అన్నదాతల్లో ఆనందం నింపుతాం

ఇడుపులపాయ (వైయస్ఆర్‌ జిల్లా),

2 ఫిబ్రవరి 2014: అన్నదాత ఆనందంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉండగలుగుతుందని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి అన్నారు.‌ మరో నాలుగు నెలల్లో వైయస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందని, ఆ వెంటనే వ్యవసాయానికి పెద్ద పీట వేస్తామని హామీ ఇచ్చారు. వ్యవసాయానికి 7 గంటల పాటు, మరి కొద్ది రోజుల తరువాత 9 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తామని ఆయన ‌హామీ ఇచ్చారు. రైతు సమస్యల సత్వర పరిష్కారం కోసం వ్యవసాయ శాఖకు ఇద్దరు మంత్రులకు కేటాయిస్తామన్నారు. వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ను ఏర్పాటు చేస్తామన్నారు.  రైతులకు వడ్డీలేని రుణాలు అందిస్తామన్నారు. వైయస్ఆర్ జిల్లా ఇడుపులపాయలో‌ ఆదివారం జరిగిన వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ రెండో ప్లీనరీ సమావేశంలో శ్రీ జగన్మోహన్‌రెడ్డి ప్రసంగించారు. చంద్రబాబు, కిరణ్ పాలనలపై ‌శ్రీ జగన్ నిప్పులు చెరిగారు.

ఓట్లు, సీట్ల కోసం ఏ గడ్డి అయినా కరిచిన వాళ్ళను చూశామని, ఓట్లు, సీట్ల కోసమే ఒక మనిషిని తప్పించడాని యత్నించడాన్ని చూశామన్నారు. అదే ఓట్లు, సీట్ల కోసం బంగారం లాంటి మన రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజిస్తున్నారని శ్రీ జగన్‌ దుయ్యబట్టారు. నీతి, నిజాయితీ లేని రాజకీయాలను ఇప్పుడు చూస్తున్నామన్నారు. అన్యాయంగా 16 నెలలు తనను జైలులో పెట్టారని, వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీని అణిచేయడానికి ప్రయత్నాలు ‌చేశారని ప్రస్తావించారు. 90 రోజుల్లో బెయిల్‌ ఇవ్వకుండా 16 నెలలు జైలులో పెట్టిన వైనాన్ని చూశామన్నారు. జైలులో తననెవరూ కలవకుండా కట్టడి చేసిన విధాన్ని వివరించారు. తాను ఇక బయటికి వచ్చే అవకాశమే లేదని ప్రచారం చేశారన్నారు. అయితే బయటికి వచ్చి తానేంటో చూపించానన్నారు. ఇన్ని చేసినా జగన్మోహన్‌రెడ్డిని, వైయస్ఆర్‌సీపీని ఏమీ చేయలేకపోయారని ఎద్దేవా చేశారు.

నాలుగు నెలల్లో 3 వేల కోట్లతో స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తామని, పంటలకు గిట్టుబాటు ధరలు వచ్చేలా చూస్తామన్నారు. రైతు సమస్యల పరిష్కారానికి 101, పశువు సమస్యల కోసం 102 ఉచితంగా వాహన సేవలు అందుబాటులోకి తీసుకువస్తామని శ్రీ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో 104, 108 సేవలు దాదాపుగా కనుమరుగైన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సేవలను పునరుద్ధరిస్తామన్నారు. ఎన్నివేల కోట్లు ఖర్చు అయినా పిల్లలకు ఉచిత విద్యను అందిస్తామన్నారు. బెల్టు షాపులను నిర్మూలిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరికి సాంఘిక భద్రత, వృద్ధులు భద్రత కల్పిస్తామని స్పష్టం చేశారు. మహిళల పురోగతి కోసం ప్రత్యేక చర్యలు చేపడతామన్నారు. మద్య నియంత్రణ కోసం మహిళా పోలీసులను ఏర్పాటు చేస్తామన్నారు. కిలో రూపాయి బియ్యం 6 కిలోలు అందిస్తామన్నారు. సంవత్సరానికి 12 సబ్సిడీ సిలిండర్లు ఇవ్వడంతో పాటు ప్రతి సిలిండర్‌పై రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ. 100 సబ్సిడీ ఇస్తామన్నారు. అధికారంలోకి రాగానే డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామన్నారు.

ఎఫ్‌డీఐ మీద ఓటింగ్‌ సమయంలో తనను జైలులో పెట్టి భయపెట్టారని, జగన్‌ను రాష్ట్రం బయటికి పంపించేస్తారని, ఏదో చేసేస్తారంటూ రకరకాలుగా ప్రచారాలు చేశారని అన్నారు. ఇన్ని భయాలున్నా జైలు నిర్బంధంలో ఉన్నా తాను సామాన్య వ్యాపారుల పక్షాన నిలబడి ఎఫ్‌డీఐకి వ్యతిరేకంగా ఓటేసినట్లు చెప్పారు. జైలులో ఉన్నా ప్రజల విశ్వాసాన్ని ఏనాడూ వమ్ము చేయలేదన్నారు. దివంగత నేత రాజశేఖరరెడ్డిలా నిజాయితీ అనే పదానికి అర్థం వచ్చేలా బతకాలన్నారు. రాజన్న నాటి సువర్థ యుగం రావాలన్నారు.

