రాష్ట్రంలో రౌడీ రాజ‌కీయం

  •  వైయ‌స్ జ‌గ‌న్‌ను నియంత్రించేందుకు స‌ర్కార్ కుట్ర‌
  • నందిగామాలో ప్ర‌తిప‌క్ష నేతపై డాక్ట‌ర్‌, క‌లెక్ట‌ర్ దురుసుగా ప్ర‌వ‌ర్తించారు
  • ఒక సీఎస్ ఉండ‌గా మ‌రో సీఎస్‌ను ఎందుకు నియ‌మించారో ఐఏఎస్‌ల‌కు తెలియ‌దా
  • కేబినెట్ మీటింగ్‌లో చూడాల్సిన వీడియో ఇంకా చాలా ఉన్నాయి
  • దివాక‌ర్ ట్రావెల్స్‌పై ఎందుకు చ‌ర్య‌లు తీసుకోలేదు
  • కేబినెట్ మీటింగ్‌లో బ‌స్సు ప్ర‌మాద మృతుల‌కు నివాళుల‌ర్పించారా?
  • అటెండ‌ర్ నుంచి క‌లెక్ట‌ర్ దాకా వైయ‌స్ఆర్ ప్రేమ‌గా చూశారు
  • వైయస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా
విజ‌య‌వాడ‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో రౌడీ రాజకీయం చేస్తున్నది చంద్రబాబు, ఆయన ప్రభుత్వమన్నది అందరికీ తెలుసని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ మ‌హిళా విభాగం అధ్య‌క్షురాలు, ఎమ్మెల్యే ఆర్కే రోజా తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు. ప్ర‌జా స‌మ‌స్య‌లపై పోరాడుతున్న ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని నియంత్రించేందుకు టీడీపీ ప్ర‌భుత్వం కుట్ర‌లు చేస్తోంద‌ని ఆమె అనుమానం వ్య‌క్తం చేశారు. శుక్ర‌వారం విజ‌య‌వాడ‌లోని పార్టీ కార్యాల‌యంలో రోజా మీడియాతో మాట్లాడారు. ఏపీ కేబినెట్ సమావేశంలో నందిగామ ఘటనకు సంబంధించిన వీడియోలను చూశామని చెబుతున్న చంద్రబాబు మంత్రివర్గం.. నిజానికి చూడాల్సిన వీడియో అది కాదని, ఇంకా చాలానే ఉన్నాయన్నారు. అది కేబినెట్ సమావేశమా.. సినిమా థియటేరా అని ఎద్దేవా చేశారు. దేశంలో ఏ సీఎం చేయని దౌర్భాగ్యమైన పని చంద్ర‌బాబు చేశార‌ని ఫైర్ అయ్యారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో అడ్డ‌దారిలో గెలుపొందాల‌ని భావించి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని పంపి ఎమ్మెల్సీ సీటు కొనుగోలుకు రూ.5 కోట్లు లంచం  ఇస్తూ పట్టుబడిన వీడియోలు కేబినెట్ మంత్రులు చూడాల‌ని రోజా సూచించారు. మావాళ్లు దే బ్రీఫ్‌డ్ మీ అని చంద్ర‌బాబు అడ్డమైన ఇంగ్లీష్ మాట్లాడిన వీడియో చూడాలని హిత‌వు ప‌లికారు. గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాటలో 29 మంది మరణిస్తే, ఆ రషెస్ ఇంతవరకు కనిపించవని, ఆ వీడియోలు ఏమయ్యాయో కేబినెట్‌కు తెలియదని అన్నారు. చింతమనేని ప్రభాకర్ అడ్డదిడ్డంగా దోచుకుంటుంటే అడ్డుపడినందుకు వనజాక్షి అనే అధికారిణిని ఎలా కొట్టారో ఆ వీడియో చూడాలని.. ఆమె కళ్లనీళ్లు పెట్టుకున్న వీడియో చూడాలని తెలిపారు. జానీమూన్ అనే మహిళ తన కుటుంబానికి రావెల కిశోర్ బాబు వల్ల ప్రాణభయం ఉందని భోరుమన్నారని, ఆ వీడియో చూడాలని సూచించారు.  కాల్‌మనీ సెక్స్‌రాకెట్‌లో 200 సీడీలు దొరికితే ఆ నిందితులను ఎందుకు అరెస్టుచేయలేదో ఎవరూ అడగరని ఆమె నిల‌దీశారు.

