విశ్వసనీయత- కుతంత్రం మధ్యే పోరు

విజయనగరం:

విశ్వసనీయత, కుతంత్రం మధ్యే రాబోయే ఎన్నికల పోరు జరగబోతోందని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో 45 రోజుల్లోపుగానే వస్తున్న ఎన్నికల్లో ఒక వైపున నిజాయితీ, విశ్వసనీయత ఉంటే... మరో వైపున అధర్మం, కుళ్లు, కుతంత్రాలు ఉండి పోటీపడుతున్నాయన్నారు. విజయనగరం జిల్లా నెల్లిమర్లలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన ‘వైయస్ఆర్ జనభేరి’ బహిరంగ సభలో శ్రీ జగన్మోహన్‌రెడ్డి అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి మాట్లాడారు. విజయనగరం ఎంపీ అభ్యర్థిగా బేబీ నాయనను, నెల్లిమర్ల అసెంబ్లీ అభ్యర్థిగా పెనుమత్స సురేశ్‌బాబును ఆయన ప్రకటించారు. వీరిద్దరికీ ఓట్లు వేసి అత్యంత భారీ మెజారిటీ ఇవ్వాలని విజ్ఞప్తిచేశారు.

‘తొమ్మిదేళ్ల చంద్రబాబు దుర్మార్గపు పాలనకు చరమగీతం పాడుతూ అధికారంలోకి వచ్చిన మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి.. రాష్ట్ర ప్రజలకు ఓ సువర్ణయుగాన్ని అందించారు. దేశానికే ఆదర్శనీయంగా నిలిచారు. ‌సీఎం అంటే ఇలా ఉండాలి అని చాటి చెప్పారు. ఇచ్చిన మాట తప్పకుండా పరిపాలించి విశ్వసనీయతకు అర్థం చెప్పారు. ఆ దివంగత రాజశేఖరరెడ్డి నాకు వారసత్వంగా ఇచ్చింది విశ్వసనీయతే. విశ్వసనీయత అన్న పదానికి అర్థం చంద్రబాబుకు ఈ జన్మకు తెలియనే తెలియదు. ఏ గడ్డి కరిచి అయినా మళ్లీ అధికారంలోకి రావాలని చూస్తున్నారు. అందుకే నోటికొచ్చిన హామీలిచ్చి ప్రజలను పట్టపగలే మోసం చేయాలని చూస్తున్నారు’ అని శ్రీ వైయస్ జగ‌న్ ‌ధ్వజమెత్తారు.

అందుకే చంద్రబాబు కల్లబొల్లి హామీలు :
'చంద్రబాబు నాయుడికి ఇవే చివరి ఎన్నికలు. ఆ తర్వాత ఆయన పార్టీ ఉంటుందో లేదో చెప్పలేం. అందుకే ఇప్పుడు ఏదో విధంగా అధికారంలోకి రావాలని ఆయన నోటికొచ్చినట్టు కల్లబొల్లి హామీలిస్తున్నారు. చంద్రబాబు మాదిరి నాకు అబద్ధాలాడడం చేతకాదు. చంద్రబాబులా నేను దొంగ హామీలు ఇవ్వలేను. ఆయన మాదిరిగా విశ్వసనీయతకు పాతరేయడం నాకు చేతకాదు. చంద్రబాబు కంటే పాతికేళ్లు చిన్నవాణ్ణి, ఇచ్చిన మాట మీద నిలబడే వ్యక్తిని. పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచి ఆయన పదవి లాక్కున్న చంద్రబాబు నాయుడు.. ప్రజలకు వెన్నుపోటు పొడవరని గ్యారంటీ లేదు. తన తొమ్మిదేళ్ల పాలనలో ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీనీ నిలబెట్టుకోని చంద్రబాబు.. ఇప్పుడు కూడా ప్రజల్ని మోసం చేయడానికి ఆల్ ఫ్రీ అంటూ హామీలిస్తున్నారు. అధికారంలోక రావడమే ధ్యేయంగా కళ్లార్పకండా అబద్ధాలు ఆడుతున్నారు‌' అని శ్రీ జగన్‌ నిప్పులు చెరిగారు.

'రాష్ర్టంలో రూ. లక్షా 27వేల కోట్ల రైతు రుణాలున్నాయి. డ్వాక్రా సంఘాలకు రూ.20వేల కోట్ల రుణాలున్నాయి. మన రాష్ర్ట బడ్జెట్ రూ. లక్షా 25 వేల కోట్లయితే చంద్రబాబేమో రూ.లక్షా 47 వేల కోట్ల రుణాలను మాఫీ చేస్తానంటూ ఆచరణ సాధ్యంకాని హామీలిస్తున్నారు. ఇప్పుడు‌ మళ్ళీ ఇంటికో ఉద్యోగం ఇస్తానని కొత్త హామీ ఇస్తున్నారు. అసలు రాష్ట్రంలో ఎన్ని ఇళ్లున్నాయో చంద్రబాబుకు తెలుసా? ఈ రాష్ర్టంలో మూడున్నర కోట్ల ఇళ్లు ఉన్నాయి. అంటే మూడున్నర కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చంద్రబాబు ఆచరణ సాధ్యం కాని హామీలిస్తున్నార'ని దుయ్యబట్టారు.

ఐదు సంతకాలు.. మూడు పనులు :
‌'మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం రాష్ట్రంలో రాజకీయం, పాలన రెండూ భ్రష్టుపట్టిపోయాయి. అలాంటి ఈ వ్యవస్థలో మళ్లీ నేను మార్పు తెస్తా. నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున అదే వేదికపై ప్రజల తలరాతలు మార్చేసేలా ఐదు సంతకాలు చేస్తా. వీటితో పాటు మరో మూడు ముఖ్యమైన పనులు చేస్తా. మొదటి  సంతకం ‘వైయస్ఆర్ అమ్మ ఒడి’ పథకంపై చేస్తా. అవ్వా తాతల పింఛ‌న్ రూ.700కు పెంచుతూ రెండో సంతకం, రైతన్నల కోసం రూ.3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి‌పై మూడో సంతకం, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తూ నాలుగో సంతకం, ప్రతి గ్రామంలోనూ ఒక ఆఫీస్ తెరిచి.. ఆరోగ్యశ్రీ, పింఛ‌న్, రేష‌న్ ఇలా ఏ కార్డు కావాలన్నా అక్కడే ఇచ్చేలా ఐదో సంతకం చేస్తా‌' అని శ్రీ వైయస్‌ జగన్‌ భరోసా ఇచ్చారు.

వీటితో పాటు ఏటా 10 లక్షల ఇళ్ళు చొప్పున 2019 నాటికి రాష్ట్రంలో 50 లక్షల ఇళ్లు కట్టించడాన్ని ఆరో పనిగా చేస్తా. ఏడో పనిగా.. జిల్లాకో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని తీసుకువస్తా. ఎనిమిదో పని అక్కా చెల్లెమ్మల కోసమే చేస్తా. గ్రామాల్లో బెల్టుషాపు‌లు లేకుండా చేస్తా.. ఇందుకోసం అదే గ్రామానికి చెందిన 10 మంది మహిళలను మహిళా పోలీసులుగా చేసి వారితోనే బెల్టు తీయిస్తా. నియోజకవర్గానికి ఒకే ఒక్క మద్యం దుకాణం ఉండేలా చేస్తా. మన తలరాతలు మార్చనున్న ఈ ఎన్నికల్లో వైయస్ఆర్‌సీపీ అభ్యర్థులందరికి ఫ్యాన్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని కోరుతున్నా’‌ అని శ్రీ జగన్‌ అన్నారు.

Back to Top