విభజనపై మా పోరుకు మద్దతివ్వండి

ముంబై :

‘కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఓట్లు, సీట్ల కోసం ఆంధ్రప్రదే‌శ్‌ను ఏకపక్షంగా విభజిస్తోంది. అసెంబ్లీలో తీర్మానం చేసే సంప్రదాయానికి నీళ్లొదిలింది. తద్వారా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది. దీనిని అడ్డుకోకపోతే రేపు ఏ రాష్ట్రాన్నైనా ఇలాగే విభజించే దుష్ట సంప్రదాయం మొదలవుతుంది. ఏ రాష్ట్ర విభజనకైనా అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానంతో ఆమోదించటం తప్పనిసరి చేయాలి. ఏకగ్రీవ తీర్మానం కాకపోతు కనీసం 2/3 వంతుల మెజారిటీతో అయినా ఆమోదించాలి. అసెంబ్లీతో పాటు పార్లమెంటు ఉభయసభల్లోనూ మూడింట రెండు వంతుల మెజారిటీ ఉంటేనే ఏ రాష్ట్రాన్నయినా విభజించాలి. ఈ దిశగా రాజ్యాంగంలోని మూడవ అధికరణను సవరించాలి. ఇందుకు మీ సహకారం కావాలి. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు చేస్తున్న మా పోరాటానికి అందరూ మద్దతివ్వాలి’ అని వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అ‌ధినేత శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి ఎన్‌సీపీ, శివసేన అధ్యక్షులకు విజ్ఞప్తి చేశారు. ముంబైలో ఆయన సోమవారంనాడు నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ అ‌ధ్యక్షుడు, కేంద్ర వ్యవసాయ మంత్రి శరద్‌ పవార్, శివసేన ‌ఛీఫ్‌ ఉద్ధవ్‌ థాక్రేలను వేర్వేరుగా కలుసుకున్నారు.

అడ్డగోలుగా చేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు, ఏకపక్ష విభజనకు అవకాశం కల్పిస్తున్న ఆర్టికల్-3ను సవ‌రించాలంటూ జాతీయ, ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టేందుకు కృషి చేస్తున్న శ్రీ జగన్ సోమవారం ఉదయం పార్టీ ‌నాయకులు ఎంవీ మైసూరారెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎస్‌పీవై రెడ్డి, దాడి వీరభద్రరావు, నల్లా సూర్యప్రకాశ్, బాలశౌరిలతో కలిసి ముంబై చేరుకున్నారు. మధ్యాహ్నం 2:20 గంటలకు నారిమన్ పాయింట్‌లోని వైబీ చవాన్ హా‌ల్‌కు వెళ్లి శరద్‌పవార్‌తో భేటీ అయ్యారు. సుమారు గంట సేపు ఆయనతో చర్చించారు. అక్కడి నుంచి నేరుగా బాంద్రాలోని ఉద్ధవ్‌ థాక్రే నివాసం మాతోశ్రీకి వెళ్లి శివసేన అధినేతతో శ్రీ జగన్ సమావేశమయ్యారు. సాయంత్రం 4:15 గంటల నుంచి దాదాపు 45 నిమిషాల పాటు ‌థాక్రేతో చర్చించారు.

ఆంధ్రప్రదేశ్ విభజన విషయంలో కాంగ్రె‌స్ పార్టీ, కేంద్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఏకపక్ష, నిరంకుశ వైఖరి గురించి పవార్, ‌థాక్రేలకు శ్రీ జగన్ వివరించారు. ఓట్లు, సీట్ల కోసం రాజ్యాంగంలోని మూడ‌వ అధికరణను దుర్వినియోగం చేస్తూ.. రాష్ట్రంలో మెజారిటీ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా.. అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజిస్తున్నారని నివేదించారు.

