మన రాష్ట్రానికి ఈ కర్మేంటి?

కావలి/ బుచ్చిరెడ్డిపాలెం (నెల్లూరు జిల్లా),

8 సెప్టెంబర్ 2013: కాంగ్రెస్, టిడిపి నాయకులు ప్రజల అభిమతాన్ని ఎప్పుడు అర్థం చేసుకుంటారో, ఎప్పుడు ప్రజల పక్షాన ఉంటారో, ఏమిటి మన రాష్ట్రానికి పట్టిన కర్మ అని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల ఆవేదన వ్యక్తంచేశారు. ఓట్లు, సీట్ల కోసం పచ్చని రాష్ట్రంలో చిచ్చుపెడతారా? అని కాంగ్రెస్, టిడిపిలను ఆమె నిలదీశారు. కాంగ్రెస్, టిడిపి ఎంపిలు, మంత్రులు, ఎమ్మెల్యే అసలు మనుషులేనా? లేక రాక్షసులా అని ఆమె నిప్పులు చెరిగారు. సమైక్య శంఖారావం బస్సు యాత్ర 7వ రోజు ఆదివారం రాత్రి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కావలిలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో శ్రీమతి షర్మిల ఆవేదనతో, ఉద్వేగంతో ప్రసంగించారు.పదవి మత్తులో మునిగి తేలుతున్న ఈ నాయకులంతా ఎప్పుడు మేలుకుంటారో.. ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ఎంపీ రాజీనామా చేస్తే తప్ప ఈ విభజన ఆగదని ఎప్పుడు అర్థం చేసుకుంటారో.. ఏమిటి మనకీ కర్మ! వీళ్లు పాలకులా లేక రాక్షసులా? పచ్చిగా ఓట్ల కోసం, సీట్ల కోసం ఒక జాతినే చీల్చేస్తారా? ఒక్క ఎన్నికలు ఎదుర్కొనే ధైర్యం లేక.. ఒక్క పాలనలో ప్రజలిచ్చే తీర్పును వినే ధైర్యం లేక ఒక కుటుంబంలోనే చిచ్చు పెడతారా? దానికి చంద్రబాబు లాంటి దుర్మార్గులు మద్దతిస్తారా? ఏమిటీ అన్యాయం.. ఏమిటి మన రాష్ట్రానికి ఈ కర్మ? టిడిపి అయితేనేమి, చంద్రబాబు, ఆ పార్టీ ఎంపిలు, ఎమ్మెల్యేలైతేనేమి, కిరణ్‌కుమార్‌రెడ్డి, బొత్స, ఆ పార్టీ మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలైతేనేమి.. అసలు వీళ్లందరూ మనుషులేనా? లేక మానవ జాతికి మాయని మచ్చలా?


మన కర్మ ఏమిటంటే..  ఓట్ల కోసం, సీట్ల కోసం, తెలంగాణను తామే ఇచ్చామన్న క్రెడిట్‌ కోసం.. కాంగ్రెస్‌ పార్టీ కోట్ల మంది ప్రజలకు అన్యాయం చేస్తోంది. మరోవైపు కోట్ల మంది ప్రజలకు అన్యాయం జరుగుతున్నా.. ఓట్లు పోతాయని, సీట్లు పోతాయని, క్రెడిట్‌ తనకు రాకుండా పోతుందేమోనని నోరు విప్పడం లేదు చంద్రబాబు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కలిసి రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు చేయడానికి, నాశనం చేయడానికి వెనుకాడడం లేదు. ఇద్దరూ కలిసి క్షమించలేని ఘోర పాపం చేస్తున్నారు.

