మెగా డీఎస్సీ–2025లో భారీ అక్ర‌మాలు

లోకేష్ శాఖ అక్రమాలపై డిప్యూటీ సీఎం ఎందుకు నోరు మెదపడం లేదు?

మాజీ ఎంపీ మార్గాని భ‌ర‌త్ నిల‌దీత‌

రాజమహేంద్రవరంలోని మార్గాని ఎస్టేట్‌లో మీడియా సమావేశంలో మాట్లాడిన వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ అధికార ప్ర‌తినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్‌

డీఎస్సీ పరీక్ష రాసే వ్యక్తికే ప్రశ్నాపత్రాల తయారీ బాధ్యతలు అప్పగిస్తారా?

ప్రశ్నాపత్రాల లీకేజీ జరిగిన తర్వాత కూడా సంబంధిత ఉద్యోగిపై చర్యలు తీసుకోలేదు

టీచ‌ర్‌ ఉద్యోగాలు అమ్ముకునే ప్రక్రియ కూటమి ప్రభుత్వంలోనే జరిగింది

“ప్రశ్నిస్తా” అని పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్‌, లోకేష్ శాఖలో జరిగిన అక్రమాలపై ఎందుకు మాట్లాడటం లేదు

మెగా డీఎస్సీ పేరుతో భారీ స్కామ్ జరిగింది  

ఒక్కో పోస్టును రూ.15 లక్షల చొప్పున అమ్ముకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి

మెరిట్ లిస్ట్ విడుదల చేయకుండా ప్రభుత్వం దాచిపెట్టింది

డీఎస్సీ స్కామ్‌పై సిట్టింగ్ జడ్జితో విచారణ లేదా సీబీఐ దర్యాప్తు జరపాలి

మాజీ ఎంపీ మార్గాని భ‌ర‌త్‌ డిమాండ్

గోదావరి కాలుష్య నియంత్రణకు జగన్ ప్రభుత్వం రూ.756 కోట్ల డీపీఆర్‌ తయారు చేసి కేంద్రానికి పంపింది

