ఎప్పటికైనా ధర్మానిదే విజయం

కాకరాపల్లి (తూ.గో.జిల్లా),

23 జూన్‌ 2013: ’ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుంది. పది తలలున్న రావణాసురుడిపైన ధర్మమే గెలిచింది.. శకుని ఆలోచనలతో కుట్రలు పన్నిన కౌరవుల మీద కూడా ధర్మమే గెలిచింది.. అది ధర్మానికి ఉన్న శక్తి. ఒకరోజున జగనన్న వనవాసం ముగుస్తుంది. ధర్మం గెలుస్తుంది..’ అని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల పేర్కొన్నారు. ‘జగనన్నకు విలువలు, విశ్వసనీయత ఎంతో ముఖ్యం. ఇచ్చిన మాట కోసం ఊపిరి ఉన్నంత వరకు ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కోవాలని గుండె నిబ్బరంతో, దేవునిపై నమ్మకంతో ముందడుగు వేసిన వ్యక్తి జగనన్న. మాటపై నిలబడిన గొప్ప వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోతారు. రాజకీయంగా ఎదుర్కొనే దమ్మూ ధైర్యం కాంగ్రెస్‌, టిడిపి నాయకులకు లేవు. అందుకే జగనన్నను బంధించారు. వీళ్లు నాయకులు కాదు పిరికిపందలు‘ అని ఆమె తూర్పారపట్టారు. ఈ సందర్భంగా వైయస్‌ఆర్‌ అభిమానులు ఏర్పాటు చేసిన 24 అడుగుల మహానేత విగ్రహాన్ని పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రిమతి విజయమ్మతో కలిసి శ్రిమతి షర్మిల ఆవిష్కరించారు.


ప్రజా కంటక కాంగ్రెస్ ప్రభుత్వం పైన, దానితో నిస్సిగ్గుగా అంటకాగుతున్న చంద్రబాబు తీరు పైన, సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యవహార సరళిపైన శ్రీమతి షర్మిల తీవ్రస్థాయిలో ఆరోపణాస్త్రాలు, వ్యంగ్యాస్త్రాలు సంధించారు.‌ కాంగ్రెస్‌, టిడిపిల ప్రజా వ్యతిరేక ధోరణికి నిరసనగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి తరఫున మేమున్నామంటూ ప్రజలకు భరోసానిచ్చేందుకు ఆయన సోదరి శ్రీమతి షర్మిల సుదీర్ఘ, చారిత్రక మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర చేస్తున్నారు. పాదయాత్ర 188వ రోజు ఆదివారం తూర్పు గోదావరి జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు మండలం కాకరాపల్లిలో 2,500 కిలోమీటర్ల చారిత్రక మైలురాయిని దాటింది. ఈ సందర్భంగా కాకరాపల్లిలో ఇసుకవేస్తే రాలనంతగా అభిమానులు, స్థానికులు, పార్టీ శ్రేణులు హాజరైన బహిరంగసభలో శ్రీమతి షర్మిల ఉద్వేగంగా ప్రసంగించారు. ప్రజావ్యతిరేక కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని, దానితో నిస్సిగ్గుగా కుమ్మక్కైన చంద్రబాబు తీరును ఎండగడుతూ వైయస్‌ఆర్‌ జిల్లా ఇడుపులపాయలో జగనన్న తరఫున తాను ప్రారంభించిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర కాకరాపల్లికి చేరివచ్చిన ప్రజలందరి సాక్షిగా 2,500 కిలోమీటర్లు పూర్తిచేసుకున్నట్లు  శ్రీమతి షర్మిల ప్రకటించారు.

కిరణ్‌ రెండు పథకాలు అద్భుతంగా అమలు చేస్తున్నారు :
‘సిఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డి రెండు పథకాలను మాత్రం అద్భుతంగా అమలు చేస్తున్నారు. అన్ని చార్జీలూ పెంచే పథకం ఒకటి. ఈ పథకం కింద ఇప్పటికే ఎరువుల ధరలు 300 నుంచి 800 శాతం వరకు పెంచారు. రూ.305 ఉన్న వంట గ్యాస్‌ సిలిండర్‌ ధరను రూ.440 చేశారు. అది సబ్సిడీ ఉంటే.. సబ్సిడీ లేకపోతే ఒక్కో సిలిండర్‌కు రూ.1000 పెట్టాలి. ఇదే పథకం కింద ఆర్టీసీ చార్జీలు మూడుసార్లు పెంచారు. మున్సిపల్‌, రిజిస్ట్రేషన్‌, పన్నులను పెంచారు. ఇదే పథకం కింద రూ.30 వేల కోట్ల విద్యుత్‌ చార్జీల భారాన్ని ప్రజల నెత్తిన మోపారు.’