రాష్ట్ర విభజనను కాంగ్రెస్‌ పార్టీ సొంత వ్యవహారంలా భావిస్తోందని, సొంత పార్టీ నేతలతో ఆంటోనీ కమిటీ వేసి ప్రజలను మోసం చేయాలని చూస్తోందని శ్రీమతి షర్మిల మండిపడ్డారు. ‘ఇక్కడ రాష్ట్రమంతా అట్టుడికిపోతుంటే, కోట్ల మంది గుండెలు రగిలిపోతుంటే.. అదేదో తమ సొంత పార్టీ వ్యవహారం అన్నట్లు ఒక సొంత పార్టీ కమిటీని వేసింది కాంగ్రెస్. దాని పేరు ఆంటోనీ కమిటీ. ఆ కమిటీలో కేరళకు చెందిన ఆంటోనీ ఉన్నారు. కర్ణాటకకు చెందిన వీరప్ప మొయిలీ ఉన్నారు. తమిళనాడుకు చెందిన చిదంబరం ఉన్నారు. మధ్యప్రదేశ్‌కు చెందిన దిగ్విజయ్‌ సింగ్‌ ఉన్నారు. గుజరాత్‌కు చెందిన అహ్మద్‌ పటేల్‌ ఉన్నారు. కానీ ఆ కమిటీలో ఒక్క తెలుగువాడూ లేడు. తెలుగుజాతి గురించి తెలిసినవాడే లేడు. వీళ్లంతా తెలుగువాళ్ల మనోభావాలను అర్థం చేసుకుంటారా?’ అని శ్రీమతి షర్మిల నిలదీశారు. ‘సరే ఆంటోనీ కమిటీ అంతా ఒక తోలుబొమ్మ ఆట అనుకుందాం. ఈ కమిటీకి సంబంధం లేకుండా విభజన బిల్లు తయారైపోతోందని, కేబినెట్‌ ఆమోదం కూడా పొదుతుందని స్వయంగా హోం మంత్రి షిండే చెబుతున్నారు. అంటే ఈ కమిటీ ఒక పెద్ద డ్రామా అన్నమాట. ఈ కమిటీ అభిప్రాయాలు సేకరించడం ఒక పెద్ద డ్రామా, వాటిని పరిశీలించడం ఒక పెద్ద డ్రామా.. పరిశీలించి ఒక నివేదిక తయారు చేయడమన్నది ఇంకా పెద్ద డ్రామా. ఈ డ్రామాలో మన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, బొత్స, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు ఓవరాక్షన్‌ చేసే యాక్టర్లన్నమాట. మన రాష్ట్రంలో కోట్ల మంది ప్రజలకు అన్యాయం జరిగినా ఫరవాలేదు.. మా పదవులు మాకుంటే చాల’నే క్యారెక్టర్‌ లేని యాక్టర్లు వీళ్లంతా.

రాజశేఖరరెడ్డిగారు బ్రతికి ఉన్నప్పుడు మన రాష్ట్రం ఎంత సుభిక్షంగా ఉండేదో మనందరికీ తెలుసు. రైతులను ఆయన ఎంతగానో ఆదరించారన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలకూ, ఎన్నో అభివృద్ధి పథకాలు విజయవంతంగా అమలు చేసినప్పటికీ ఏ చార్జీలూ పెంచకుండా, ఏ ధరలూ పెంచకుండానే అద్భుతంగా నిర్వహించారన్నారు. రాజశేఖరరెడ్డి రెక్కల కష్టంతో అధికారాన్ని అనుభవిస్తున్న కాంగ్రెస్‌ పార్టీ ఆయన పథకాలన్నింటికీ తూట్లు పెట్టిందని విమర్శించారు.