ఎన్ఆర్‌సీపీ స్కీమ్ ద్వారా రూ.88 కోట్లు సాధించిందీ జగన్ ప్రభుత్వమే 

స్ప‌ష్టం చేసిన మార్గాని భ‌ర‌త్‌

పేపర్ మిల్లు నుంచి కలుషిత నీటిని గోదావరిలో వదులుతున్నారు

ఎస్టీపీ ప్లాంట్ పనులు 50 శాతం వరకు తమ హయాంలో పూర్తయ్యాయి

స్థానిక ఎమ్మెల్యే కమిషన్ల కోసం కాంట్రాక్టర్‌ను బెదిరించి పనులు ఆపేశారు

పవన్ కళ్యాణ్ స్వయంగా ఎస్టీపీ ప్లాంట్‌ను సందర్శించి నిజాలు తెలుసుకోవాలి

రాజమహేంద్రవరంలో ఇసుక మాఫియా విజృంభిస్తోంది

గ్యామన్ ఇండియా బ్రిడ్జి వద్ద అక్రమ ఇసుక తవ్వకాలతో ప్రమాదం పొంచి ఉంది

డ్రెడ్జింగ్ కారణంగా గోదావరిలో భారీ కాలుష్యం పెరుగుతోంది

పుష్కరాల సమయంలో ప్రమాదకర సుడులు ఏర్పడే పరిస్థితి వస్తుంది

ప్రెస్‌మీట్‌లో కూట‌మి ప్ర‌భుత్వాన్ని హెచ్చ‌రించిన మార్గాని భర‌త్ 

రాజమహేంద్రవరం: “ప్రశ్నిస్తా” అంటూ పార్టీ పెట్టిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌.. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ శాఖలో జరిగిన డీఎస్సీ అక్రమాలపై ఎందుకు మౌనం వహిస్తున్నారని వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ అధికార ప్ర‌తినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్ నిల‌దీశారు. మెగా డీఎస్సీ పేరుతో రాష్ట్రంలో భారీ స్కామ్ జరిగిందని, ఒక్కో టీచ‌ర్ పోస్టును రూ.15 లక్షల చొప్పున అమ్ముకున్నార‌నే ఆరోపణలు వస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. ప్రశ్నాపత్రాల లీకేజీ నుంచి మెరిట్‌ లిస్ట్‌ దాచిపెట్టడం వరకు మొత్తం నియామక ప్రక్రియపై సిట్టింగ్ జడ్జితో విచారణ లేదా సీబీఐ దర్యాప్తు జరిపించాలని రాజమహేంద్రవరంలోని మార్గాని ఎస్టేట్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయ‌న‌ డిమాండ్ చేశారు. రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో జ‌రుగుతున్న అవినీతి అక్ర‌మాల‌పై ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌మీక్ష చేయాల‌ని సూచించారు.
ప్రెస్‌మీట్‌లో మార్గాని భ‌ర‌త్ ఏమ‌న్నారంటే..

- నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడటం కాదా?
డీఎస్సీ-2025 పరీక్ష రాసే వ్యక్తికే ప్రశ్నాపత్రాల తయారీ బాధ్యతలు అప్పగించారు. ప్రశ్నాపత్రాలు లీక్‌ అయిన తర్వాత కూడా ఆ ఉద్యోగిని ఎందుకు సస్పెండ్‌ చేయలేదు.. ఎందుకు కేసు నమోదు చేయలేదు? ‘ప్రశ్నిస్తా’ అంటూ పార్టీ పెట్టిన పవన్‌ కళ్యాణ్‌.. నారా లోకేష్‌ శాఖలో జరిగిన అక్రమాలపై ఎందుకు ప్రశ్నించడం లేదు? వైయస్‌ జగన్‌ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎలాంటి సిఫార్సులు లేకుండా ప్రతిభ ఆధారంగా 1.20 లక్షల సచివాలయ ఉద్యోగాలు ఇచ్చింది. అది చరిత్ర. కానీ మెగా డీఎస్సీ పేరుతో భారీ ప్రచారం చేసి చివరకు స్కామ్‌కు తెరలేపారు. ఈ వ్యవహారంపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలి.. లేకపోతే సీబీఐకి అప్పగించాలి. 3.36 లక్షల మంది పరీక్షలు రాస్తే ఒక్కో పోస్టును రూ.15 లక్షల చొప్పున అమ్ముకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడటం కాదా? నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఎంత మందికి ఇచ్చిందో చెప్పాలి.

- గోదావ‌రి న‌ది క‌లుషితం కాకుండా వైయ‌స్ జ‌గ‌న్ చ‌ర్య‌లు
గోదావరి వంటి జీవనది కలుషితం కాకుండా ఉండాలని గతంలో వైయస్‌ జగన్‌ ప్రభుత్వం రూ.756 కోట్లతో డీపీఆర్‌ తయారు చేసి కేంద్రానికి పంపించింది. నేను ఎంపీగా ఉన్న సమయంలో గజేంద్రసింగ్‌ షేకావత్‌ ద్వారా ఎన్‌ఆర్‌సీపీ స్కీమ్‌లో రూ.88 కోట్లు తీసుకువచ్చాం. పేపర్‌ మిల్లు నుంచి వచ్చే కలుషిత నీటిని పూర్తిగా శుద్ధి చేసిన తర్వాతే గోదావరిలో వదలాలి. రాజమహేంద్రవరంలో రోజుకు 80 ఎంఎల్‌డీ మురుగు నీరు వస్తోంది. మా హయాంలో ఎస్టీపీ ప్లాంట్‌ పనులు 50 శాతం పూర్తయ్యాయి. కానీ ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే కమిషన్ల కోసం కాంట్రాక్టర్‌ను బెదిరించి పనులు ఆపేశారు. ట్రిట్‌మెంట్‌ పేరుతో లక్షలు ఖర్చు చేస్తున్నామని చెబుతూ నేరుగా కలుషిత నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. దీంతో ప్రజల్లో కిడ్నీ, ఊపిరితిత్తుల సమస్యలు పెరుగుతున్నాయి.  రాజమహేంద్రవరంలో వైయస్‌ జగన్‌ ప్రభుత్వ హయాంలో రూ.125 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాం. గోదావరి రివర్‌ ఫ్రంట్‌ అభివృద్ధికి ప్రత్యేకంగా రూ.22 కోట్ల నిధులతో టెండర్లు కూడా పిలిచాం. కానీ అప్పట్లో ఎన్నికల సమయం కావడంతో ఎవరూ ముందుకు రాలేదు. ఇప్పుడు అదే పనులను ముక్కలు ముక్కలుగా చేసి స్థానిక ఎమ్మెల్యే తన తమ్ముడికి రూ.8 కోట్లతో కట్టబెట్టుకున్నాడు. డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ స్వయంగా ఎస్టీపీ చానల్‌ను సందర్శించి అక్కడ జరుగుతున్న అక్రమాలను బయటపెట్టాలి.

