అసెంబ్లీకి ముఖం చాటేసిన కిరణ్, బాబు

హైదరాబాద్, 16 డిసెంబర్ 2013:

విభజన బిల్లు అసెంబ్లీకి వచ్చినప్పుడు చూసుకుందామన్న సీఎం కిరణ్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారని వైఎస్ఆర్ సీఎల్పీ ఉప నేత భూమా శోభా నాగిరెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ ముసాయిదా బిల్లు అసెంబ్లీకి వస్తే కిరణ్, చంద్రబాబు ముఖం చాటేశారని విమర్శించారు. వారం రోజులుగా ప్రెస్‌మీట్‌లు పెట్టిన చంద్రబాబు నాయుడు ఇప్పుడెక్కడ ఉన్నారని ఆమె నిలదీశారు. సోనియా అజెండాను బాబు, కిరణ్ కలిసి అమలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ బిల్లును స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ సోమవారంనాడు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన అనంతరం శోభా నాగిరెడ్డి శాసనసభ ఆవరణలోని మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడారు.

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు అన్ని పార్టీల నేతలూ ఐక్యంగా కలిసిరావాలని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి చెప్పారని శోభా నాగిరెడ్డి తెలిపారు. విభజనపై టీడీపీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని విమర్శించారు. టి.టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్‌పై అవిశ్వాస నాటకమాడుతున్నారని ఆమె అన్నారు. కాంగ్రెస్, టీడీపీలకు ఒక విధానం లేదని, సీఎం కిరణ్, చంద్రబాబు కలిసి డ్రామాలాడుతున్నారని ఆరోపించారు. ఎక్కడో భోపాల్‌లో జరిగే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి వెళ్ళేందుకు చంద్రబాబు నాయుడికి సమయం ఉంటుంది కాని అసెంబ్లీకి రావడానికి ఏమైందన్నారు. టీ బిల్లుకు అసెంబ్లీలో సానుకూల వాతావరణం కల్పించేందుకే సీఎం కిరణ్‌ అనారోగ్యం అని సాకు చెప్పి సభకు రాలేదని విమర్శించారు.

వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సమైక్య తీర్మానం కోసం ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తీసుకోకుండా అసెంబ్లీలో టీ బిల్లును ప్రవేశపెట్టిన విధానాన్ని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని శోభా నాగిరెడ్డి పేర్కొన్నారు. బిల్లు వచ్చినప్పుడు చూసుకుందాం.. ఏ విధంగా బిల్లు పెడతారో చూద్దాం.. అసెంబ్లీ సమావేశాల్లో మన ప్రతాపం చూపిద్దాం అంటూ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రగల్భాలు పలికి ఉద్యమాన్నంతటినీ నీరుగార్చారన్నారు. తీరా బిల్లు సభకు వచ్చిన రోజునే అనారోగ్యం నెపంతో ఇంటిలో పడుకున్నారని ఎద్దేవా చేశారు. పేపర్‌ పులిలా, ఉత్తర కుమారుడిలా చాలా ప్రకటనలు కిరణ్‌ ఇచ్చారన్నారు. కిరణ్‌ ప్రగల్భాలు, ప్రకటనలు ఏమయ్యాయని శోభా నాగిరెడ్డి నిలదీశారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు సంబంధించిన అసెంబ్లీ సమావేశాలకు, బీఏసీ భేటీకి ఎందుకు రాలేదని సీఎం కిరణ్‌ను శోభా నాగిరెడ్డి ప్రశ్నించారు.

వారం రోజులుగా ఆవేశంగా ఉన్నట్టు పేపర్‌ ప్రకటనలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ఎందుకు అదే ఆవేశాన్ని ప్రదర్శించడలేదని, సభకు ఎందుకు రావడంలేదని శోభా నాగిరెడ్డి నిలదీశారు. సమైక్య తీర్మానం పెట్టాలని ఎందుకు డిమాండ్‌ చేయలేకపోతున్నారని అన్నారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా చంద్రబాబు డిమాండ్‌ చేస్తే ఈ ప్రభుత్వం ఎందుకు దిగిరాదని అన్నారు.

Back to Top