పబ్లిసిటీ మాని రైతులను ఆదుకోండి

()రైతుల బతుకులు దుర్భరం
()ఈ ప్రభుత్వానికి అన్నదాత గోడు పట్టడం లేదు
()ఇప్పటికైనా బాబు కళ్లు తెరవాలి
()రుణాలన్నీ ఒకేసారి మాఫీ చేయాలి
()ఇన్ పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ క్లియర్ చేయాలి
()వైయస్సార్సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి

హైదరాబాద్ః ప్రభుత్వం రైతులను పట్టించుకున్న పాపాన పోవడం లేదని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. అనేక మంత్రిమండలి సమావేశాలు నిర్వహించిన ప్రభుత్వం రైతుల పరిస్థితిపై ఒక్కసారి కూడా చర్చించకపోవడం దారుణమన్నారు. రైతులకు భరోసా కల్పించే నాథుడే కరువయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందకపోవడంతో రైతులు ఇంట్లో బంగారం తాకట్టుపెట్టి మరీ పంటలు వేసుకున్నారని...వర్షాభావంతో పూర్తిగా నష్టపోయారని వాపోయారు. రైతుల పరిస్థితి ఇంత దుర్భరంగా ఉంటే రెయిన్ గన్ లతో కరువును జయించానని చంద్రబాబు చెప్పుకోవడం బాధాకరమన్నారు. బాబుకు ఎంతసేపు ప్రచార ఆర్భాటాలే తప్ప రైతులను ఆదుకోవాలన్న చిత్తశుద్దే లేదని మండిపడ్డారు. రైతులను అన్ని విధాలా ఆదుకోవాలని, పంటనష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో శ్రీకాంత్ రెడ్డి మాట్లాడారు. 

ఖరీఫ్ ముగిసిన తర్వాత కూడా రాష్ట్రవ్యాప్తంగా 13 శాతం డెఫిషిట్ రెయిన్ ఫాల్ ఉందని శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. జూన్ లో వర్షాలు పడడంతో రైతులు పంటలు వేసుకున్నారని, ఆతర్వాత రెండు నెలలకు పైగా వర్షాలు లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. గతేడాది రూ.32 లక్షల హెక్టార్లలో వరి సాగుచేస్తే ఈసారి 36 లక్షల హెక్టార్లలో సాగు చేసుకున్నారని తెలిపారు. వేరుశగన గతంలో ఎప్పుడూ లేనంతగా 2015లో 16 లక్షలు సాగు చేస్తే ఈఏడాది 23 లక్షల ఎకరాల్లో రైతులు పంట వేశారని చెప్పారు. ఐతే, కనీసం పదివేల ఎకరాల్లో కూడా పంట చేతికి వచ్చిన పరిస్థితి లేదన్నారు. ప్రభుత్వం ఒక్క ఎకరా కూడా బతికించ లేదని అన్నారు. పశుగ్రాసానికి కూడా పనికిరాని పరిస్థితిలో రైతులు పంటలు దున్నుతున్న పరిస్థితి చూస్తే కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయని అందుకు సంబంధించిన ఆధారాలను మీడియా ముఖంగా చూపించారు. వర్షాల ఆశతో రెండు, మూడు ఎకరాల పంటలు వేసుకున్న చిన్న, సన్నకారు రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.

