బాబుకు అధికారం ఇస్తే గొయ్యి తవ్వుకున్నట్లే

విశాఖపట్నం, 15 సెప్టెంబర్ 2013:

చంద్రబాబు నాయుడికి అధికారం ఇస్తే మన గొయ్యి మనమే తవ్వుకున్నట్లు అవుతుందని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల హెచ్చరించారు. ఆత్మగౌరవం అంటూ యాత్ర చేపట్టిన చంద్రబాబు ఆకస్మాత్తుగా దాన్ని ఆపేసి ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారో చెప్పాలని శ్రీమతి షర్మిల డిమాండ్ చేశారు.‌ శ్రీ జగన్మోహన్‌రెడ్డికి బెయిల్ రాకుండా చూసేందుకే ‌చంద్రబాబు ఢిల్లీ వెళుతున్నారన్నారు. ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి కాంగ్రెస్లో కలి‌పేసినట్లే టిడిపిని కూడా కలిపేస్తారా అని ప్రశ్నించారు. నేరం రుజువు కాకుండా జగనన్నను 16 నెలలుగా జైలులో నిర్బంధించడం నీచ రాజకీయాలకు నిదర్శనం అని శ్రీమతి షర్మిల వ్యాఖ్యానించారు. సమైక్య శంఖారావం బస్సు యాత్ర ఆదివారం ఉదయం విశాఖపట్నం నగరంలో కొనసాగింది. ఈ సందర్భంగా జగదాంబ సెంటర్‌లో భారీ ఎత్తున తరలి వచ్చిన అభిమానులు, పార్టీ శ్రేణులను ఉద్దేశించి శ్రీమతి షర్మిల ప్రసంగించారు.

రాష్ట్రంలో అనిశ్చితి నెలకొందట.. దాన్ని దూరం చేయమని కాంగ్రెస్‌ పార్టీని అడిగేందుకు ఇప్పుడు చంద్రబాబు ఢిల్లీ వెళుతున్నారట అని శ్రీమతి షర్మిల ఎద్దేవా చేశారు. ఈ అనిశ్చితికి కారణం మీరు కాదా చంద్రబాబుగారూ అని నిలదీశారు. తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చి, అనిశ్చితికి కారణమైన చంద్రబాబు మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని దాన్ని దూరం చేయమని అడగడానికి ఢిల్లీ వెళుతున్నారని ప్రశ్నించారు. రెండు ప్రాంతాల నాయకులనూ ఢిల్లీ తీసుకువెళ్ళి మీది రెండు కళ్ళ సిద్ధాంతమని, రెండు నాల్కల ధోరణి అని చెప్పాలనుకుంటున్నారా అన్నారు. అందుకనే ఎప్పుడూ రెండు వేళ్ళు ఊపుకుంటూ తిరుగుతుంటారా? అని ఎద్దేవా చేశారు. సమైక్యమని చెప్పాలనా, విభజనకు అనుకూలమని చెప్పడానికా ఏం చెప్పాలని మీ నాయకులను తీసుకుని ఢిల్లీకి వెళుతున్నారని నిలదీశారు.

లేకపోతే ఇంత మంది ఎమ్మెల్యేలు మీ వెంట ఉన్నారని, బలప్రదర్శన చేసి, వారిని అమ్మకానికి పెట్టి, శ్రీ జగన్మోహన్‌రెడ్డికి బెయిల్‌ రాకుండా చూడడానికి నా సరుకు ఇది అని బేరం కుదుర్చుకోవడానికి ఢిల్లీకి వెళుతున్నారా? అని శ్రీమతి షర్మిల తూర్పారపట్టారు. మీరు, మీ నాయకులు అందరూ సోనియా కాళ్ళ మీద పడి జగన్మోహన్‌రెడ్డి గారికి ఎలాగైనా బెయిల్‌ రాకుండా చూడాలని వేడుకోవడానికి తీసుకువెళుతున్నారా? అని ప్రశ్నించారు. లేకపోతే.. కిరణ్‌కుమార్‌రెడ్డి, బొత్సకే కాకుండా మీకు కూడా సోనియాయే అధిష్టానం అని, ఆమె ఏ ఆదేశమిచ్చినా శిరసావహిస్తానని చెప్పేందుకు వెళుతున్నారా? అని ఎద్దేవా చేశారు. సోనియా కాళ్ళ మీద పడి మీ మీద ఏ కేసులకూ విచారణ జరగకుండా చూడమని ప్రాధేయపడడానికి ఢిల్లీ వెళుతున్నారా? చంద్రబాబు గారూ అని అన్నారు.

ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో కలిపేసిన చిరంజీవికి, నాలుగేళ్ళుగా కాంగ్రెస్‌కు మద్దతుగా ఉన్న మీకు ఏమైనా తేడా ఉందా? చంద్రబాబుగారూ అని ఎద్దేవా చేశారు. మీ పార్టీని కాంగ్రెస్‌లో కలిపేస్తే.. కనీసం మీకు కూడా ఏ కేంద్ర మంత్రి పదవో వస్తుందేమో కానీ రాష్ట్రంలో ఉంటే మీకు ఏమీ ప్రయోజనం ఉండదన్నారు. చంద్రబాబు పాదయాత్రలు చేసినా, బస్సు యాత్రలు చేసినా, ఢిల్లీ యాత్రలు చేస్తున్న ప్రజల కోసం మాత్రం కాదని శ్రీమతి షర్మిల అన్నారు. కేవలం శ్రీ జగన్మోహన్‌రెడ్డి బెయిల్‌ను అడ్డుకోవడం కోసమే అని ఆరోపించారు. తొమ్మిదేసి సంవత్సరాలు అధికారంలో, ప్రతిపక్షంలో ఉన్న మీరు కేవలం ఒక్క మనిషి జగనన్నను రాజకీయంగా ఎదుర్కొనే దమ్మూ ధైర్యం లేకుండా ఆయన బెయిల్‌ను అడ్డుకోవడానికే ఢిల్లీ వెళుతున్నామని నిస్సిగ్గుగా చెబుతున్నారంటే.. మీరు ఏ రకం నాయకులండీ అని ప్రశ్నించారు.

నేరం రుజువు కాకుండానే ఒక అమాయకుడిని 16 నెలలుగా జైలుపాలు చేశారంటే... 'ఛీ'.. ఇవి రాజకీయాలా? అని చంద్రబాబు నాయుడిపై శ్రీమతి షర్మిల ఆగ్రహం వ్యక్తంచేశారు. మీలాంటి వాళ్ళు మనుషులా? అన్నారు. ఇలాంటి వ్యక్తికి 6 నెలలు అధికారం ఇస్తే.. రాష్ట్రాన్నే కాదు దేశాన్నే గాడిలో పెడతానంటున్నారు. వెన్నుపోట్ల రాజకీయాలు చేసే చంద్రబాబు సిఎం కుర్చీలో కూర్చొని వ్యవసాయాన్ని దండగ చేశారని దుమ్మెత్తిపోశారు. చార్జీలు, పన్నులు పెంచి పేదల ఉసురుపోసుకున్నారని వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు అధికారం ఇవ్వడమంటే నరకాసురుడికి మళ్ళీ అధికారం ఇచ్చినట్లే అన్నారు. పేనుకు పెత్తనం ఇస్తే.. అంతా గొరిగేసిందంట.. ఆయనకు అధికారం ఇస్తే.. మన గొయ్యి మనమే తవ్వుకున్నట్టు లెక్క అన్నారు.

దివంగత మహానేత డాక్టర్ వై‌యస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో ఏ చార్జీ పెరగలేదని, అలాగే ఎటువంటి పన్నులూ వేయకుండా మన రాష్ట్రాన్ని అభివృద్ది చేశారని శ్రీమతి షర్మిల పేర్కొన్నారు. ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందించారన్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం రాజశేఖరరెడ్డిగారి ప్రతి పథకానికీ తూట్లు పొడిచిందని దుయ్యబట్టారు. ఆయన ప్రతి ఉద్దేశాన్నీ విమర్శించిందన్నారు. సంక్షేమ పథకాలకు పాడె కట్టిందని, అభివృద్ధిని అటకెక్కించిందన్నారు.

