న్యాయంకోసం కోర్టుకు వస్తే అక్కడ కూడ రౌడీయిజం

విజయవాడ: న్యాయం కోసం కోర్టుకు వస్తే టీడీపీ కార్యకర్తలతో రౌడీయిజం చేయిస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే రోజా అన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఎక్కడికి తిరగాలన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నుంచి వీసా తీసుకోవాలా అని ఆమె శుక్రవారమిక్కడ ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా తన హక్కులకు పోలీసులు భంగం కలిగించారని డీజీపీ, తదితర పోలీసు అధికారులపై దాఖలు చేసిన ప్రైవేటు కేసు విచారణ నిమిత్తం ఎమ్మెల్యే రోజా ఇవాళ కృష్ణాజిల్లా గన్నవరం కోర్టుకు హాజరయ్యారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచకపాలన కొనసాగుతోందని మండిపడ్డారు.

త‍్వరలోనే చంద్రబాబుకు ప్రజలు గుణపాఠం చెబుతారని అన్నారు. నందిగామ ఆస్పత్రిలో బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌పై కూడా టీడీపీ కార్యకర్తలు కూడా ఇలాగే దౌర్జన్యం చేశారన్నారు. తాను డీజీపీపై కోర్టులో కేసు వేస్తే టీడీపీ కార్యకర్తలు ఆందోళన చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని రోజా సూటిగా ప్రశ్నించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు చంద్రబాబు పూర్తిగా తుంగలోకి తొక్కారన్నారు. ప్రజల అభిమానం పొందాలంటే వారికి ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలని అన్నారు. కాగా ఎమ్మెల్యే రోజా కోర్టుకు హాజరవుతున్న సమాచారం తెలుసుకున్న తెలుగుదేశం కార్యకర్తలు ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పార్టీ జెండాలతో  కోర్టు సమీపంలోకి ర్యాలీగా వచ్చారు. రోజాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే పోలీసులు జోక్యం చేసుకుని వారిని అక్కడ నుంచి పంపించివేశారు. కేసు విచారణ ఈ నెల 24వ తేదీకి వాయిదా పడింది.
Back to Top