‌శ్రీ జగన్‌ విజ్ఞప్తిపై శర‌ద్‌ పవార్ స్పందిస్తూ.. ‘ముంగిట్లో ఎన్నికలు ఉండగా (రాష్ట్ర విభజనకు) కేంద్రానికి ఇంత తొందరపాటు ఎందుకు? రేపు ఎన్నికలు పూర్తయ్యాక ప్రజాభిప్రాయాన్ని బట్టి నిర్ణయం తీసుకోవచ్చు కదా!’ అనే అభిప్రాయాన్ని శ్రీ జగన్మోహన్‌రెడ్డి బృందం వద్ద వ్యక్తంచేసినట్లు సమాచారం. ఓట్లు, సీట్ల దృష్టితో రాయలసీమను కూడా నిలువునా చీల్చే క్షుద్ర రాజకీయాలు రాష్ట్రంలో జరుగుతున్నాయని ఆ ప్రాంతానికి చెందిన సీనియర్ నాయకు‌డు ఒకరు ప్రస్తావించినపుడు.. ‘అలా హేతుబద్ధత లేని విభజన సముచితం కాదు’ అని కూడా పవార్ అభిప్రాయపడ్డట్లు ‌తెలిసింది.

ఇక ఉద్ధవ్‌ థాక్రే అయితే.. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదే‌శ్‌ను అన్యాయంగా విభజిస్తోందంటూ శ్రీ జగన్ బృందంతో ఏకీభవించారు. శ్రీ జగన్ పోరాటానికి పూర్తి మద్దతు ‌ప్రకటించారు. ఈ భేటీల అనంతరం.. పవార్‌తో కలిసి వైబీ చవాన్ హా‌ల్ వద్ద, ఉద్ధ‌వ్‌తో కలిసి మాతోశ్రీ వద్ద శ్రీ జగన్ మీడియాతో మాట్లాడారు.

‌శ్రీ జగన్ చెప్పిన ముఖ్యాంశాలు ఆయన మాటల్లో‌ :
ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోంది :
‘ఈ దేశంలో ఎప్పుడూ జరగనిది మొదటిసారిగా జరుగుతోంది. ఎక్కడైనా కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసేటప్పుడు సంబంధిత మాతృ రాష్ట్రంలో అసెంబ్లీ తీర్మానాలు ఆమోదించటం ఆనవాయితీ. ఇప్పటివరకూ అలాగే చేశారు. కానీ దేశంలో తొలిసారిగా.. అదీ ఆరు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయనగా.. ఓట్ల కోసం, సీట్ల కోసం కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదే‌శ్‌ను విభజిస్తోంది. అసెంబ్లీలో తీర్మానం ఊసే లేకుండా విభజిస్తోంది. ఇంత అన్యాయం జరుగుతున్నపుడు పవార్ వంటి సీనియర్ రాజకీయవేత్తలు చూస్తూ ఊరుకుంటే.. ఇది ఒక్క ఆంధ్రప్రదే‌శ్‌తోనే ఆగిపోదు. ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ విభజన జరిగితే ఇ‌ది ఒక దుష్ట సంప్రదాయానికి దారితీస్తుంది. మిగతా ప్రాంతాలకూ వ్యాపిస్తుంది'.

'రేపు మహారాష్ట్ర కావచ్చు.. ఎల్లుండి కర్ణాటక కావచ్చు.. ఆ తర్వాత తమిళనాడు కూడా కావచ్చు.. ఇలా ఏ రాష్ట్రంలోనైనా అప్రజాస్వామిక విభజనకు కేంద్రం తెగబడవచ్చు. ఢిల్లీలో అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా 272 మంది సభ్యుల మద్దతుంటే చాలు ఇష్టానుసారం ఏ రాష్ట్రాన్నైనా విభజిస్తుంది. ఇక అధికారంలోకి రామని తెలిసిన ఏ పార్టీ అయినా ఓట్ల కోసం, సీట్ల కోసం రాష్ట్రాల విభజనకు పూనుకుంటుంది. మాతృ రాష్ట్ర అసెంబ్లీ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా విభజనకు పూనుకుంటుంది. ప్రాంతీయంగా ఉన్న భావోద్వేగాలతో ఇలా చెలగాటమాడతారు. ప్రజాస్వామ్యాన్ని ఈ రకంగా ఖూనీ చేయటం తీవ్రమైన నేరం' అన్నారు.
విభజనకు విధివిధానాలు ఉండాలి :
'అరవై ఏళ్ల కిందట భాషాప్రయుక్త ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పడ్డాయి. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సిఫారసుల ద్వారా ఇవి ఏర్పడ్డాయి. ఇప్పుడు ఒకే భాష మాట్లాడే తెలుగు వారి రాష్ట్రాన్ని విడగొడుతున్నారు. అరవై ఏళ్ల తర్వాత ఇప్పుడు కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయాలంటే.. అందుకు ఒక పద్ధతి, నియమాలు, నిబంధనలు ఉండాలి. రాష్ట్ర విభజనకు అసెంబ్లీలో, పార్లమెంటులో తీర్మానం తప్పనిసరి చేయాలి. ఏకగ్రీవ తీర్మానం సాధ్యం కానపుడు కనీసం 2/3 వ వంతు మెజారిటీతోనైనా ఆయా సభల్లో విభజన తీర్మానం నెగ్గాలనే నిబంధన తప్పక పెట్టాలి. ఈ మేరకు రాజ్యాంగంలోని మూడవ అధికరణను సవరించాల్సిన అవసరముంది.'

