సంక్షేమ పథకాల అమలు జగన్‌కే సాధ్యం

జగ్గయ్యపేట:

దివంగత ముఖ్యమంత్రి వై.యస్. రాజశేఖరరెడ్డి పాలనలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయగల సత్తా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ వల్లే సాధ్యమవుతుందని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను పేర్కొన్నారు. కృష్ణా జిల్లా వత్సవాయి మండలం, రామచంద్రాపురం గ్రామానికి చెందిన ఎనిమిది కుటుంబాల నుంచి 40మంది తెలుగుదేశం పార్టీని వీడి వైయస్ఆర్ సీపీలో చేరారు. పార్టీ నాయకులు పాపినేని నవీన్, పార్టీ మండల కన్వీనర్ వడ్డే పరమయ్య, మండల యూత్ కన్వీనర్ తేలుకుంట్ల గురవయ్య ఆధ్వర్యంలో చేరిన వీరందరికీ ఉదయభాను పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహానేత వైఎస్సార్ ఆశయాలను సాధించే పార్టీ వైయస్ఆర్ సీపీనేనని భావించిన ప్రజలు జగన్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. అందుకే పార్టీలోకి వలసలు వెల్లువెత్తుతున్నాయని పేర్కొన్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు కుమ్మక్కయి పార్టీ అధినేత వై.యస్. జగన్‌ను జైలులో పెట్టించినా, ఆయన సోదరి షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీలో పడినప్పటికీ పాదయాత్రలో కాంగ్రెస్‌ పార్టీపై దుమ్మెత్తిపోస్తున్న చంద్రబాబు అవిశ్వాసం ఊసెత్తకపోవడం ఆశ్చర్యంగా ఉందని విమర్శించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ప్రజలు సమయం కోసం చూస్తున్నారని, వారికి తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. పార్టీలో చేరిన వారిలో గ్రామ మాజీ సర్పంచ్ మర్రికంటి రుక్మిణమ్మ, కోలేటి మంగయ్య, రాధాకృష్ణ, అందాసు లక్ష్మయ్య, సురేష్, వెంకటేష్, మర్రికంటి రాంబాబు, మాడుగుల నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక పార్టీనేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Back to Top