సవాలు స్వీకరించడం మాని అవాకులూ, చవాకులా

హైదరాబాద్:

టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ దొరతనాన్నీ, దురహంకారాన్నీ సహించబోమని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు నల్లా సూర్యప్రకాశ్, రవీంద్రనాయక్ హెచ్చరించారు. సూర్యాపేట సభలో మహానేత డాక్టర్ వైయస్ఆర్‌ కుటుంబంపై చేసిన ఆరోపణలు కేసీఆర్ బాధ్యతా రాహిత్యానికి అద్దం పడుతున్నాయని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వారు గురువారం విలేకరుల సమావేశంలో ప్రసంగించారు.     
    గనులను కుమార్తెకూ, కుమారునికీ వైయస్ఆర్ కట్టబెట్టారని చేసిన ఆరోపణలని రుజువుచేయాలనీ,  చేయకుంటే చిన్నవాళ్ళమైనా తమకు క్షమాపణ చెప్పే సంస్కారం మీకుందా అన్న శ్రీమతి షర్మిల సవాలును స్వీకరించాల్సింది పోయి రకరకాలుగా మాట్లాడుతున్నారని సూర్యప్రకాశ్ విమర్శించారు.  ఈ సందర్భంలో వ్యక్తిగత దూషణలకు దిగడాన్ని ఖండించారు. కేసీఆర్ ఉద్యమాన్ని అడ్డుపెట్టుకుని, బ్లాక్ మెయిల్ తరహాలో వైయస్ఆర్ కుటుంబంపైనా, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై నిందలు వేయడం కేసీఆర్ హోదాకు తగదన్నారు. గిట్టని పత్రికల్లో వచ్చిన కథనాలను ఆధారంగా చేసుకుని, గోబెల్సు మాదిరిగా ప్రచారం చేస్తున్నారన్నారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో మీ గుత్తాధిపత్యం సాగించడం కోసం ప్రయత్నిస్తున్నారన్నారు. కుమారుడు, కుమార్తె, మేనల్లుడిని ఒక్కో రంగంలో వసూళ్ళకు వినియోగిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ వల్ల కాక కేసీఆర్ ద్వారా అధిష్ఠానం  మాట్లాడిస్తోందని ఆరోపించారు.

కాంగ్రెస్ అధిష్ఠానం చేతిలో కేసీఆర్ తోలుబొమ్మ
    కాంగ్రెస్ అధిష్ఠానం కేసీఆర్‌ను తోలుబొమ్మలా ఉపయోగించుకుంటోందన్నారు. తెలంగాణ ప్రాంతంలో శ్రీమతి షర్మిల పాదయాత్రకు లభిస్తున్న ఆదరణ చూసి వారికి వెన్నులో వణుకు పుడుతోందన్నారు. వైయస్ఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ కార్యక్రమాలను తుంగలో తొక్కిన కాంగ్రెస్, తొలుత తెలుగు దేశం పార్టీతో వైయస్ఆర్ కాంగ్రెస్‌పై  ఆరోపణలు చేయించారనీ, ఇప్పుడు టీఆర్ఎస్‌తో మహానేత డాక్టర్ వైయస్ఆర్ కుటుంబ సభ్యులపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారనీ సూర్యప్రకాశ్ మండిపడ్డారు.
    
మూడు పార్టీలూ ఏకమైనా ఏం చేయలేరు

    కాంగ్రెస్, తెలుగు దేశం, టీఆర్ఎస్ ఈ మూడు పార్టీలు ఏకమైనా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏమీ చేయలేవని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రాంతంలో శ్రీమతి షర్మిల బహిరంగ సభలకు వేలాదిమంది హాజరై ఆదరిస్తున్నారని చెప్పారు. జగన్ సీఎం అయితే తప్ప రాజన్న రాజ్యం రాదని దళితులు నిర్ణయించుకున్నారన్నారు. మహానేత తన పాలనలో దళితుల సంక్షేమానికి పెద్దపీట వేశారని తెలిపారు. ఇది మళ్ళీ జగన్ వల్లే సాధ్యమని నిశ్చయానికి వచ్చే  తెలంగాణ ప్రాంతంలో షర్మిలకు మద్దతు పలుకుతున్నారు.  తెలంగాణవాదానికి అనుకూలమా కాదా అనేది చెప్పాలని కాంగ్రెస్ పార్టీని ఆయన డిమాండ్ చేశారు.  తెలంగాణ  సెంటిమెంటును మేము గౌరవిస్తున్నామని శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారన్నారు.
    