'ఈ విషయాన్ని శరద్‌పవార్‌కు బలంగా చెప్పాం. ఉద్దవ్‌ థాక్రే సహా అందరి సహకారం కోరుతున్నాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ఎలాంటి చర్యలు అవసరమో, ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న పరిస్థితులేమిటో పవార్ అర్థం చేసుకున్నారు. విభజన ప్రక్రియను స్తంభింపజేసేలా లో‌క్‌సభ, రాజ్యసభల్లో మద్దతివ్వాలని ఉద్ధవ్‌ను కోరాను. ఆయన అంగీకరించారు. అందుకు కృతజ్ఞతలు చెప్తున్నా. పొత్తులు, కూటములకన్నా విభజన అనేది చాలా పెద్ద విషయం. దయచేసి ఈ విషయాన్ని పక్కదారి పట్టించవద్దు. అందరూ ఆలోచించాల్సిన సమయమిది’ అని చెప్పారు.

కాంగ్రెస్‌ది విభజించు - పాలించు విధానం- ఉద్ధవ్‌ :

బ్రిటిష్ వారి తరహాలో కాంగ్రె‌స్ పార్టీ ఓట్ల కోసం ‘విభజించు - పాలించు’ విధానాన్ని అమలు చేస్తోందని శివసేన అధ్యక్షుడు ఉద్ధ‌వ్‌ థాక్రే ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ విభజనను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ప్రకటించారు. తెలంగాణ బిల్లు పార్లమెంటుకు వస్తే తమ పార్టీ వ్య‌తిరేకిస్తుందని స్పష్టంచేశారు. రాజ్యాంగంలోని మూడవ అధికరణను దుర్వినియోగం చేయరాదన్నారు. సమైక్యాంధ్రకు మద్దతు కోరుతూ శ్రీ జగన్మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైయస్ఆర్ కాంగ్రె‌స్‌ పార్టీ నేతల బృందం తనతో భేటీ అయిన తర్వాత.. శ్రీ జగన్‌తో కలిసి థాక్రే మీడియాతో మాట్లాడారు.

‘జగన్మోహన్‌రెడ్డి ముంబైకి ప్రత్యేక విషయమై వచ్చారు. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని సర్వనాశనం చేయటానికి ప్రయత్నిస్తోంది. ఢిల్లీలోని పెద్దలు అక్కడ కూర్చుని ఏమైనా చేయవచ్చని భావిస్తున్నారు. వాళ్లకు ఎలా నచ్చితే అలా చేస్తున్నారు. చివరికి ఓట్ల కోసం, రాజకీయ లబ్ధి కోసం ఆంధ్రప్రదే‌శ్‌ను విభజించేందుకు ప్రయత్నిస్తున్నారు. దీన్ని మేం నిరసిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ విభజనను మేం కూడా వ్యతిరేకిస్తున్నాం.‌ ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు ఒక్క స్థానం కూడా లభించదని భావించిన కాంగ్రెస్ ఇలా ఎన్నికలకు ముందు ఓట్ల రాజకీయం ప్రారంభించింది. అధికారంలో ఉన్నవాళ్లు ‘విభజించు - పాలించు’ రీతిలో చేస్తున్నారు. బ్రిటిష్ వారి విధానాన్ని అమలు చేస్తున్నారు. ఈ విధానాలను మేం వ్యతిరేకిస్తున్నాం. తెలంగాణ బిల్లు పార్లమెంటుకు వస్తే మేం నిరసన వ్యక్తంచేస్తాం‌' అన్నారు.