‘మరో పథకం పేరు.. వైయస్‌ఆర్‌ సంక్షేమ పథకాలకు తూట్లు పెట్టే పథకం. ఈ పథకం కింద వైయస్‌ఆర్‌ తలపెట్టిన జలయజ్ఞం ప్రాజెక్టులను అటకెక్కించారు. 7.20 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే పోలవరం ప్రాజెక్టు వైయస్‌ఆర్‌ వెళ్లిపోయిన తర్వాత ఒక్క అడుగు కూడా ముందుకు కదల్లేదు. ఏడు గంటల ఉచిత విద్యుత్‌ పథకాన్ని కుదించి మూడు గంటలు చేశారు. ఈ పథకం కిందనే ఫీజు రీయింబర్సుమెంట్‌ పథకాన్ని కుదించి సగం ఇస్తాం, ముక్కాలు ఇస్తామంటూ విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్నారు. ఆరోగ్యశ్రీ నుంచి 133 వ్యాధులను, 97 ఆసుపత్రులను తొలగించారు. ఈ పథకం కిందనే 108, 104 నిర్వీర్యం చేస్తున్నారు.. పక్కా ఇళ్లకు పాడెకట్టారు. వైయస్‌ఆర్‌ ఇచ్చిన పింఛన్లను, రేషన్‌ కార్డులను తీసేస్తున్నారంటే ఇక కిరణ్‌కు చంద్రబాబుకు పెద్దగా తేడా లేదు. కిరణ్‌ తెలుసుకోవాల్సింది ఏమిటంటే.. పథకాల పేర్లు మార్చి, పబ్లిసిటీ ఇచ్చుకుంటే సరిపోదు. ఆ పథకాలు అమలు కావాలంటే వైయస్‌లాగా చిత్తశుద్ధి ఉండాలి. వైయస్‌ఆర్‌ తన పథకాలను అలా అమలు చేసి చూపించారు కాబట్టే ప్రజలు వైయస్‌ లాంటి నాయకుడే మళ్లీ కావాలని ప్రజలు కోరుకుంటున్నారు.


ఇలాంటి దుర్మార్గమైన ప్రభుత్వాన్ని అవిశ్వాసంతో గద్దె దింపాల్సిన ప్రధాన ప్రతిపక్షం, దాని నాయకుడు నిస్సిగ్గుగా దానికే వత్తాసు పలుకుతున్నారని శ్రీమతి షర్మిల విమర్శించారు. ప్రధాన ప్రతిపక్షంగా అవిశ్వాస తీర్మానం పెట్టి ఈ ప్రభుత్వాన్ని దించేయకుండా మొద్దు నిద్రపోతోందని ఎద్దేవా చేశారు. అవిశ్వాసం పెట్టిన ప్రతిసారీ ప్రభుత్వానికే అండదండగా చంద్రబాబు నిలుస్తున్నారని ఆరోపించారు. ఎప్పుడూ ఏ పనీ చేయకుండా తిని కూర్చునే వాడిని ‘ఎందుకయ్యా ఏ పని చేయవు? అని అడిగితే ఆయన చెప్పాడటా.. ఏం చేద్దాం? తినక ముందు నీరసం, తిన్నాక ఆయాసం అన్నాడట. చంద్రబాబు తొమ్మిదేళ్లు సిఎంగా ఉన్నారు. కానీ ప్రజలకు ఈ మేలు చేశాను అని చెప్పుకునే పరిస్థితిలో లేరు. ఇప్పుడు 9 ఏళ్లు ప్రతిపక్ష నాయకునిగా ఉన్నారు. నేను ప్రజల కోసం ఈ పోరాటం చేశాను అనే పరిస్థితి కూడా లేదు. ఏం చేశారయ్యా చంద్రబాబు అని అంటే.. ‘ఏం చేద్దాం ముందు నీరసం, ఇప్పుడు ఆయాసం’ అన్నట్టు ఉంది ఆయన తీరు. రాజన్న రాజ్యం వచ్చిన రోజున, జగనన్న ముఖ్యమంత్రి అయిన రోజున వైయస్‌ఆర్‌ అమలు చేసిన ప్రతి సంక్షేమ పథకానికీ జగనన్న మళ్లీ జీవం పోస్తారు. చంద్రబాబూ.. మీకు ధైర్యం ఉంటే మీ 9 ఏళ్ల పాలనను తిరిగి తెస్తాను అని చెప్పగలరా?’ అని ప్రశ్నించారు.


