సందేహాస్పదంగా కాంగ్రెస్ సదస్సు

హైదరాబాద్ : ఈనెల 23న నిర్వహించ తలపెట్టిన రాష్ట్ర కాంగ్రెస్‌ సదస్సుపై అసమ్మతి మేఘాలు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలో సదస్సు నిర్వహణ సందేహాస్పదంగా మారింది. తెలంగాణ, సీమాంధ్ర నేతలకు విడివిడిగా సదస్సు నిర్వహించాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో వాగ్వాదానికి దిగారు. ఇరు ప్రాంతాలకు ప్రత్యేకంగా పీసీసీ భేటీ నిర్వహించడం సాధ్యం కాదని బొత్స పేర్కొన్నారు. తెలంగాణ సీమాంధ్ర ప్రాంతాలకు ప్రత్యేక పీసీసీలు లేనందున హై కమాండ్‌ దీనికి ఒప్పుకోదని ఆయన పేర్కొన్నారు. అవసరమైనతే రెండు రోజులపాటు సదస్సు నిర్వహిస్తామని ఆతర్వాత ప్రాంతాల వారిగా సదస్సు నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తామని బొత్స అన్నారు. ఇలా ఇరు ప్రాంతాలకు కలిపి భేటీ నిర్వహించడం వల్ల తెలంగాణలో పార్టీకి లాభం ఉండదని ఎంపీ వివేక్‌ హెచ్చరించారు. ఇదే అంశంపై ఆజాద్‌కు లేఖ రాస్తామని, తెలంగాణ అంశాన్ని లోతుగా చర్చించేందుకు ఒకరోజు ఈ ప్రాంత కాంగ్రెస్‌ నేతలతో సదస్సు పెట్టాల్సిందేనని వివేక్‌ డిమాండ్‌ చేశారు. మరోవైపు సీమాంధ్రలో జగన్ ప్రభంజనం, తెలంగాణలో ప్రత్యేక రాష్ట్ర అంశం కాంగ్రెస్‌కు సమస్యగా మారాయని ఎంపీ పొన్నం ప్రభాకర్‌ అన్నారు. వైఎస్‌ జగన్‌ అంశాన్ని పార్టీలో చర్చిస్తున్నప్పుడు తెలంగాణ అంశాన్నికూడా విడిగా చర్చిస్తే తప్పేంటని పొన్నం ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పాటుపై రూటు మ్యాపు ప్రకటిస్తే, పార్టీ బలోపేతానికి కృషిచేస్తామని పొన్నం తెలిపారు.

Back to Top