'ఆర్టికల్-3ను కేంద్రం దుర్వినియోగం చేయకూడదు. రాష్ట్ర విభజన అవసరమైతేనే చేయాలి. శ్రీ జగన్మోహన్‌రెడ్డితో మేం ఏకీభవిస్తున్నాం. మూడవ అధికరణలో సవరణలు చేయాలి. ఎక్కడైనా రాష్ట్రాన్ని విభజించాలనుకుంటే.. తప్పనిసరిగా సంబంధిత రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టాలి. అసెంబ్లీలో తీర్మానాన్ని మెజారిటీతో ఆమోదించిన తర్వాతనే పార్లమెంటులో ప్రవేశపెట్టాలి’ అని ఆయన స్పష్టంచేశారు.

జగన్ లేవనెత్తిన అంశాలు చాలా కీలక‌ం - పవార్‌ :
అసెంబ్లీ తీర్మానం లేకుండా ఆంధ్రప్రదేశ్‌ను ఏకపక్షంగా విభజించటం, రాజ్యాంగంలోని మూడవ అధికరణను సవరించాల్సిన అవసరంపై శ్రీ జగన్మోహన్‌రెడ్డి లేవనెత్తిన అంశాలు చాలా కీలకమైనవని తాము భావిస్తున్నామని ఎన్‌సీపీ అధినేత, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్‌పవార్ పేర్కొన్నారు. ఈ అంశాలపై తమ పార్టీ కార్యవర్గ భేటీలో నిశితంగా చర్చిస్తామని చెప్పారు. వై‌యస్ఆర్ కాంగ్రె‌స్ బృందం తనతో చర్చలు జరిపిన అనంతరం ‌శ్రీ జగన్మోహన్‌రెడ్డితో కలిసి పవార్ మీడియాతో మాట్లాడారు. ‘ఆంధ్రప్రదే‌శ్‌ను సమైక్యంగా ఉంచేందుకు సహకరించాలని శ్రీ జగన్మోహన్‌రెడ్డి కోరారు. అయితే ఎన్‌సీపీ తొమ్మిది నెలల కిందటే తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. కానీ.. రాష్ట్ర విభజన ప్రక్రియకు సంబంధించి శ్రీ జగన్ చాలా కీలకమైన అంశాలను ప్రస్తావించారు‌' అన్నారు.

'కొన్ని న్యాయపరమైన విషయాలను శ్రీ జగన్ ప్రస్తావించారు. ఏ రాష్ట్రాన్నైనా విభజించే ముందు రాష్ట్ర అసెంబ్లీని విశ్వాసం లోకి తీసుకోవాలన్న అంశాన్ని చెప్పారు. రాష్ట్ర అసెంబ్లీని విస్మరించి ముందుకెళ్లరాదని, అలా వెళ్తే అది తప్పుడు సంప్రదాయం అవుతుందని‌ శ్రీ జగన్ నాతో అన్నారు. రాజ్యాంగంలోని మూడ‌వ అధికరణ విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ఈ అధికరణను సవరించాలని, అందులో పునరాలోచనకు ఆస్కారం ఉండాలని చెప్పారు. శ్రీ జగన్ లేవనెత్తిన కీలకమైన ఈ రెండు అంశాలపై ఈ సమయంలో మా పార్టీ అభిప్రాయం కానీ, నిర్ణయం కానీ చెప్పలేను. కానీ మా పార్టీ వర్కింగ్ కమిటీ సభ్యుల ముందు ఈ రెండు అంశాలనూ ఉంచుతాను. వీటిపై సీరియ‌స్‌గా చర్చిస్తాం. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు గల శాసనసభను, శాసనసభ్యుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలన్న కీలకమైన అంశాలపై నిశితంగా చర్చిస్తాం. అలా ఓ అభిప్రాయానికి వస్తాం. ఆ తర్వాత వెల్లడిస్తాం’ అని ఆయన వివరించారు. శ్రీ జగన్‌తో భేటీ సందర్భంగా ఎన్నికల అవగాహనపై చర్చ జరగలేదని పవార్‌ చెప్పారు.

Back to Top