ఎస్సీ నిధుల్ని వెనక్కి రప్పించండి

న్యూఢిల్లీ, 30 ఆగస్టు 2012 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల పరిధిలో ఎస్సీ, ఎస్టీలకు న్యాయబద్ధంగా ఖర్చు చేయాల్పిన వేలాది కోట్ల నిధులు దారిమళ్లాయని, వీటిని తిరిగి రాబట్టి ఈ వర్గాల ప్రజల సంక్షేమానికి ఖర్చు చేసేలా చూడాలని జాతీయ ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ పీఎల్‌ పునియాకు వైయస్సార్‌ కాంగ్రెస్‌ కేంద్ర పాలక మండలి సభ్యుడు, మాజీ మంత్రి మారెప్ప విజ్ఞప్తి చేశారు. గురువారంనాడు ఇక్కడ పునియాతో సమావేశమైన మారెప్ప, దీనితోపాటు మరెన్నోఅంశాలపై వినతి పత్రం సమర్పించారు.

కేంద్ర, రాష్ట్రాల పరిధిలో 1980 నుంచి 2012 వరకు ఎస్సీ నిధులు రూ.20 వేల కోట్లు, ఎస్టీ నిధులు రూ.5వేల కోట్లు దారిమళ్లాయని మారెప్ప ఆ వినతిపత్రంలో వివరించారు. ఎస్సీ వర్గీకరణకు పార్లమెంటులో చట్టం చేయాలని కోరారు. ఈ అంశం కేవలం మాల, మాదిగలకే పరిమితమైనది కాదని, 58 ఉపకులాలకు సంబంధించినదని వివరించారు. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికను జాతీయ అంశంగా పరిగణించి పార్లమెంటు చట్టం చేయాలని, అప్పుడు ఈ వర్గాలవారి ఆర్థిక సామాజిక స్థితి గతుల్లో మార్పు సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

ఎస్సీ, ఎస్టీ ధ్రువీకరణ పత్రాలను దుర్వినియోగం చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే నకిలీ సర్టిఫికెట్లతో ఐఏఎస్‌, ఐపీఎస్‌ సర్వీసుల్లో చేరిన అధికారులపై విచారణ జరిపించాలని కోరారు.

తాజా వీడియోలు

Back to Top