ఇడుపులపాయలో వైయస్ఆర్‌కు షర్మిల నివాళి

ఇడుపులపాయ, (వైయస్‌ఆర్ జిల్లా), 6 ఆగస్టు 2013: చరిత్రాత్మక, సుదీర్ఘ మరో ప్రజాప్రస్థానం పాదయాత్రను విజయవంతంగా పూర్తిచేసిన శ్రీమతి షర్మిల తొలిసారిగా మంగళవారంనాడు ఇడుపులపాయ చేరుకున్నారు. తన తండ్రి, మహానేత డాక్టర్ వై‌యస్‌ రాజశేఖరరెడ్డి సమాధి వైయస్ఆర్ ఘా‌ట్ వద్ద ‌ఆయనకు నివాళులు అర్పించారు. వైయస్ఆర్‌ ఘాట్‌ వద్ద తన తండ్రి ఆశీస్సులతో 2012 అక్టోబర్‌ 18న మరో ప్రజాప్రస్థానం ప్రారంభించి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో పాదయాత్రను ఆదివారంనాడే పూర్తిచేశారు. శ్రీమతి షర్మిల సోమవారం హైదరాబాద్ చేరుకు‌ని అన్న జగనన్నను కలుసుకుని పాదయాత్ర విశేషాలు వివరించిన విషయం తెలిసిందే.

మంగళవారం ఉదయం ఇడుపులపాయలోని తండ్రి సమాధి వద్ద నివాళులు అర్పించటంతో పాటు ప్రార్థన కార్యక్రమాలలో ఆమె పాల్గొన్నారు. వైయస్ఆర్‌ ఘాట్‌ వద్ద మహానేతకు నివాళులు అర్పించిన వారిలో శ్రీమతి వైయస్‌ విజయమ్మ, శ్రీమతి షర్మిల భర్త బ్రదర్‌ అనిల్‌ కుమార్, శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సతీమణి శ్రీమతి వైయస్‌ భారతి, వైయస్‌ వివేకానందరెడ్డి, ఇతర కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు ఉన్నారు. వైయస్ఆర్‌ ఘాట్‌ వద్ద ప్రార్ధనల అనంతరం శ్రీమతి షర్మిలను పలువురు సర్పంచ్లతో పాటు వై‌యస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలుసుకుంటారు.

ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ 230 రోజులు పాదయాత్ర చేసి 3,112 కిలోమీటర్ల నడిచిన శ్రీమతి షర్మిల సోమవారం ఉదయం చంచల్గూడలో ఉన్న శ్రీ జగన్మోహన్‌రెడ్డిని కలుసుకున్నారు. పాదయాత్ర విజయవంతమైనందుకు శ్రీ జగన్ ఆనందం వ్యక్తం చేశారని ‌శ్రీమతి షర్మిల భేటీ అనంతరం జైలు బయట వేచి ఉన్న మీడియాకు చెప్పారు.

తాజా వీడియోలు

Back to Top