చేసిన పాపాలు సరిపోనట్లు ఇప్పుడు రాష్ట్ర విభజన పేరుతో కాంగ్రెస్ పార్టీ అన్నదమ్ములాంటి తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెట్టిందని‌, ఆ చిచ్చులో చలి కాచుకుంటోందని శ్రీమతి షర్మిల తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఓట్లు, సీట్ల కోసం టిఆర్‌ఎస్‌ను కలుపుకుని అయినా సరే రాహుల్‌గాంధీని ప్రధానిని చేసుకోవాలని కోట్ల మంది సీమాంధ్రులకు అన్యాయం చేయడానికి పూనుకుందన్నారు.

మన రాష్ట్రం ముక్కలైపోతే.. కృష్ణా, గోదావరి నీళ్ళను మధ్యలో వచ్చే రాష్ట్రం అడ్డుకుంటే.. సీమాంధ్రలోని ప్రాజెక్టులకు నీరు రాకపోతే ఈ ప్రాంతమంతా ఎడారిగా మారుతుందని శ్రీమతి షర్మిల ఆందోళన వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా చేసినా దానిని ఏ నీళ్ళతో నింపుతారో కాంగ్రెస్‌ పార్టీ సమాధానం చెప్పాలన్నారు. సీమాంధ్ర గ్రామాలను వల్లకాడులుగా మార్చాలన్నది కాంగ్రెస్‌ అభిమతమా అని నిలదీశారు. రాష్ట్ర విభజన సందర్భంగా గతంలో మద్రాసు తీసుకున్నారని, ఇప్పుడు హైదరాబాద్ను‌ కూడా సీమాంధ్రులకు దూరం చేస్తున్నారని ఆమె విచారం వ్యక్తంచేశారు. హైదరాబాద్ నగర అభివృద్ధిలో సీమాంధ్రుల కృషి లేదా అని శ్రీమతి షర్మిల ప్రశ్నించారు. విభజన జరిగితే సీమాంధ్రులు ఉద్యోగాల కోసం ఎక్కడికి వెళ్లాలో కాంగ్రెస్ పార్టీ‌ సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.‌ పదేళ్ల కాలంలో హైదరాబాద్ లాంటి రాజధాని నగ‌రాన్ని నిర్మించుకోవడం అసలు సాధ్యమయ్యే పనేనా కాంగ్రెస్‌ పార్టీ సమాధానం చెప్పాలన్నారు.

రాష్ట్ర ఆదాయంలో సగం వచ్చే హైదరాబాద్‌లో సీమాంధ్రులకు భాగం లేకపోతే.. ఉద్యోగులకు జీతాలెలా ఇవ్వాలి? పింఛన్లు ఏ విధంగా చెల్లించాలి? సంక్షేమ పథకాలెలా అమలు చేయాలి? ఈ ప్రశ్నలకు కాంగ్రెస్‌ పార్టీ సమాధానం చెప్పడంలేదన్నారు. పోనీ సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అయినా సమాధానం చెబుతారేమో అనుకుంటే దిష్టిబొమ్మలాగా అలాగే నిలబడి చూస్తున్నారు గాని నోరు విప్పడం లేదన్నారు. రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ పార్టీ చీలుస్తుందని ఎప్పుడో తెలిసినా కూడా అడ్డుకుంటే తన పదవి పోతుందని పట్టించుకోలేదని శ్రీమతి షర్మిల ఆరోపించారు. దిగ్విజయ్‌ సింగ్‌ ప్రకటించే వరకూ కిరణ్‌రెడ్డి విభజన విషయాన్ని గోప్యంగా ఉంచారని నిప్పులు చెరిగారు. చేయాల్సిన అన్యాయం అంతా చేసేసి తనను ప్రజలు ఎక్కడ ప్రశ్నిస్తారో అని ఆయనే ప్రజలకు ప్రశ్నలు సంధించారంటే ఎంత తెలివైన వారో అర్థమవుతోందన్నారు.

