బినామీలు: శ్రీ కళింగ గ్రీన్‌టెక్ కెమికల్స్, శివరామకృష్ణ ►కొనుగోలు 700 ఎకరాలు ►చెల్లించినది రూ. 35 కోట్లు ►ప్రస్తుత విలువ రూ. 700 కోట్లు ఆయనో కార్పొ‘రేటు’ రాజకీయ నేత. సీఎం చంద్రబాబునాయుడు కోటరీలో ముఖ్యుడు. బ్యాంకుల నుంచి వందలాది కోట్ల రూపాయలను అప్పుగా తీసుకుని ఎగ్గొట్టడంలో ఆయనది అందెవేసిన చేయి. ఆ జగజ్జంత్రీ నేర్పరితనానికి మెచ్చి రాజ్యసభకు పంపిన చంద్రబాబు.. నరేంద్రమోదీ కేబినెట్‌లో చోటు దక్కేలా చేశారు. ఆయనే కేంద్ర శాస్త్ర, సాంకేతిక సహాయ మంత్రి యలమంచిలి సత్యనారాయణ చౌదరి అలియాస్ సుజనా చౌదరి. బ్యాంకులకు రూ.100 కోట్లకుపైగా టోపీ పెట్టి వెనకేసుకున్న సొమ్ముతో ఆయన రాజధాని ప్రాంతంలో ఏకంగా 700 ఎకరాల భూములు కొనుగోలు చేశారు. మరో 130 ఎకరాలకుపైగా అటవీ భూమిని కబ్జా చేసే యత్నాలను ముమ్మరంగా సాగిస్తున్నారు. సోదరుడి పీఏ పేరుతో... సుజనా చౌదరి సోదరుడు యలమంచిలి జతిన్ కుమార్. తన సోదరుడి వద్ద వ్యక్తిగత సహాయకుడిగా పని చేసే హర్షానంద పేరుతో శ్రీ కళింగ గ్రీన్ టెక్ కెమికల్స్ సంస్థను ఏర్పాటు చేశారు. ఆ సంస్థ పేరుతో రాజధాని ప్రకటనకు ముందే కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం గుడిమెట్లలో సర్వే నంబర్లు 399-7, 402-1ఏ, 403-4, 5, 6, 404-1, 5, 6, 9బీ, 11, 12, 410-2, 412, 413, 415, 416, 417-4, 427-2, 428-1, 2, 429, 431, 432-1, 433, 434, 437లలో 126.44 ఎకరాల భూమిని ఎకరం రూ.ఐదు లక్షల చొప్పున కొనుగోలు చేశారు. రాజధాని ప్రకటన తర్వాత అక్కడ ఎకరం రూ.50 లక్షలకు పైగా పలుకుతుండటం గమనార్హం. అంటే.. రాజధాని ఎక్కడ వస్తుందన్న సమాచారం ముందే తెలుసుకున్న కేంద్ర మంత్రి గుడిమెట్ల రైతులను మోసం చేసి రూ.56.89 కోట్ల మేర లబ్ధి పొందినట్లు విశదమవుతోంది. ఇప్పుడు ఆ భూములకు సమీపంలోనే 130 ఎకరాల విస్తీర్ణంలో అటవీ భూములు ఉన్నాయి. వాటిని కబ్జా చేయడానికి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఆ అటవీ భూముల్లోకి మేతకు పశువులను కూడా వెళ్లనివ్వకుండా సుజనా చౌదరి నియమించిన రౌడీలు అడ్డుకుంటున్నారనిగుడిమెట్ల వాసులు వాపోతున్నారు. ఆగని దోపిడీ... సుజనా చౌదరి భూదోపిడీ వీరులపాడు, కంచికచర్ల మండలాలకూ విస్తరించింది. వీరులపాడు మండలం పొన్నవరంను దత్తత తీసుకున్న సుజనా చౌదరి ఆ గ్రామంలో తన తండ్రి వై.జనార్దనరావు పేరు తో సర్వే నంబరు 38-1లో 5.39 ఎకరాలు, సోదరుడు వై.శివ రామకృష్ణ పేరుతో సర్వే నంబరు 41లో 3.5 ఎకరాలు కొనుగోలు చేశారు. కంచికచర్ల మండలం కీసర వద్ద సర్వే నంబరు 116/3లో 3.60 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ఇదే రీతిలో రాజధాని ప్రాంతంలో కృష్ణా జిల్లా చందర్లపాడు, కంచికచర్ల, వీరులపాడు, గుంటూరు జిల్లా మంగళగిరి మండలాల్లో 700 ఎకరాలకుపైగా భూమిని సుజనా చౌదరి కొనుగోలు చేసినట్లు తెలిసింది. తన వద్ద డబ్బులు ఉన్నాయని.. భూములు కొనుగోలు చేస్తే తప్పేమిటని రాజధాని ప్రకటన వెలువడ్డ తర్వాత విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ సుజనా అంగీకరించడం.. వారు రాజధాని రైతులను మోసం చేసి కుట్రపూరితంగా భూములు కొన్నారనడానికి నిదర్శనం.