సీబీఐ తీరు అవమానకరం

హైదరాబాద్, 28 నవంబర్ 2012:

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కేసులో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకంటే హీనంగా సీబీఐ వ్యవహరిస్తోందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధ్వజమెత్తింది.  రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేక జగన్మోహన్ రెడ్డిని జైలులో ఉంచాలని కాంగ్రెస్, టీడీపీ నేతలు చూస్తున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులు జనక్ ప్రసాద్, గట్టు రామచంద్ర రావులు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆరోపించారు. రాష్ర్టంలో జగన్మోహన్ రెడ్డికి వస్తున్న ప్రజాదరణను చూసి కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ పార్టీ నేతల కాళ్లు వణుకుతున్నాయని వారు విమర్శించారు.

దేశంలోగానీ,  ప్రపంచంలోగానీ చట్టవిరుద్ధంగా జైలులో పెట్టిన నేతలు ప్రపంచ వ్యాప్తంగా గొప్పవాళ్లు అయ్యారనే విషయాన్ని ప్రజాస్వామ్య వాదులు గుర్తు చేసుకోవాలని జనక్ ప్రసాద్ సూచించారు.  అలాగే ఏ నేరం, తప్పు చేయని వైయస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఒక హీరో లాగా బయటకు వచ్చి, ప్రజాస్వామ్య విలువలను కాపాడే విధంగా రాష్ర్టాన్ని ప్రగతి పథంలోకి తీసుకు వెళుతారని అన్నారు.

ప్రైవేట్ ఏజెన్సీలా పని చేస్తోన్న సీబీఐ

సీబీఐ అంటే కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఒక్కటే కాకుండా ఒక ప్రైవేట్ ఏజెన్సీ మాదిరిగా పని చేస్తోందని గట్టు రామచంద్రరావు ధ్వజమెత్తారు.
ఆరు మాసాలుగా జైలులో ఉంటున్న వైయస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చినప్పుడల్లా సీబీఐ అడ్డుకుంటోందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్న ఒక ఏజెన్సీలాగా సీబీఐ వ్యవహరిస్తోందన్నారు.

వైయస్ జగన్మోహన్ రెడ్డి విషయంలో సీబీఐ అనుసరిస్తోన్న తీరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కంటే హీనంగా ఉందని గట్టు ఆక్షేపించారు. 90 రోజుల్లో బెయిల్ ఇవ్వాలని రాజ్యాంగం చెపుతుంటే సీబీఐ అందుకు భిన్నంగా వ్యవహరిస్తోందన్నారు. కోర్టులను కూడా సీబీఐ తప్పుదోవ పట్టిస్తోందన్నారు.
సీబీఐ తీరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కంటే హీనంగా మాట్లాడుతున్నట్టు కనిపిస్తోంది. వైయస్ జగన్మోహన్ రెడ్డి జైలులో ఉన్నా పార్టీ దేదీప్యమానంగా ముందుకు సాగుతుందని, గత ఎన్నికల్లో ప్రజలు చూపిన ఆదరణే అందుకు నిదర్శనమని గట్టు ధీమా వ్యక్తం చేశారు.

Back to Top