిందే.

Back to Top