ప్రజలంటే చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డిలకు లెక్కే లేదని, చిన్నచూపు చూస్తారని శ్రీమతి షర్మిల తూర్పారపట్టారు. తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఏనాడూ ప్రజల కష్టాలు పట్టించుకోలేదన్నారు.‌ ప్రభుత్వ ఆస్తులు, పరిశ్రమలను ముక్కలుగా చేసి తన బినామీలకు అప్పనంగా కట్టబెట్టేసిన ఘనుడు చంద్రబాబు అని దుమ్మెత్తిపోశారు. పైగా ఇప్పుడు ఆయన పాదయాత్ర పేరుతో ఊళ్ళమ్మట తిరిగి వైయస్ రాజశేఖరరెడ్డి అమలు చేసిన పథకాలనే తాను మరింత సమర్థంగా అమలు చేస్తానంటూ తిరిగారని ఎద్దేవా చేశారు. రైతుల రుణాల మాఫీ సంగతి అటుంచి కనీసం రుణాల మీద వడ్డీని మాఫీ చేయాలన్న ఆలోచనైనా సిఎంగా ఉన్నప్పుడు చంద్రబాబుకు వచ్చిందా? అని శ్రీమతి షర్మిల ప్రశ్నించారు. వ్యవసాయం దండగ అన్నారని, ప్రజలకు ఏదీ ఉచితంగా ఇవ్వకూడదని, సబ్సిడీలు ఇస్తే సోమరిపోతులవుతారని కించపరిచారని గుర్తుచేశారు. చంద్రబాబు నిర్ణయాల కారణంగా బ్రతికే దారి లేక లక్షలాది కుటుంబాలు పొరుగు రాష్ట్రాలకు పొట్ట చేతపట్టుకుని వలస కూలీలుగా వెళ్ళిపోవాల్సిన దుర్గతి పట్టిందని ఆవేదన వ్యక్తంచేశారు. విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు కాదుగదా కనీసం మెస్‌ చార్జీలు కూడా ఇవ్వని కఠినాత్ముడని దుయ్యబట్టారు.

ఇలా ప్రతిసారీ కాంగ్రెస్‌తో కుమ్మక్కయిన టిడిపి నాయకులు కాంగ్రెస్‌ - వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలు కుమ్మక్కయ్యాయంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని ఆమె నిప్పులు చెరిగారు. నిజంగా కాంగ్రెస్‌ పార్టీతో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కుమ్మక్కైతే జగనన్న జైలులో కష్టాలు పడాల్సిన అగత్యం ఎందుకు పడుతుందని శ్రీమతి షర్మిల ప్రశ్నించారు. రాజన్న రాజ్యం జగనన్నతోనే సాధ్యం అవుతుందని శ్రీమతి షర్మిల అన్నారు. రాబోయే రాజన్న రాజ్యంలో వైయస్‌ రాజశేఖరరెడ్డి నాటి సువర్ణ పరిపాలనను చూస్తామన్నారు. రాబోయే రాజన్న రాజ్యంలో జగనన్న సిఎం అయ్యాక విద్యార్థులు ఉచితంగా ఉన్నత చదువులు చదువుకునే అవకాశం వస్తుందన్నారు. జగనన్న సిఎం అయ్యాక అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలు అమలు చేస్తారన్నారు. జగనన్న సిఎం అయ్యాక గ్రామాల్లో బెల్టు షాపులు ఉండవని, నియోజకవర్గానికి ఒక్క మద్యం షాపు మాత్రమే ఉండేలా చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు.

ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకోవాలని, ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలని ఒక ఆదర్శ సిఎంగా పరిపాలన చేసి చూపించిన మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి అని శ్రీమతి షర్మిల పేర్కొన్నారు. పేద విద్యార్థులు కూడా ఉన్నత విద్యను ఉచితంగా అందించిన సిఎం వైయస్‌ అన్నారు. పేదలు కూడా కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో ఉచితంగా వైద్య సేవలు పొందాలని ఆరోగ్యశ్రీని తెచ్చారన్నారు. వ్యవసాయానికి ఉచితంగా విద్యుత్‌ ఇచ్చారని, జలయజ్ఞం ప్రారంభించి వేల కోట్ల నిధులు కేటాయించి చాలా ప్రాజెక్టులను ఆయన చేపట్టారన్నారు. వాటిలో పలు ప్రాజెక్టులు చాల వరకూ పూర్తయ్యాయని, కేవలం కొద్దిమొత్తంలో నిధులు ఇస్తే పూర్తయిపోయే ప్రాజెక్టులను కూడా కాంగ్రెస్‌ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికీ ఏదో ఒక మేలు జరిగేలా వైయస్‌ రాజశేఖరరెడ్డి పథకాలు రూపొందించి అమలు చేశారన్నారు. ఆయన హయాంలో గ్యాస్‌ ధర ఒక్క రూపాయి కూడా పెరగలేదన్నారు. బస్సు చార్జీలు, విద్యుత్‌ చార్జీలు పెంచలేదన్నారు. మన రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని మహానేత వైయస్‌ ఎంతగానో తపించారన్నారు.

ఎస్టీలకు ఏం చేశారు? :
ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ అంటూ ఎన్నో ప్రకటనలు చూస్తున్నాం. ఎస్సీ, ఎస్టీలకు చేసింది ఏమిటో ధైర్యం ఉంటే కిరణ్‌ కుమార్‌రెడ్డి బహిరంగంగా చెప్పాలి. వైయస్‌ఆర్‌ 20 లక్షల ఎకరాల అటవీ భూమిపై గిరిజనులకు హక్కులు కల్పించారు. ఎస్సీ, ఎస్టీల కోసం ఎన్నో చేశారు. కిరణ్‌కు ప్రచారం చేసుకోవడం తప్ప నిజంగా వారికి ఒరగబెట్టిందేమీ లేదు. ఇక రాజీవ్‌ యువ కిరణాలు అంటూ ఇంకో పథకం పెట్టారు. 35 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. రూ.6 లక్షల కోట్ల విలువ చేసే పెట్టుబడులు తెస్తానన్నారు. ఏమైంది కిరణ్‌ కుమార్‌ రెడ్డి గారూ అంటే ఆయన మాటలు కోటలు దాటుతున్నాయి కాని.. చేతలు మాత్రం గడప దాటడం లేదు. కనీసం 10, 15 శాతమైనా ఉద్యోగాలిప్పించారా అంటే లేదనే సమాధానం వస్తుంది.

కిరణ్‌ కుమార్‌రెడ్డి కొత్తపథకాలను ప్రవేశపెట్టాల్సిన అవసరమే లేదని శ్రీమతి షర్మిల అన్నారు. వైయస్‌ రాజశేఖరరెడ్డి అమలు చేసిన పథకాలను కొనసాగిస్తే చాలన్నారు. వ్యవసాయానికి కిరణ్‌ ప్రభుత్వం కనీసం మూడు గంటలు కూడా ఉచిత విద్యుత్‌ను సరఫరా చేయలేకపోతున్నారని ఆరోపించారు. ప్రతి ఎన్నికలోనూ కాంగ్రెస్‌, టిడిపిలు కుమ్మక్కయ్యాయని శ్రీమతి షర్మిల దుయ్యబట్టారు. జగనన్న విషయంలో కూడా కుమ్మక్కై, అబద్ధపు కేసులు పెట్టి ఆయనను జైలుపాలు చేశాయని విమర్శించారు. జగనన్న జనం మధ్యన ఉంటే ఆ రెండు పార్టీలకూ మనుగడే ఉండదని ఇంత దుర్మార్గానికి ఒడిగట్టారని ఆవేదన వ్యక్తంచేశారు.

పంచాయతీ ఎన్నికల్లో మన జెండా రెపరెపలాడాలి : విజయమ్మ
‘త్వరలో జరగబోయే పంచాయతీ ఎన్నికల్లో ప్రతి పంచాయతీ మీద వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ జెండా రెపరెపలాడాలి. ప్రత్యర్థులకు పార్టీ సత్తా చూపించాలి. మీరు ఇచ్చే తీర్పు ప్రత్యర్థుల గుండెల్లో దడ పుట్టించే విధంగా ఉండాలి..’ అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ పిలుపునిచ్చారు. మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 2,500 కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా ఆమె శ్రీమతి షర్మిలను అభినందించేందుకు తూర్పు గోదావరి జిల్లా కాకరాపల్లి వచ్చారు. మహానేత వైయస్‌ఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆమె ప్రసంగించారు.

