సమైక్యానికి సర్వశక్తులూ ఒడ్డి పోరాడండి

హైదరాబాద్, 16 డిసెంబర్ 2013:

రాష్ట్రాన్ని విభజించాలని జరుగుతున్న ప్రయత్నాల నేపథ్యంలో ప్రస్తుత శాసనసభ, శాసన మండలి సమావేశాలు ఎంతో కీలకమైనవని, ఈ భేటీల్లో కాంగ్రెస్ వ్యవహరిస్తున్న ఏకపక్ష ధోరణిని ఖండిస్తూ సమష్టి వ్యూహంతో ముందుకు వెళ్లాలని వై‌యస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధ్యక్షుడు‌ శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి పార్టీ ప్రజాప్రతినిధులకు మార్గ నిర్దేశనం చేశారు. శాసనసభలో సమైక్య తీర్మానం కోసం అందరూ పట్టుబట్టాలని శ్రీ జగన్మోహ‌న్‌రెడ్డి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సూచించారు. అసెంబ్లీ సమావేశాలకు విధిగా హాజరు కావాలని, సమావేశాలు ముగిసే వరకూ సభను విడిచిపెట్టవద్దని ఆదేశించారు. విభజన బిల్లు రాష్ట్ర శాసనసభకు చేరిన నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు శ్రీ వైయస్ జగ‌న్ తన క్యాంపు కార్యాలయంలో సోమవారం ఉదయం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం నిర్వహించారు.

‘ఇది చాలా కీలక సమయం.. ప్రతి ఒక్కరూ తప్పకుండా అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతూ రాష్ట్ర సమైక్యత కోసం చివరి వరకూ సర్వశక్తులూ ఒడ్డి పోరాడాలి. ఇప్పుడు మీరు నిర్వహించే పాత్ర చరిత్రలో నిలిచి పోతుంది. ఏకపక్షంగా కాంగ్రె‌స్ పార్టీ తీసుకున్న విభజన నిర్ణయాన్ని మనం గట్టిగా ప్రతిఘటించాలి’ అని ‌ఆయన సూచించారు. విభజనపై ఒక నియమం, పద్ధతి లేకుండా కాంగ్రెస్‌ పార్టీ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందన్నారు.

ప్రస్తుతం దేశమంతా ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరుగుతోందో అని ఆసక్తిగా చూస్తోందని, అందువల్ల పార్టీ నిర్వహించే పాత్రకు మరింత ప్రాధాన్యత పెరిగిందని శ్రీ జగన్‌ పార్టీ ప్రజా ప్రతినిధులకు వివరించారు. సమైక్యంపై అసెంబ్లీలో కలిసి వచ్చే వివిధ పక్షాలతో జాగ్రత్తగా సమన్వయం చేసుకోవాలని నేతలకు సూచించారు. ప్రజలు నిత్యం ఎదుర్కొంటున్న సమస్యలపై కూడా అసెంబ్లీలో ఎండగట్టడంలో ఎమ్మెల్యేలు ముందుండాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు. సీమాంధ్ర కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలను కూడా సమైక్య తీర్మానం కోసం మద్దతు కోరాలని ఆయన పార్టీ శాసనసభ్యులు, ఎమ్మెల్సీలకు శ్రీ జగన్ సూచించారు. సమైక్యాంధ్రకు వివిధ పార్టీల మద్దతు కూడగట్టేందుకు, పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనేందుకు‌ శ్రీ జగన్మోహన్‌రెడ్డి సోమవారం రాత్రి ఢిల్లీ బయల్దేరి వెళ్లారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ కోసం ప్రాణాలు త్యాగం చేసిన పొట్టి శ్రీరాములు చిత్రపటానికి ఈ సందర్భంగా‌ శ్రీ జగన్ పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అసెంబ్లీలో సమైక్య తీర్మానం చేయాలంటూ వై‌యస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ‌సోమవారం ఉదయం శాసనసభలో వాయిదా తీర్మానం ఇచ్చింది. అయితే, ఈ తీర్మానాన్ని స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ తిరస్కరించారు.

Back to Top