ఇంకెంత కాలం మోసం చేస్తారు...!

పట్టిసీమ పేరుతో ప్రభుత్వం రాయలసీమ ప్రజలను మభ్యపెడుతోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు. కేవలం బ్రాండ్ కోసమే ప్రభుత్వం పట్టిసీమ అంటూ హడావుడి చేస్తోందని ఆరోపించారు. పంపులు బిగించకుండా, నీళ్లు తీసుకురాకుండా నధుల అనుసంధానం జరిగిపోయిందని చెప్పుకుంటున్నారు. నిధుల అనుసంధానం జరిగిందే తప్ప ఇంకేమీ జరగలేదని శ్రీకాంత్ రెడ్డి స్పష్టం చేశారు. పట్టిసీమ వల్ల రాష్ట్రానికి ఎలాంటి లాభం లేదన్నారు. 

శ్రీశైలం రిజర్వాయర్ లో పూర్తిస్థాయి నీటిమట్టం తీసుకురావాలన్న కనీస ఇంగితజ్ఞానం కూడా ప్రభుత్వానికి లేకపోయిందని శ్రీకాంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. డ్యాంలో నీళ్లు నిలిపే ప్రయత్నం చేయకుండా వదిలేయడం దారుణమన్నారు. రాయలసీమకు ముఖ్యమంత్రి అయి ఉండి రాయలసీమ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని మండిపడ్డారు. నీను నిప్పు అని చెప్పుకునే చంద్రబాబు...ప్రాజెక్ట్ ల్లో జరుగుతున్న అవినీతిపై ఎందుకు స్పందించడం లేదని శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. ముఖ్యమంత్రికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ప్రాజెక్ట్ ల పేరుతో జరుగుతున్న అవినీతిపై విచారణ చేయించాలన్నారు.   

Back to Top