చేసిన పాపాలు చాలవన్నట్లు ఇప్పుడు మన రాష్ట్రాన్ని గొడ్డలితో నరికినట్లు రెండు ముక్కలు చేయడానికి పూనుకుందని ఆవేదన వ్యక్తంచేశారు. కాంగ్రెస్‌ పార్టీ చేస్తున్న పాపాన్ని చూస్తూ కూడా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కాలర్‌ పట్టుకుని నిలదీయకుండా దానికే వత్తాసు పలుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర విభజన చేయాలని చారిత్రక తప్పిదానికి పాల్పడడానికి చంద్రబాబు బ్లాంక్‌ చెక్కులా రాసివ్వడమే కారణం అన్నారు. ప్రతిపక్షాలు అవిశ్వాసం పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు సిగ్గు లేకుండా విప్‌ జారీ చేసి మరీ ప్రభుత్వాన్ని కాపాడారని దుమ్మెత్తి పోశారు. ప్రతి ఎన్నికలోనూ చంద్రబాబు నాయుడు పాలు నీళ్ళులా కాంగ్రెస్‌తో కలిసిపోయి పనిచేశారు.

మహానేత వైయస్ఆర్‌ వారసుడిగా జగనన్న జనంలో ప్రాచుర్యం పొందుతుంటే చంద్రబాబు, కాంగ్రెస్‌ పార్టీ కలిసిపోయి అబద్ధపు కేసులు పెట్టి అన్యాయంగా జైలులో పెట్టించారన్నారు. చంద్రబాబు తీరు చూస్తే ఒక వ్యక్తిని హత్య చేసి మళ్ళీ ఆ శవం మీదే పడి ఏడ్చినట్టు ఉందన్నారు. రాష్ట్ర విభజనకు చేసిందంతా చేసి ఇప్పుడు ఆత్మగౌరవ యాత్ర అంటూ సీమాంధ్రలో ఎలా చేస్తారని నిలదీశారు. కోట్లాది మందికి అన్యాయం జరుగుతున్నా ఓట్లు, సీట్లు పోతాయని, క్రెడిట్‌ తనకు దక్కకుండా పోతుందని చంద్రబాబు నాయుడు రాష్ట్ర విభజనపై నోరు మెదపడంలేదని దుయ్యబట్టారు.

రాష్ట్ర విభజన చేస్తామని సంకేతాలు వచ్చిన మరు క్షణమే వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ ప్రజా ప్రతినిధులంతా ఒక్కసారిగా తమ పదవులకు రాజీనామాలు చేసిన వైనాన్ని ప్రస్తావించారు. సీమాంధ్ర కాంగ్రెస్, టిడిపిలు కూడా అప్పుడే రాజీనామాలు చేసి ఉంటే విభజన ప్రక్రియ ఆగిపోయేదన్నారు.

ఏ ఒక్క ప్రాంతానికీ అన్యాయం జరగకుండా న్యాయం చేయాలి, అది ఎలా చేస్తోరో అందరినీ పిలిచి చెప్పండని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మొదటి నుంచీ చెబుతోందని శ్రీమతి షర్మిల అన్నారు.

సీమాంధ్రులకు అన్యాయం జరుగుతుంటే జగనన్న చేతులు కట్టుకుని కూర్చోరని, వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎందాకైనా వెళుతుందన్నారు. చంద్రబాబు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా విభజనకు అనుకూలంగా ఇచ్చిన లేఖను తక్షణమే వెనక్కి తీసుకోవాలన్నారు. వైయస్ఆర్‌ కాంగ్రెస్, ఎంఐఎం, సిపిఎంతో కలిసి రాష్ట్ర విభజనను అడ్డుకోవాలని డిమాండ్‌ చేశారు. చంద్రబాబుకు విలువలు, విశ్వసనీయత ఉన్నాయని ఎవరనుకుంటారన్నారు. అబద్ధాలు చెబుతూ చంద్రబాబు బస్సు యాత్ర చేస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు నిజంగా సీమాంధ్ర గడ్డపై పుట్టి ఉంటే చెంపలేసుకుని ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. నాది తప్పే క్షమించండి అని చంద్రబాబు అనలేదంటే అసలు ఆయనలో ప్రవహిస్తున్నది మానవ రక్తమేనా అని శ్రీమతి షర్మిల ప్రశ్నించారు.

Back to Top