గిరిజన ప్రాంతాలపై దృష్టిపెట్టండి

అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా టీడీపీ చేసింది శూన్యం
వైద్య ఆరోగ్యశాఖా మంత్రి గిరిజన ప్రాంతాల్లో పర్యటించకపోవడం దారుణం
గిరిపుత్రులకు విద్య, వైద్యం అన్నీ అందని ద్రాక్షగానే మిగిలాయి
నిధులున్నా ప్రభుత్వం వాటిని సక్రమంగా ఉపయోగించడం లేదు
ప్రభుత్వం ఇప్పటికైనా గిరిజనుల సమస్యను పరిష్కరించాలి
బాక్సైట్ జీవోను రద్దుచేసి..సభలో తీర్మానం చేయాలిః గిడ్డి ఈశ్వరి

హైదరాబాద్ః ప్రభుత్వం గిరిజన ప్రాంతాలపై చిన్నచూపు చూస్తోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మండిపడ్డారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆమె గిరిపుత్రుల సమస్యలపై మాట్లాడారు. గిరిజన ప్రాంతాల్లో వైద్యం అందని ద్రాక్షగా మారిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ఇంతవరకు గిరిజనుల సమస్యలపై స్పందించిన పాపాన పోలేదని వాపోయారు. వైద్యఆరోగ్యశాఖ మంత్రి కామినేని  ఇప్పటివరకు గిరిజన ప్రాంతాల్లో పర్యటించకపోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. 

వైద్య సదుపాయాలు లేక గిరిజనులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని గిడ్డి ఈశ్వరి అన్నారు. సీహెచ్సీ, పీహెచ్సీల్లో రెగ్యులర్ డాక్టర్ లను, నర్సులను ఏర్పాటు చేయాలని చెప్పినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ప్రధాన సీహెచ్సీల్లో కూడా గైనకాలజిస్ట్ లు , ఎనస్తీయలిస్ట్ లు ఎవరూ లేకపోవడం దారుణమన్నారు. వ్యాధులు వచ్చినా, ప్రమాదాలు జరిగినా విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు పోవాల్సిన దుస్థితి ఏర్పడిందని, అక్కడికి  వెళ్లడానికి కూడా డబ్బులు లేక గిరిజన ప్రాంత ప్రజలు అవస్థలు పడుతున్నారని చెప్పారు. 

వర్షాకాలం, వేసవికి మధ్య ఉన్న ఎపిడమిక్ సీజన్ లో గిరిజనులు మలేరియా, డయేరియా వ్యాధులతో బాధపడుతారని, ఆ సమయంలో మాత్రమే డిప్యూటేషన్ మీద వైద్యులు వచ్చి వెళుతున్నారని ఈశ్వరి తెలిపారు. వైద్యులు పర్మినెంట్ గా ఉండకపోవడంతో సమస్య తీవ్రంగా ఉందన్నారు. అదేవిధంగా అంబులెన్స్ లు ఎక్కువ మోతాలు ఇవ్వాలని కోరినా ఇంతవరకు దాన్ని పట్టించుకున్న నాథుడే లేడన్నారు.  ఇప్పటికైనా గిరిజనులపై వివక్ష చూపకుండా ....అక్కడ మౌళిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేనికి ఉందన్నారు. 

ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించకపోవడంతో ప్రజలు  ఏవిధంగా ఇబ్బందులు పడుతున్నారో ..ప్రభుత్వం కళ్లు తెరిపించేందుకు ఈశ్వరి ఓ హృదయవిదారక ఘటనను సభలో ప్రస్తావించారు. కురుపాం నియోజకవర్గం నుంచి ఓ నెల పాప గుండెకు చిల్లు పడితే... నాలుగు నెలలుగా  కేర్ హాస్పిటల్ కు తిరుగుతున్న విషయాన్ని చెప్పారు. ఇలాంటి సంఘటనలు అనేకం జరుగుతున్నా ప్రభుత్వం కళ్లు తెరవకపోవడంపై ఈశ్వరి ఫైరయ్యారు. నిధులున్నప్పటికీ ప్రభుత్వం వాటిని సక్రమంగా ఉపయోగించకపోవడంతో గిరిజనులకు వైద్యం అందని ద్రాక్షగా మిగులుతోందని ఎమ్మెల్యే  వాపోయారు. 

