మనసున్న నేతనే సీఎంగా ఎన్నుకోండి

శృంగవరపుకోట (విజయనగరం):

రాష్ట్రంలోని క్లిష్ట పరిస్థితులు తొలగిపోవాలంటే మనసున్న నేతను, మంచి నాయకుణ్ని, మీ గుండెచప్పుడు వినే నేతను ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు, విశాఖపట్నం లోక్‌సభా స్థానంలో పార్టీ అభ్యర్థి శ్రీమతి వైయస్‌ విజయమ్మ పిలుపునిచ్చారు. కులమతాలకు అతీతంగా అందరి బాధలు వినే నేతనే ఆ పదవికి ఎన్నుకోండని అన్నారు. విజయనగరం జిల్లా ఎస్.కోట నియోజకవర్గంలో శనివారంనాడు శ్రీమతి విజయమ్మ ఎన్నికల ప్రచారం చేశారు. వేపాడ మండలంలో ఓబలయ్యపాలెం, ముకుందపురం, జగ్గయ్యపేట, లక్కవరపుకోట మండలంలో గొల్జాం, లక్కవరపుకోట, చందులూరురేగ, లచ్చింపేట గ్రామాల్లో రోడ్‌షో నిర్వహించారు. ఎస్.కోటలో బాబాగుడి జంక్షన్‌తో పాటు పలు గ్రామాల్లో శ్రీమతి విజయమ్మ ప్రసంగించారు.

‘దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి మరణించిన తరువాత ఈ నాలుగున్నరేళ్లలో ఎన్నో అకృత్యాలు, అరాచకాలు భరించాం.. అవమానాలు సహించాం. నేనూ, నా బిడ్డ కాంగ్రెస్ నుంచి బయటికి వస్తే రాజన్నవల్ల దగ్గర ఆర్థికంగా, రాజకీయంగా లబ్ధి‌ పొందిన రాజకీయ నేతలెవ్వరూ మా వెంట నిలవలేదు. మీరు మాత్రమే మా వెంట నిలిచారు... మమ్మల్ని కాపు కాచారు. మీ వల్లే ఈ రోజు మేము మీ ముందు నిలవగలిగాం. నా బొందిలో ప్రాణం ఉన్నంతవరకూ మీ ప్రేమ మరిచిపోను. మీరు చూపే ఆత్మీయత, ఆదరాభిమానాలు మరిచిపోలేనివి, మీ గుండెల్లో రాజన్నను చూసుకుంటున్నా’ అని శ్రీమతి విజయమ్మ చెప్పారు.

‘మూడేళ్లుగా అకాల వర్షాలు, తుపానులతో రైతాంగం అవస్థలు పడుతున్నారు. ఈ ప్రభుత్వాలు వడ్డీ లేని రుణాలు ఇవ్వలేదు. విద్యార్థులకు ఫీజు రీయింబర్సుమెంట్ సరిగా చెల్లించలేదు. నాలుగేళ్లుగా జగ‌న్‌బాబు మీ తోనే ఉన్నాడు, మీ బాధలు విన్నాడు. రాజన్న సంక్షేమ రాజ్యాన్ని మళ్లీ అందిస్తాడు. ఫ్యాను గుర్తుపై ఓటేసి వైయస్ఆర్‌సీపీ అభ్యర్థులను గెలిపించండి’ అని ప్రజలకు శ్రీమతి విజయమ్మ పిలుపునిచ్చారు.

Back to Top