సేవాతపన జగన్‌లో కనిపించింది

హైదరాబాద్:

తెలుగు దేశం పార్టీ అంతర్గత విభేదాలతో కొట్టుమిట్టాడుతోందని టీడీపీ ఇచ్చాపురం ఎమ్మెల్యే సాయిరాజు చెప్పారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఆయన శుక్రవారం మధ్యాహ్నం చంచల్‌గుడా జైలులో కలిసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీలో రాజకీయాలు ఎక్కువని తెలిపారు. పార్టీ నేతలకు ప్రజా సేవ చేయాలన్న యోచన లేదని పేర్కొన్నారు. వైయస్ఆర్ పథకాలను అమలుచేయగల సత్తా ఒక్క శ్రీ జగన్మోహన్ రెడ్డికే ఉందని ఆయన తెలిపారు. వైయస్ పథకాలు ప్రజలకు చేరువయ్యాయన్నారు. ఆ పథకాలకు ప్రజలు ఆకర్షితులయ్యారన్నారు
తన రాజకీయ గురువు ఎర్రన్నాయుడు మరణానంతరం తనకు పార్టీలో కష్టాలు పెరిగాయని సాయిరాజ్ చెప్పారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన నాలుగేళ్ళుగా తెలుగుదేశం పార్టీలో ఎన్నో సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నానన్నారు. సమస్యలు పార్టీ అధినేత కూడా పరిష్కరించలేని స్థాయికి చేరాయి. ఇంతవరకూ తమకు రాజకీయాలు చేయమని చెప్పిన వారే తప్ప ప్రజలకు సేవ చేయమని చెప్పిన వారు లేరన్నారు. రాజకీయాలనుంచి వైదొలగుదామనుకుంటున్న తరుణంలో డాక్టర్ వైయస్ఆర్ ప్రవేశ పెట్టిన పథకాలకు ఆకర్షితులవుతున్న వైనాన్ని గమనించానన్నారు. సేవ చేయాలనే తపన శ్రీ జగన్మోహన్ రెడ్డిలో తనకు కనిపించిందన్నారు.  కాంగ్రెస్ పార్టీ మీద, వైయస్ పథకాలమీద నేను కూడా విమర్శలు చేసిన వాడినే కానీ శ్రీ జగన్మోహన్ రెడ్డిలోని  పేదలకు సేవ చేయాలన్న లక్షణం కారణంగా ఆ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నాననీ, అందుకే వచ్చి ఆయనను కలిశాననీ సాయిరాజ్ వివరించారు. పదవి ఇచ్చినా.. ఇవ్వకపోయినా ప్రజా సేవకే అంకితమై.. జగన్మోహన్ రెడ్డిగారి వెంట నడవాలని నిశ్చయించుకున్నానని చెప్పారు. ప్యాకేజీలకు అమ్ముడుపోయానని వచ్చిన ఆరోపణలను చేసిన వారి విజ్ఞతకే విడిచిపెడుతున్నానని సమాధానం చెప్పారు. యువతను పూర్తిస్థాయిలో సేవ చేయమని సూచించాలే తప్ప రాజకీయాలు చేయాలని కోరకూడదని రాజకీయపార్టీలకు ఆయన విజ్ఞప్తిచేశారు. తన జిల్లాలోని తన నియోజకవర్గంలో ప్రజల సమస్యలను జగన్ గారితో చర్చించా. థర్మల్ ప్లాంట్, తదితర అంశాలను ఆయన వద్ద ప్రస్తావించానని సాయిరాజ్ తెలిపారు.
 పాతపట్నం టీడీపీ ఇన్ఛార్జి కె. వెంకట రమణ, మాజీ ఎమ్మెల్యే కె. మోహన్ రావు కూడా ఆయన వెంట ఉన్నారు. చంద్రబాబువి మోసపూరిత వాగ్దానాలనీ, వాటిని ప్రజలు నమ్మరనీ వారు పేర్కొన్నారు. వీరు ముగ్గుర్నీ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ మీడియాకు ఎస్ఎమ్ఎస్ పంపింది.

Back to Top