సంక్షేమ కార్యక్రమాలు ఇప్పుడు గుర్తొచ్చాయా!
    సూర్యాపేట సభలో కేసీఆర్ కాంగ్రెస్ పార్టీకి గానీ, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డికి కాని వ్యతిరేకంగా ఒక్కమాట మాట్లాడలేదన్నారు. కానీ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై మాత్రం ఆరోపణలు చేస్తున్నారన్నారు.  బాధ్యతారహితంగా మాట్లాడితే సహించేది లేదని సూర్యప్రకాశ్ హెచ్చరించారు. షర్మిల పాదయాత్ర మొదలయిన తర్వాత సంక్షేమ కార్యక్రమాల గురించి మాట్లాడుతున్నారు. ఇంతకు ముందు తెలంగాణ వస్తే సమస్యలన్నీ పరిష్కారమవుతాయని చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు పింఛన్ల గురించి ప్రస్తావిస్తున్నారని వివరించారు.

బురదజల్లడం కేసీఆర్ అలవాటు
    పన్నెండేళ్ళుగా ఉద్యమం పేరుతో అందరిపై బురద జల్లడాన్ని కేసీఆర్ అలవాటు చేసుకున్నారని మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ విమర్శించారు. పుట్టలో ఉన్న పాముని బుట్టలో వేసినట్లుగా తెలంగాణ వాదాన్ని ఆయన తన సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలో అనైతిక పొత్తులు పెట్టుకున్నారనీ,  అనేకమందిని పొట్టన పెట్టుకున్నారనీ తెలిపారు. షర్మిల సవాలును స్వీకరించకుండా అవాకులు, చవాకులు పేలుతున్నారని విమర్శిచారు. '2001లో మీకున్న ఆస్తులేమిటి. ఇప్పుడున్న ఆస్తులేమిటి.? ప్రమాణం చేసి చెబుతారా' అని ఆయన ప్రశ్నించారు. ఇంతవరకూ తెలంగాణ ప్రజలతో ఆటలాడుకున్న కేసీఆర్ ఇక్కడ షర్మిలకు లభిస్తున్న బ్రహ్మరధాన్ని చూసి  బెంబేలెత్తి ఇష్టారీతిన మాట్లాడుతున్నారని అభిప్రాయపడ్డారు. మంత్రిగా ఉన్నప్పుడు 610 జీవో సందర్భంలో ఆంధ్ర అంతా ఒక్కటేనని చాటిన కేసీఆర్‌కు జగన్మోహన్ రెడ్డిని విమర్శించే అధికారం లేదన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ మాట్లాడలేదని స్పష్టంచేశారు.

టీఆర్ఎస్‌లో చేరేవారిని ఏమని పిలవాలి    
    తమ పార్టీలో చేరేవారిని ఉద్దేశించి దేశపతి శ్రీనివాస్ వాడిన పదంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్‌లో చేరేవారిని ఏమనాలని ప్రశ్నించారు.  తామూ వంద అనగలమనీ, నోటిని అదుపుచేసుకోవాలనీ  ఆయన హెచ్చరించారు. మా నాయకత్వం తమకు ఇలాంటి పరిస్థితి కల్పించదని పేర్కొన్నారు. గనులు కేటాయించారని రుజువు చేయలేకపోతే చిన్నవారిమైనా తమకు క్షమాపణ చెబుతారా అని షర్మిల అన్నారు తప్ప క్షమాపణ చెప్పమని అడగలేదు కదాని రవీంద్రనాయక్ ప్రశ్నించారు.

Back to Top