అబద్ధాల్లో అందెవేసిన చంద్రబాబు

హైదరాబాద్:

పట్టపగలే నిట్టనిలువునా అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు దిట్ట అని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. అబద్ధాల బాబు పేరును గిన్నిస్ బు‌క్‌లో చేర్చాలన్నారు. చెప్పిన అబద్ధాన్నే పదే పదే వందసార్లు చెబుతూ నిజమని నమ్మించడంలో చంద్రబాబును మించిన ఘనుడు లేరన్నారు. హైదరాబాద్‌ను తానే అభివృద్ధి చేశానని, సాఫ్టువేర్ రంగంలో ఈ నగరానికి అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చానని పదే పదే చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్సు, ఖైరతాబాద్, ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లో ఆయన సోమవారం రోడ్‌షో నిర్వహించారు. పలు చోట్ల ‘వైయస్ఆర్ జనభేరి’ సభల్లో ప్రసంగించారు. మండుటెండను కూడా లెక్కచేయకుండా నగర ప్రజలు పెద్ద సంఖ్యలో‌‌ శ్రీ వైయస్ జగన్ సభలకు హాజరయ్యారు.

'వాస్తవం ఏమిటంటే.. చంద్రబాబు పాలనలోకి రాక‌ ముందు సాఫ్టువేర్ రంగంలో దేశంలో మన రాష్ట్రం మూడవ స్థానంలో ఉండేది. చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో మన ఐదవ స్థానానికి పడిపోయింది. ఈ వాస్తవాన్ని మరుగుపరచి అబద్ధాలతో జనాన్ని మభ్యపెట్టే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారు’ అని శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి తూర్పారబట్టారు.

అబద్ధాల్లో ఆయనకు సాటి రారెవ్వరూ..:

చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు మన రాష్ట్రం అక్షరాస్యత, శిశు మరణాలు, పేదరికం.. ఇలా పలు రంగాల్లో ఎంతో దిగజారిపోయిదని శ్రీ వైయస్‌ జగన్‌ విమర్శించారు. తొమ్మిదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని దివాలా తీయించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. విమానాశ్రయం, పీవీ ఎక్సుప్రెస్ వే, ఔట‌ర్ రింగ్ రోడ్డుతో పాటు దేవాదుల, అలీ సాగ‌ర్ ప్రాజెక్టులు కూడా తన హయాంలోనే రూపుదిద్దుకున్నాయని చెప్పిన అబద్ధాలనే పదే పదే చెపుతూ ప్రజలను నమ్మించే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నా‌రన్నారు. చంద్రబాబు హయాంలో రెండుసార్లు ఎన్నికలు వస్తే ప్రాజెక్టులకు రెండుసార్లు శంకుస్థాపనలు చేసిన ఘనుడు ఆయనే అన్నారు.

ఎన్నికల ముందు శంకుస్థాపనలు చేయడం.. అధికారంలోకి వస్తూనే వాటిని గాలికి వదిలేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని శ్రీ జగన్ దుయ్యబట్టారు. పాడి పంటలతో రాష్ట్రాన్ని సుభిక్షంగా చేయడమే కాదు.. అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు రాజధాని నగరంలో ఫ్లైఓవర్లు,‌ ఔటర్ రింగ్‌రోడ్ నిర్మాణాలను పూర్తిచేసిన ఘనత‌ మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డిదే‌ అని గుర్తుచేశారు. ఓటు వేసే ముందు మోసగాళ్ల మాటలకు మోసపోకుండా దివంగత మహానేత చేసి చూపిన అభివృద్ధిని గమనించి వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అభ్యర్థులను గెలిపించండ‌ని శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

పేదల కష్టాలకు ప్రాంతీయ భేదం లేదు :

‌'మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి పేదవాడి గుండె చప్పుడు వినడంలో.. పేదవాని కష్టసుఖాలను పంచుకోవడంలో.. కులాలు, మతాలు, పార్టీలు, ప్రాంతాలకు అతీతంగా వ్యవహరించేవారు. అదే స్ఫూర్తితో తెలంగాణలోని ప్రతి పేదవాడి గుండె చప్పుడు వినేందుకు వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ కంకణబద్ధమై ఉంది. సీమాంధ్ర ముఖ్యమంత్రిగా ఆ ప్రాంతంలో అమలు చేయబోయే ప్రతి సంక్షేమ కార్యక్రమాన్నీ తెలంగాణలో కూడా అమలు చేసేందుకు వై‌యస్‌ఆర్‌సీపీ సర్వశక్తులూ ఒడ్డి పోరాడుతుంది. దివంగత నేత వైయస్ఆర్‌ను అభిమానించే లక్షలాది హృదయాలను దూరం చేసుకునే సమస్యే లేదు. ఈ రోజు కాకపోయినా రేపైనా తెలంగాణలో కూడా సువర్ణయుగాన్ని సాధించుకుందాం. అందు కోసం ఇప్పుడు జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించుకుందాం' అని పిలుపునిచ్చారు.