రాష్ట్ర విభజనతో కోట్లాది మంది సీమాంధ్రులకు ఇంత అన్యాయం జరుగుతున్నా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడిలో ఏమాత్రం చలనం లేదని శ్రీమతి షర్మిల ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్ర విభజనకు అసలు కారణం చంద్రబాబే అని ఆమె ఆరోపించారు. తెలంగాణకు అనుకూలంగా బ్లాంక్‌ చెక్కులా లేఖ ఇచ్చి చంద్రబాబు పెద్ద తప్పు చేశారని శ్రీమతి షర్మిల నిప్పులు చెరిగారు. తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చి ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్న చంద్రబాబు తీరు హత్య చేసి అదే శవంపై పడి వెక్కి వెక్కి ఏడ్చినట్టు ఉందని ఆమె ఎద్దేవా చేశారు. రాష్ట్ర విభజనతో 60 శాతం మందికి అన్యాయం జరుగుతుందన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా అన్యాయమైపోతున్న ప్రజల పక్షాన నిలబడి వారి తరఫున పోరాటం చేయాలని, అధికార పక్షాన్ని కాలర్‌ పట్టుకుని చంద్రబాబు నిలదీయాలన్నారు. అయితే నిస్సిగ్గుగా కాంగ్రెస్‌తోనే చంద్రబాబు కుమ్మక్కైపోయారన్నారు. ఇలాంటి వ్యక్తిని ప్రతిపక్ష నాయకుడనాలా? లేక దుర్మార్గుడనాలా? అన్నారు.

రాష్ట్ర విభజనకు వైయస్ఆర్‌ కాంగ్రెస్‌, ఎంఐఎం, సిపిఎం ఎప్పుడూ అనుకూలమని చెప్పలేదన్నారు. తప్పు చేసినందుకు చెంపలు వేసుకుని, ఈ మూడు పార్టీల పక్షాన నాలుగో పార్టీగా నిలబడాలని చంద్రబాబుకు శ్రీమతి షర్మిల సూచించారు. ఆయనలో ఏమాత్రం నిజాయితీ ఉన్నా, చిత్తశుద్ధి ఉన్నా తాను కూడా తెలంగాణకు వ్యతిరేకమని ప్రకటించాలన్నారు. తెలంగాణాకు అనుకూలంగా ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోవాలి ఆమె డిమాండ్ చేశారు. చంద్రబాబు రాజీనామా చేసి తమ పార్టీ నేతలతో రాజీ నామా చేయించా‌లని, అప్పటి వరకూ సీమాంధ్రలో ఆయనను అడుగు పెట్టనివ్వవద్దని, తరిమి తరిమి కొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. టిడిపి నాయకులంతా రాజీనామాలు చేశాకే చంద్రబాబు సీమాంధ్రలో అడుగుపెట్టాలన్నారు.

రాష్ట్రాన్ని విభజిస్తున్నామని కాంగ్రెస్‌ పార్టీ సంకేతాలిచ్చిన వెంటనే వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులంతా తమ పదవులకు రాజీనామాలు చేసిన వైనాన్ని శ్రీమతి షర్మిల ప్రస్తావించారు. కేంద్రంలోని పెద్దలకు లేఖల మీద లేఖలు పార్టీ నాయకులు ఇప్పటికీ రాస్తూ.. పోరాటం చేస్తున్నారన్నారు. ఆ రోజునే సీమాంధ్ర కాంగ్రెస్, టిడిపి నాయకులు కూడా రాజీనామాలు చేసి ఉంటే ఇప్పుడ ఈ దుస్థితి వచ్చేది కాదన్నారు. వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ నాయకుల్లా ఆ పార్టీల నుంచి ఎంతమంది ప్రజల పక్షాన నిలబడ్డారని ప్రశ్నించారు. ఏ ప్రాంతానికి అన్యాయం జరగకుండా కన్నతండ్రిలా ఆలోచించి నిర్ణయం తీసుకోమని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మొదటి నుంచీ చెబుతోందన్నారు. న్యాయం చేయాలనే ఉద్దేశం, న్యాయం చేసే సత్తా కాంగ్రెస్ లే‌దని తేలిపోయింది కనుక రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ డిమాండ్‌ చేస్తోందన్నారు.

కోట్లాది మందికి అన్యాయం జరుగుతుంటే జగనన్న చేతులు కట్టుకని కూర్చోరని శ్రీమతి షర్మిల అన్నారు. ప్రజల పక్షాన తమ పార్టీ జగనన్న నాయకత్వంలో వెనకడుగు వేయకుండా పోరాటం చేస్తుందని మాట ఇచ్చారు.

Back to Top