వర్షాభావం కారణంగా వరి, వేరుశనగ సహా ఆహారధాన్యాలన్నీ రైతుల చేతికి అందకుండా పోయాయని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. పంట ఎంత వేశారన్నది చెబుతున్నారు గానీ చేతికొచ్చిన  దాని గురించి ప్రభుత్వం, అధికారులు ఎక్కడా చెప్పడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. 70 శాతం వ్యవసాయంపైనే ఆధారపడిన రాష్ట్రం పట్ల ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రభుత్వాన్ని నిలదీశారు. తినడానికి తిండి లేని పరిస్థితుల్లో రైతులు ఉంటే ఎందుకు ఆలోచించరని, వారికి భరోసా ఎందుకు కల్పించలేకపోతున్నారని ప్రశ్నించారు.  దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రధాని, ఆర్థికమంత్రితో మాట్లాడి వడ్డీలు మొత్తం మాఫీ చేయించారని, అలా వైయస్సార్ చొరవ వల్ల దేశమంతా 31 జిల్లాలను గుర్తిస్తే ఒక్క ఏపీలోనే 16 జిల్లాలకు పైగా వడ్డీ మాఫీ అయ్యిందని చెప్పారు. ఏనాడైనా అలా సాధించే పరిస్థితి చేశారా..? బాబుకు ఎంతసేపు ప్రచార ఆర్భాటాలే తప్ప రైతుల ఇబ్బందులే పట్టడం లేదని విమర్శించారు. 

మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు కరువు దృష్ట్యా రైతుల రుణాలన్నీ ఒకేసారి మాఫీ చేయాలని, రీ షెడ్యూల్ చేసేలా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా రుణాలపై వడ్డీ మాఫీ చేయించాలని, ఇన్ పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్  రైతులకు అందేలా చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. 2013-14కు సంబంధించి ఇప్పటివరకు ఇన్ పుట్ సబ్సిడీ పైసా చెల్లించలేదని, ఏమైనా అంటే అది మా ప్రభుత్వానికి కాదని చెప్పి తప్పించుకోవడం సరికాదన్నారు. రైతులను ఆదుకునేవిధంగా ఉండాలే గానీ తప్పించుకోవాలనే నాయకత్వం ఉండడం దురదృష్టకరమన్నారు. 2014-15లో 259 మండలాలను, 2015-16లో 359, 2016-17లో 310 మండలాలను కరువు మండలాలుగా గుర్తించారని కానీ ఇప్పటివరకూ రూపాయి కూడా ఇవ్వలేదన్నారు.  

రెయిన్ గన్ లతో పంటలు బతికిస్తానంటూ బాబు ఫోటోలు దిగడం తప్ప చేసిందేమీ లేదని శ్రీకాంత్ రెడ్డి దుయ్యబట్టారు. ఆయన ఫోటో దిగిన చోట ఎకరా కూడా పంట చేతికొచ్చింది లేదన్నారు. రెయిన్ గన్ లతో హడావిడి చేసి కోట్లాది రూపాయలు ఫ్రాడ్ చేశారని, అదే డబ్బును రైతులకు సబ్సిడీ కింద అందిస్తే ఎంతో బాగుండేదన్నారు. నాలుగు సంవత్సరాల నుంచి ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వకపోవడం దారుణమన్నారు. కనీసం అవైనా ఇస్తే రైతులు రబీలో వాడుకుంటారన్న ఆలోచన కూడా ప్రభుత్వానికి లేకపోవడం బాధాకరమన్నారు. ఉరే గతి అని రైతులు బాధపడుతున్నారని, ప్రభుత్వానికి అది ఎందుకు కనబడడం లేదని సూటిగా ప్రశ్నించారు. భూములు లాక్కోవడంపైన, కాంట్రాక్ట్ లు, కమీషన్లపైన ఉన్న శ్రద్ధ బాబుకు రైతులపై లేకపోవడం బాధాకరమన్నారు. రైతులకు పలానా చేశామని చెప్పుకునే   ధైర్యం లేదంటే ఎంత మోసం చేస్తున్నారో అర్థమవుతోందన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి ఆలోచన చేయాలన్నారు. పబ్లిసిటీ మాని ప్రతీ రైతుకు మంచి జరిగేలా చూడాలన్నారు. నష్టపోయిన వేరుశనగ రైతులకు ఎకరాకు 10 నుంచి 15వేలు, వరి రైతులకు 25 వేల వరకు ఇన్ పుట్ సబ్సిడీ చెల్లించాలని డిమాండ్ చేశారు. తాజా ఫోటోలు

Back to Top