జగన్‌ కోసం శాస్త్రయుక్తంగా శత చండీయాగం

హైదరాబాద్:

ప్రజల‌ంతా సుఖసంతోషాలతో ఉండాలని, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డిపై సాగుతున్న కుట్రలు, కుతంత్రాలను పారదోలాలన్న సంకల్పంతో నిర్వహిస్తున్న శత చండీ యాగం శనివారం రెండవ రోజు శాస్త్రయుక్తంగా కొనసాగింది. హైదరాబాద్ కూక‌ట్‌పల్లిలోని మెట్రో మార్వెల్ గార్డె‌న్‌లో ఈ క్రతువు జరుగుతున్న ప్రాంతం వేద పండితుల మంత్రోచ్ఛారణతో ప్రతిధ్వనించింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు గోపూజ, కలశ అర్చన, మన్యసూక్త పారాయణం, సుందరకాండ హోమం, మహారుద్ర యాగం, ఆదిత్యాది నవగ్రహ హోమం, అష్టావధాన సేవ, బలిహరణ, మహా మంగళ హారతి, తీర్థప్రసాద వితరణ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. వెయ్యిమందికి అన్నసంతర్పణ చేశారు.

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎం.పి మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కూన శ్రీశైలంగౌడ్, శ్రీకాంత్‌రెడ్డి, అమర్‌నాథ్‌రెడ్డి, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రీకాళహస్తి సమన్వయకర్త బియ్యపు మధుసూదన్‌రెడ్డి, పార్టీ ఐటి విభాగం కన్వీనర్ చల్లా మధుసూద‌న్‌రెడ్డి, ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి, కూకట్‌పల్లి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సమన్వయకర్త వడ్డేపల్లి నర్సింగరావు ఈ యాగంలో శ్రీ జగన్మోహన్‌రెడ్డి పేరుతో సంకల్పం చెప్పారు.

ఈ శత చండీ యాగంలో నిర్వహిస్తున్న పూజలు, హోమాలతో శత్రు పరాజయం జరిగి, అనుకున్న కార్యక్రమాలు నిర్విఘ్నంగా నెరవేరుతాయని వేదబ్రహ్మ కె.ఎల్‌. సత్యనారాయణశర్మ తెలిపారు. మహాచండీ పారాయణం, మహా పారాయణ హోమాలతో దుష్టశక్తుల పీడలు, గ్రహబాధలు తొలగుతాయని అన్నారు. మహారుద్ర హోమంతో మనశ్శాంతి, నవగ్రహ హోమంతో జాతక, గ్రహచార దోషాలు పోయి, అనుగ్రహ ఫలం లభిస్తుందని ఆయన వివరించారు. మహా మంగళ హారతితో అన్ని శుభాలూ కలుగుతాయన్నారు.

జననేత శ్రీ వైయస్ జగ‌న్‌పై పన్నుతున్న కుతంత్రాలు తొలగిపోవడానికి వైయస్‌ఆర్ ఫౌండేష‌న్, వడ్డేపల్లి నర్సింగరావు సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు‌ సత్యనారాయణశర్మ తెలిపారు. వైయస్‌ఆర్ ఫౌండేష‌న్ సభ్యులు డి.వెంకటకృష్ణారెడ్డి, భక్తవత్సలరెడ్డి, మరంరెడ్డి, భాస్క‌ర్‌రెడ్డి, రాకేశ్‌రెడ్డి, వడ్డేపల్లి రాజేశ్వరరావు కార్యక్రమం ఏర్పాట్లను పర్యవేక్షించారు.

Back to Top