‘ఈ రోజు రాష్ట్రంలో నడిచే రాజకీయాలను మీరంతా చూస్తున్నారు. వాస్తవానికి ముందుగా మున్సిపల్‌ ఎన్నికలు జరగాలి. ఆ తర్వాత మండల పరిషత్‌ ఎన్నికలు, తర్వాత పంచాయతీ ఎన్నికలు జరగాలి. కానీ పార్టీ రహితంగా జరిగే ఎన్నికలు కాబట్టి పంచాయతీ ఎన్నికలను ముందుకు తెస్తున్నారు. సహకార సొసైటీ ఎన్నికల్లో అప్రజాస్వామిక పద్ధతుల్లో, మాయలు చేసి, మోసాలు చేసి మాదే పైచేయి అని ఎలా చెప్పుకున్నారో ఈ ఎన్నికల్లో కూడా అలాంటి అక్రమాలకు పాల్పడే అవకాశం ఉంది’ అని విజయమ్మ అన్నారు. ‘పదేళ్ల కిందట వైయస్‌ఆర్‌ గారు ‘ప్రజా ప్రస్థానం’ పేరుతో మీ దగ్గరకు వచ్చారు. ఆయన మన మధ్య నుంచి వెళ్లిపోయిన తర్వాత జగన్‌బాబు మిమ్మల్ని కలిసేందుకు, మీతో మాట్లాడేందుకు ‘ఓదార్పు యాత్ర’తో మీ దగ్గరకు వచ్చారు. ఇప్పుడు ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారని, కష్టాల్లో ఉన్నారని జగన్‌బాబు రాలేని స్థితిలో, మిమ్మల్నందరినీ కలవమని చెప్పి జగన్‌బాబు పంపడంతో షర్మిలమ్మ ‘మరో ప్రజాప్రస్థానం’ పేరుతో మీ ముందుకు వచ్చారు. మీ అందరి ప్రేమతోనే షర్మిల 2,500 కిలో మీటర్లు నడిచారు’ అని చెప్పారు.

శ్రీమతి షర్మిల పాదయాత్రకు మద్దతుగా, తోడునీడగా నిలుస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెప్పారు. ఒక బిడ్డ జైలులో ఉంటే, మరో బిడ్డ వీధుల్లో ఉండాల్సిన పరిస్థితి తనకు కలిగిందని గద్గధ స్వరంతో అన్నారు. షర్మిలమ్మను రాజశేఖరరెడ్డిగారు చాలా ముద్దుగా చూసుకునేవారని చెప్పారు. అలాంటి తన బిడ్డ షర్మిలను రోడ్డు మీదకు పంపించేటప్పుడు చాలా దుఃఖం కలిగిందన్నారు. అయితే, షర్మిలమ్మను ప్రజలంతా తమ బిడ్డగా, సోదరిగా, మనవరాలిగాఅక్కున చేర్చుకుంటున్న తీరును, మద్దతుగా నిలుస్తున్న వైనాన్ని చూసిన తరువాత తన ఆవేదన తగ్గిందని, సంతోషంగా ఉందని పేరుపేరునా అందరికీ ధన్యవాదాలు తెలిపారు.

కాగా, 'జోహార్‌ వైయస్‌ఆర్‌', 'జై జగన్‌' నినాదాలతో కాకరాపల్లి దద్దరిల్లిపోయింది. శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 2.500 కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా కాకరాపల్లిలో పండుగ వాతావరణం నెలకొన్నది. అభిమానులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి శ్రీమతి షర్మిలకు హార్దిక స్వాగతం పలికారు. పాదయాత్ర మైలురాయిని దాటిన సందర్భాన్ని పురస్కరించుకుని కాకరాపల్లిలో 24 అడుగుల ఎత్తైన వైయస్‌ఆర్‌ విగ్రహాన్ని శ్రీమతి షర్మిల ఆవిష్కరించారు.

అనంతపురం పెద్దకోట్ల   వద్ద 100 కిలోమీటర్లు, మహబూబ్‌నగర్‌ జిల్లా శాంతినగర్‌లో 500 కిలోమీటర్లు, నల్గొండజిల్లా కొండ్రపోల్‌ కాల్వ వద్ద 1,000 కిలోమీటర్లు, కృష్ణాజిల్లా పెడన దగ్గర 1.500 కిలోమీటర్లు, పశ్చిమగోదావరి జిల్లా రావికంపాడు వద్ద 2,000 కిలోమీటర్ల మైలురాళ్ళు దాటిని శ్రీమతి షర్మిల తన పాదయాత్ర 188వ రోజు ఆదివారంనాడు 2.500వ మైలురాయిని అధిగమించారు.

Back to Top