నేటి నుంచి విశాఖలో మరో ప్రజాప్రస్థానం

విశాఖపట్నం 24 జూన్ 2013:

దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ శ్రీమతి వైయస్ షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర సోమవారం సాయంత్రం విశాఖపట్నం జిల్లాలోకి ప్రవేశించనుంది. నర్సీపట్నం  నియోజకవర్గంలోని గన్నవరంమెట్ట వద్ద జిల్లాలోకి  అడుగుపెట్టబోతున్నారు. ఇక్కడ శ్రీమతి షర్మిల మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. 2003లో రాజశేఖరరెడ్డిగారు  ఇదే గ్రామంలో అడుగుపెట్టి విశాఖ జిల్లాలో ప్రజాప్రస్థానం యాత్ర ప్రారంభించారు. ఇక్కడి మూడు రోడ్ల జంక్షన్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ప్రస్తుతం జిల్లాలో శ్రీమతి షర్మిల తొలి సభను కూడా పార్టీ నేతలు ఇక్కడే ఏర్పాటు చేశారు. డాక్టర్ వైయస్ఆర్  తనయకు ఘనస్వాగతం పలికి అక్కున చేర్చుకోవడానికి జిల్లా ప్రజలు ఎదురు చూస్తున్నారు. నర్సీపట్నం నియోజక వర్గం నుంచే కాకుండా జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చి షర్మిలకు స్వాగతం పలికి, ఆమె అడుగులో అడుగువేయడానికి సిద్ధమయ్యారు. సోమవారం నాటి యాత్ర శరభవరం గ్రామం వరకు సాగుతుంది.

Back to Top