-  ఇసుక మాఫియాతో ప్ర‌జ‌ల ప్రాణాల‌కే ముప్పు
రాజమహేంద్రవరంలో ఇసుక మాఫియా అక్రమాలకు అంతే లేకుండా పోయింది. గ్యామన్‌ ఇండియా బ్రిడ్జిని రాజమండ్రి సిటీ, రూరల్‌ ఎమ్మెల్యేలు పంచుకున్నట్టుగా వ్యవహరిస్తున్నారు. బ్రిడ్జి స్తంభాల వద్ద వందలాది డ్రెడ్జింగ్‌ మిషన్లు, బోట్లతో విపరీతంగా ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. ఈ ఇసుక మాఫియా కారణంగా బ్రిడ్జి ఏ రోజు కూలుతుందో కూడా అర్థం కావడం లేదు. డ్రెడ్జింగ్‌ వల్ల తీవ్ర కాలుష్యం ఏర్పడుతోంది. రేపు గోదావరి పుష్కరాలు జరిగినప్పుడు ఈ గోతుల వద్ద ప్రమాదకర సుడులు ఏర్పడి ప్రజల ప్రాణాలకు ముప్పు తలెత్తే పరిస్థితి వస్తుంది.
ఇదంతా స్థానిక ఎమ్మెల్యేల‌ ఘనతే. ఇక్కడ ఇసుక మాఫియా, మట్టి మాఫియా, చిట్టీల మాఫియా రెచ్చిపోతున్నాయి. పవన్‌ కళ్యాణ్‌ రాజమహేంద్రవరంలో ఉన్న రోజే 40వ వార్డులో బ్లేడ్‌ బ్యాచ్‌ వీరంగం సృష్టించింది. ఇదంతా ఎమ్మెల్యే అండతోనే జరుగుతోంది. బాధ్యత గల ఎమ్మెల్యే అధికారుల సమావేశాలకు కాలర్‌ లేని రౌండ్‌నెక్‌ షర్టులతో వస్తున్నారు. ఆయనే బ్లేడ్‌ బ్యాచ్‌కు రోల్‌మోడల్‌గా మారారు. 

పవన్‌ కళ్యాణ్‌ ముఖ్యంగా గ్యామన్‌ ఇండియా బ్రిడ్జి వద్ద జరుగుతున్న ఇసుక దోపిడీ, పేపర్‌ మిల్లు కాలుష్యంపై రివ్యూ చేయాలి. శుద్ధి చేసిన నీటినే గోదావరిలోకి వదిలేలా చర్యలు తీసుకోవాలి. బోట్‌మెన్‌ సొసైటీకే ఇసుక తవ్వకాల హక్కులు ఇవ్వాలి. రాజమహేంద్రవరానికి అవుటర్‌ రింగ్‌ రోడ్‌ మంజూరు చేయించాలి. నగరంలో జరుగుతున్న అవినీతిపై పవన్‌ భరతం పట్టాలి. అవినీతి ఎమ్మెల్యేలను పక్కన పెట్టుకుని రివ్యూలు చేస్తే పవన్‌ విలువ కూడా తగ్గిపోతుంది అని మార్గాని భరత్ స్ప‌ష్టం చేశారు.
 

Back to Top