‌రాష్ట్ర విభజన తీరు సరైన సంప్రదాయం కాదు

న్యూఢిల్లీ, 16 నవంబర్ 2013:

ఒక రాష్ట్రాన్ని విభజించడం అంటే అదో అతి పెద్ద అంశమని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన విషయంలో ఇప్పుడు జరుగుతున్నది సరైన సంప్రదాయం కాదని ఆయన వ్యాఖ్యానించారు. ఇదే జరిగితే కేంద్రంలో అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా ఎన్నికల్లో లబ్ధి కోసం ఏ రాష్ట్రాన్నయినా విభజించే అవకాశం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు.‌ సమైక్య పోరాటానికి జాతీయ నాయకుల మద్దతు కూడగట్టేందుకు పార్టీ నాయకుల బృందంతో ఢిల్లీ వచ్చిన శ్రీ జగన్‌ శనివారంనాడు మీడియాతో మాట్లాడారు.

మనం ప్రజాస్వామ్యంలో ఉన్నా, ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రాన్ని విభజించాలనుకుంటున్నారని, రాష్ట్రాన్ని విభజించాలంటే అసెంబ్లీ తీర్మానం తప్పనిసరి అని చెప్పారు. ఆర్టికల్‌ -3ని సవరించేలా పోరాడతామని, భావసారూప్య పార్టీలతో కలిసి ముందుకు వెళతామని తెలిపారు. భాషాప్రయుక్త ప్రాతిపదిక మీద ఉమ్మడి రాష్ట్రం ఏర్పడినప్పుడు హైదరాబాద్‌, ఆంధ్ర అసెంబ్లీలు రెండింట మూడు వంతుల మెజార్టీతో తీర్మానాన్ని ఆమోదించాయని, నాడు తెలంగాణ బిడ్డ, హైదరాబాద్ ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు‌ విశాలాంధ్ర ఏర్పాటు కావాలన్న సదాశయంతో తన పదవికి కూడా రాజీనామా చేశారని గుర్తుచేశారు. తెలుగు ప్రజలంతా ఒక్కటిగా ఒకే రాష్ట్రంలో కలిసి ఉండాలని ఆయన ఆకాంక్షించారన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ ప్రస్తుతం బడ్జెట్‌ దేశంలో మూడవ అతి పెద్దదని, దేశంలోనే తెలుగు రెండవ అతిపెద్ద భాష అయినా.. రాష్ట్ర ప్రజలను విడగొట్టాలనుకుంటున్నారని శ్రీ జగన్ మండిపడ్డారు. ఆంధ్రప్రదే‌శ్‌లో ఇవాళ జరిగిన విభజననే రేపు బీహార్‌లో జరగవచ్చు, తమిళనాడులో జరగవచ్చు, లేదా బెంగాల్‌లో కూడా జరగవచ్చని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. రాజకీయ లబ్ధి కోసం పార్లమెంటులో 272 సీట్లున్న ఏ ప్రభుత్వమైనా ఒక్క గీత గీసి రాష్ట్రాన్ని విభజించామని చెబుతాయని అన్నారు. ఏపీ విభజనతో కొత్త సంప్రదాయం ఒకటి మొదలవుతోందని, దీన్ని అడ్డుకోవాలని శ్రీ జగన్ పిలుపునిచ్చారు.

Back to Top