వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన సుగాలి ప్రీతి త‌ల్లిదండ్రులు

వైయ‌స్ఆర్‌సీపీ అండగా నిలుస్తుందని వైయ‌స్ జ‌గ‌న్ భరోసా 

తాడేపల్లి: వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని సుగాలి ప్రీతి తల్లిదండ్రులు పార్వతి, రాజు నాయక్‌లు కలిసి తమ కుటుంబానికి న్యాయం చేయాలని విన్నవించారు. 2017లో టీడీపీ ప్రభుత్వ హయాంలో తమ కుమార్తె సుగాలి ప్రీతిపై అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన జరిగి తొమ్మిదేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ న్యాయం జరగలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కేసు విషయంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వైయస్‌ జగన్‌కు వివరించారు.

వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ కేసును సీబీఐ విచారణకు అప్పగిస్తూ జీవో జారీ చేశారని, అలాగే తమ కుటుంబానికి కర్నూలు నగరంలో 5 సెంట్ల ఇంటి స్థలం, 5 ఎకరాల వ్యవసాయ భూమి, ప్రీతి తండ్రి రాజు నాయక్‌కు ప్రభుత్వ ఉద్యోగం కల్పించారని ప్రీతి తల్లిదండ్రులు గుర్తుచేశారు. అయితే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసును పూర్తిగా పక్కనపెట్టిందని, సీబీఐ విచారణ కూడా నిలిచిపోయిందని తెలిపారు. తిరిగి సీబీఐ విచారణ పునరుద్ధరించేలా న్యాయ సహాయం అందించాలని వైయస్‌ జగన్‌ను కోరారు.

అంతేకాక బాధిత కుటుంబానికి ఇవ్వాల్సిన పెన్షన్‌ను కూడా టీడీపీ ప్రభుత్వం నిలిపివేసిందని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారనే కారణంతోనే పెన్షన్ ఇవ్వడం లేదని స్థానిక అధికారులు చెప్పారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కేటాయించిన ఇంటి స్థలంలో ఇంటి నిర్మాణానికి సహాయం చేయాలని పలుమార్లు కోరినా స్పందన లేదని వైయస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్లారు. ప్రీతి తల్లిదండ్రుల ఆవేదనను సావధానంగా విన్న వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వారికి న్యాయం జరిగేలా అన్ని విధాలా కృషి చేస్తామని, అవసరమైన న్యాయ సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. గతంలో వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం అందించిన సహాయాన్ని గుర్తుచేస్తూ, భవిష్యత్తులో కూడా వారి కుటుంబానికి వైయ‌స్ఆర్‌సీపీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.
 

Back to Top