అయితే, చంద్రబాబు నాయుడు తన ఎంపీలను ఓటింగ్‌ సమయంలో బయటికి పంపించి ఎఫ్‌డీఐ బిల్లు నెగ్గేలా చేశారన్నారు. రైతు వ్యతిరేక బిల్లు ఉండొద్దని అవిశ్వాస తీర్మానం పెడితే చంద్రబాబు నాయుడు తన పార్టీ ఎమ్మెల్యేలకు విప్‌ జారీ చేసి మరీ ప్రభుత్వాన్ని గట్టెక్కించారని దుయ్యబట్టారు. జైలులో ఉన్నప్పటికీ తాను అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలతో ఓట్లు వేయించినట్లు చెప్పారు. చంద్రబాబు నాయుడు తన మీద ఎమ్మార్, ఐఎంజీ కేసులపై విచారణ జరగకుండా సోనియాతో కుమ్మక్కయ్యారని ఎద్దేవా చేశారు.

తాను జైలులో ఉన్నప్పుడు అన్ని విధాలా తనకు తోడుగా తన తల్లి శ్రీమతి విజయమ్మ, చెల్లి శ్రీమతి షర్మిల, సతీమణి శ్రీమతి భారతి తోడుగా నిలిచారని, ఏనాడూ అధైర్యపడలేదన్నారు. వారితో పాటు వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరూ, రాష్ట్రంలోని ప్రతి అవ్వా తాత, ప్రతి తల్లీ చెల్లీ అందరూ తొణకకుండా బెణకకుండా తనకు అండగా నిలిచారని కృతజ్ఞతలు తెలిపారు.

మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి జయంతి ‌జూలై 8న వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ‌తొలి ప్లీనరీ జరిగిందని శ్రీ జగన్ గుర్తుచేశారు. అ‌ప్పటి నుంచి జరిగిన పరిణామాలను ఆయన వివరించారు. గత రెండున్నరేళ్ళలో ఎన్నో కష్టాలు పడ్డామన్నారు. ఓట్లు, సీట్ల కోసం చేసిన కుట్రలు కుతంత్రాలు చూశామన్నారు.‌ కులం, మతం, ప్రాంతాలకు అతీతంగా పరిపాలన చేసింది ఒక్క వైయస్ఆర్ అ‌న్నారు. పేద ప్రజల ఆరోగ్యం కోసం రాజశేఖరరెడ్డి ప్రవేశ పెట్టిన ఆరోగ్యశ్రీ పథకం కిరణ్ పాలనలో అనారోగ్యశ్రీగా మారిందని ‌ఆవేదన వ్యక్తం చేశారు. ఆ పథకంలోని 133 సేవలను కిరణ్ ‌ప్రభుత్వం తొలగించిందని చెప్పారు.

రాష్ట్ర విభజన చేస్తున్న యూపీఏ అధ్యక్షురాలు సోనియాపై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని సమైక్యం ఉంచే క్రమంలో చంద్రబాబు ఏనాడైన జాతీయ స్థాయిలో ఏ నేతనైనా కలిశారా అని ప్రశ్నించారు. కనీసం ఏనాడైనా నిరాహారదీక్ష చేశారా? అని ప్రశ్నించారు. సమైక్యాంధ్ర కోసం ఎప్పుడైనా అఫిడవిట్‌ ఇచ్చారా? అన్నారు. కేసీఆర్, చంద్రబాబుకు, కాంగ్రెస్‌ పార్టీకీ తేడా ఏమిటని అన్నారు.

70 శాతం మంది రైతులు, ప్రజలు ఆందోళన చేస్తుంటే.. అది అన్యాయమని ఎవరైనా చెప్పగలరా? అని ప్రశ్నించారు. చదువుకున్న పిల్లవాడు హైదరాబాద్‌ను విడిచిపొమ్మనడం భావ్యమా? అని నిలదీశారు. సమైక్యం అంటే మూడు ప్రాంతాలూ కలిసి ఉండడమని, ఎయిర్‌పోర్టులు, సీపోర్టులు ఒకే రాష్ట్రంలో ఉండడం అన్నారు.

రాష్ట్రాన్ని విభజిస్తూ.. నిర్ణయం తీసుకున్న వెంటనే సీఎం కిరణ్‌ రాజీనామా లేఖను ఆమె ముఖాన పడేసి ఉంటే.. విభజన జరిగేదా? అని ప్రశ్నించారు. సోనియా, కిరణ్, చంద్రబాబు కుతంత్రాలను పై నుంచి దేవుడు చూస్తున్నారన్నారు. సింహాల్లా ముందుకు దూసుకుపోదాం. 30 ఎంపీ సీట్లు గెలుచుకుని మన రాష్ట్రాన్ని విడగొట్టే దమ్మూ ధైర్యం ఎవరికుందో చూద్దామన్నారు.

Back to Top