కుళ్లు, కుట్రల రాజకీయాలను తరిమికొడదాం :
'దివంగత మహానేత వైయస్ కన్నా ముందు, తర్వాత‌ చాలా మంది ముఖ్యమంత్రులను చూశాం. అయితే ఒక్క వైయస్‌ను మాత్రమే ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి అని ప్రాంతాలకు అతీతంగా ప్రతి పేదవాడూ గుర్తుంచుకున్నాడు. పేదవాడి గుండె చప్పుడు విన్న నేత వైయస్. ముఖ్యమంత్రిగా ‌ఆయన చేపట్టిన పలు వినూత్న కార్యక్రమాలే అందుకు కారణం. వైయ‌స్ఆర్‌కు ముందు రాష్ట్రంలో భయానక పాలన సాగింది. ఆ భయానక పాలనలో పేదవాడు కనీసం రేషన్ కార్డుకు కూడా నోచుకోని పరిస్థితి. తలసరి కనీస ఆదాయం రూ.24 వేలు మించితే వారికి తెల్ల రేష‌న్ కార్డు వచ్చేది కాదు. వై‌యస్ఆర్ అధికారంలోకి రాగానే ఆ కనీస ఆదాయ పరిమితిని రూ.72 వేలకు పెంచారు. ఆరోగ్యశ్రీ ద్వారా పేదవాడి ఆరోగ్యానికి భరోసా ఇచ్చారు. పెద్ద చదువులకు పేదరికం అడ్డుకాకూడదని, ప్రతి పేద కుటుంబంలో ఒకరైనా పెద్ద చదువులు చదివితే ఆ కుటుంబం పేదరికం నుంచి బయటపడుతుందని ‘ఫీజు రీయింబ‌ర్సుమెంట్’ను ప్రవేశపెట్టారని శ్రీ జగన్‌ పేర్కొన్నారు.

వైయస్ఆర్ మన నుంచి దూరమయ్యాక రాష్ట్రంలో పేదవాడి‌ కోసం ఆలోచించే నాయకుడే లేకుండా పోయాడని శ్రీ జగన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మరణానంతరం ఆరోగ్యశ్రీ పరిధి నుంచి 133 రోగాలను కాంగ్రెస్ ‌ప్రభుత్వం తొలగించిందన్నారు. ఫీజు రీయింబర్సుమెంట్‌ను రూ.35 వేలకు పరిమితం చేసి పేద విద్యార్థులు వైద్యులు, ఇంజనీర్లు కాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. అస్తవ్యస్త కాంగ్రెస్ పాలన, ఓట్లు, సీట్ల కోసం అబద్ధాలు ఆడుతున్న నేతలు, కుళ్లు రాజకీయాలు చేస్తున్న నాయకుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ప్రస్తుత రాజకీయాల్లో మాటమీద నిలబడే నాయకుడే లేకుండా పోయా‌డని విచారం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో విశ్వసనీయత అన్న పదానికి అర్థమే లేకుండా పోయింది. చెడిపోయిన ఈ వ్యస్థలో సమూల మార్పులు తేవాల్సి ఉంది’ని అన్నారు.

ముగిసిన సమయం... జగన్‌ అభివాదం :
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కేంద్రంలో శ్రీ జగన్మోహన్‌రెడ్డి సోమవారం రోడ్‌షో నిర్వహించారు. భారీ ఎత్తున హాజరైన అభిమానులు, పార్టీ కార్యకర్తలకు అభివాదం చేస్తూ ముందుకుసాగారు. షెడ్యూల్ ప్రకారం‌ శ్రీ జగన్ సోమవారం సాయంత్రం ఇబ్రహీంపట్నం‌ బహిరంగ సభలో ప్రసంగించాల్సి ఉంది. అయితే ఎల్బీనగర్‌లో రోడ్‌షో ముగించుకుని ఆయన ఇబ్రహీంపట్నం చేరుకునేలోగా ప్రచారం సమయం పూర్తయిపోయింది. అయినప్పటికీ అభిమాన జననేత కోసం భారీ సంఖ్యలో అభిమానులు సభా ప్రాంగణంలోనే నిరీక్షించారు.

సమయం మించడంతో సభా స్థలాన్ని ఖాళీ చేయాలని పోలీసులు ఆదేశించారు. దీనితో సభకు వచ్చిన అశేష జనవాహిని సభా ప్రాంగణం నుంచి రహదారిపైకి రాగానే శ్రీ జగన్ అక్కడికి చేరుకున్నారు. తన కోసం నిరీక్షించిన పార్టీ కార్యకర్తలు, శ్రేయోభిలాషులు నిరాశ చెందకుండా‌ శ్రీ జగన్‌ తన వాహనంలో నుంచి బయటకు వచ్చి అభివాదం చేశారు. తర్వాత దారి పొడవునా బారులు తీరిన అభిమానులు, కార్యకర్తలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు. మాట్లాడాలని అభిమానులు, కార్యకర్తలు కోరగా వాచీని చూపిస్తూ సమయం మించిపోయిందని సంకేతాలిచ్చారు.

Back to Top