ప్రభుత్వం స్కూళ్లను తగ్గించడంతో పాఠశాల్లో డ్రాపౌట్స్ పెరుగుతున్నాయని ఈశ్వరి చెప్పారు. యూనిఫామ్స్ దళారులకు ఇవ్వడం వలన నాసిరకం అందిస్తున్నారని పేర్కొన్నారు. ఇక గిరిజన ప్రాంతాల్లోని పాఠశాలల్లో మౌళిక సదుపాయాలు సరిగా లేక పరిస్థితి దారుణంగా తయారైందన్నారు. టాయిలెట్స్ సరిగా లేకపోవడం, బాలికల హాస్టల్స్ కు ప్రహారిగోడలు లేకపోవడం సహా వసతుల లేమి తీవ్రంగా ఉన్న విషయాన్ని సభలో వివరించారు.  గిరిజన సంక్షేమ శాఖలో ఇస్తున్న సబ్ ప్లాన్ నిధులు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏకలవ్య పాఠశాలు, మోడల్ స్కూళ్లు అన్నారు. వాటి ఊసేలేదని ఈశ్వరి ప్రభుత్వాన్ని తూర్పారబట్టారు. 

గిరిజనులకు సరైన విద్య అందకపోవడానికి మరొక కారణం..ప్రభుత్వం ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్ట్ లను భర్తీ  చేయకపోవడమేనన్నారు. ఖాళీలను భర్తీ చేయకుండా విద్యావాలంటరీలతో నడిపిస్తున్నారని...వాళ్లకు కూడా సరిగా జీతాలు ఇవ్వని పరిస్థితి నెలకొందన్నారు. వారికి 1500 జీతాలు పెంచుతామన్న ప్రభుత్వం దాన్ని అటకెక్కించిందని దుయ్యబట్టారు. ఇక ఉద్యోగ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని కల్పించాలన్నారు.1984లో స్పెషల్ టీచర్స్ గా ఎన్నికైన వారు ఎన్నోఏళ్లుగా ఉద్యమాలు చేస్తున్నా ఇంతవరకు నోషనల్ ఇంక్రిమెంట్స్ ఇవ్వలేదన్నారు. వైఎస్సార్ ఇస్తామని హామీ ఇచ్చిన సమయంలో కాలం చిన్నచూపు చూసిందని ఈశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ తర్వాత వచ్చినవారెవరూ వాటిని పట్టించుకోలేదని స్పష్టం చేశారు.  చంద్రబాబు ఆ ఫైల్ ను మూవ్ కూడా  చేయకపోవడం దౌర్భాగ్యమన్నారు.  

మండల పరిషత్ లో చదివే పిల్లలందరికీ  నోట్ బుక్స్, పెన్నులు ఇవ్వాలని ఈశ్వరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా గిరిజన ప్రాంతాల్లోని తాగునీటి సమస్యను పరిష్కరించాలన్నారు. ఎన్టీఆర్ జలసిరి పథకం కనుచూపుమేరలో కనిపించడం లేదని ఎధ్దేవా చేశారు. రోడ్లు అధ్వాన్నంగా తయారయ్యాయని..ప్రభుత్వంపై ఇప్పటికైనా  గిరిజన ప్రాంతాలపై దృష్టిసారించాలన్నారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉన్నారన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం గిరిజన సలహామండలి ఏర్పాటు చేయకపోవడం దారుణమన్నారు.  జీవో 97 రద్దు చేయాలని ఈశ్వరి ప్రభుత్వాన్ని కోరారు. రాబోయే కాలంలో బాక్సైట్ ను తవ్వబోమని తీర్మానం చేయాలన్నారు. మేనిఫెస్టోలో పెన్షన్ 50 సంవత్సరాలకే అందిస్తామని చెప్పారని, గిరిపుత్రికలకు కల్యాణపథకంలోరూ. 50 వేలు అందిస్తామన్నారని..ఆహామీలన్నంటినీ నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 

Back to Top