దివాక‌ర్ ట్రావెల్స్‌పై ఎందుకు కేసు న‌మోదు చేయ‌లేదు
కృష్ణా జిల్లాలో ఇటీవ‌ల జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదానికి సంబంధించి టీడీపీ ఎంపీ జేసీ దివాక‌ర్‌రెడ్డి ట్రావెల్స్‌పై ఎందుకు కేసు న‌మోదు చేయ‌లేద‌ని ఎమ్మెల్యే రోజా ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించారు. బ‌స్సు ప్ర‌మాదంలో 11 మంది మృత్యువాత ప‌డితే వారిని ఎలా ఆదుకోవాలో కేబినెట్ మీటింగ్‌లో చ‌ర్చించ‌క‌పోవ‌డం సిగ్గు చేట‌న్నారు. బస్సు ప్రమాద బాధిత‌ కుటుంబాలకు నష్టపరిహారం ఇప్పించాలని ఎందుకు తీర్మానం చేయించలేదని రోజా ప్రశ్నించారు. దివాకర్ ట్రావెల్స్ మీద చర్యల గురించి ఎందుకు చర్చించలేదని అడిగారు. లోకేష్ కొడుకును ఎంపీ జేసీ దివాక‌ర్‌రెడ్డి ఎత్తుకుని ముద్దాడినంత మాత్రాన ఆయ‌న్ను కాపాడాల్సిన అవసరం లేదని ఎద్దేవా చేశారు. ప్రభుత్వానికి నష్టం వస్తుందని తెలిసి కూడా కేశినేని, దివాకర్ ట్రావెల్స్‌ను కాపాడుతున్నారా? ఇది జరిగిన మర్నాడే స్కూలు పిల్లల బస్సు లోయలో పడిందంటే ప్రభుత్వం ఎలా పనిచేస్తోందని ప్రశ్నించారు. దివాకర్ ట్రావెల్స్‌ను కాపాడితే మాత్రం ప్రజలు హర్షించబోరని అన్నారు. డ్రైవర్ మృతదేహానికి పోస్టుమార్టం చేయకుండా ఎలా మృతదేహాన్ని పంపారు, రెండోడ్రైవర్‌ను ఎక్కడ దాచిపెట్టారని ఆమె నిలదీశారు. దివాకర్ ట్రావెల్స్ నుంచి మృతుల కుటుంబాలకు  రూ.20 లక్షల చొప్పున నష్టపరిహారం ఇప్పించాలని రోజా డిమాండ్ చేశారు. మల్లాది విష్ణుకు చెందిన బార్‌లో కల్తీ మద్యం ఉందని యజమాని మీద కేసు పెట్టారు కదా.. మరిప్పుడు దివాకర్ ట్రావెల్స్ యజమాని మీద ఎందుకు కేసులు పెట్టరని ఆమె ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

నిబంధ‌ల‌కు విరుద్ధంగా వ్య‌వ‌హ‌రిస్తే ప్ర‌శ్నించ‌కూడ‌దా?
బ‌స్సు ప్ర‌మాదంలో మృతి చెందిన డ్రైవ‌ర్ మృత‌దేహానికి ఎందుకు పోస్టుమార్ట‌మ్ చేయ‌లేద‌ని ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి డాక్ట‌ర్‌, క‌లెక్ట‌ర్‌ను ప్ర‌శ్నించార‌ని రోజా చెప్పారు.  నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా వ్యవహరిస్తే, దురుసుగా ప్రవర్తిస్తే ఎవరికైనా కోపం రాదా అని అడిగారు. అభాగ్యుల‌కు అండ‌గా నిలిచేందుకు వెళ్లిన ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై నందిగామా ఆసుప‌త్రి వ‌ద్ద డాక్ట‌ర్‌, జిల్లా క‌లెక్ట‌ర్ దురుసుగా ప్ర‌వర్తించార‌ని రోజా అన్నారు. వైయ‌స్ జగన్ నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారని, ఏనాడూ అధికారులను పన్నెత్తి మాట కూడా అనలేదని చెప్పారు. ప్ర‌మాదం జ‌రిగిన ప్రాంతానికి పక్కనే హెలికాప్టర్లలో తిరుగుతున్న సీఎం గానీ, రవాణా మంత్రి గానీ, దేవినేని ఉమా, కామినేని శ్రీనివాస్ ఎవరూ అక్కడకు ఎందుకు వెళ్లలేదని రోజా ప్ర‌శ్నించారు. ఒకవైపు డాక్టర్ పోస్టుమార్టం చేయలేదని చెబుతుంటే, మరోవైపు కలెక్టర్ మాత్రం చేశామని అన్నారని, గుమ్మడికాయ దొంగ అంటే క‌లెక్ట‌ర్ భుజాలు తడుముకున్నట్లు ఎందుకు ఆరోపణలు చేస్తున్నారని అడిగారు. రిపోర్టు కాపీలు మూడు ఉన్నందున ఒకటి ఇవ్వాలని వైయ‌స్ జగన్ అడుగుతుంటే ఇవ్వకపోవడం ఏంటి.. దాన్ని మార్చాలనే ఉద్దేశం ఉండటం వల్లేనా అని నిలదీశారు.

ఈ విష‌యాలు ఐఏఎస్‌ల‌కు క‌నిపించ‌లేదా?
రాష్ట్రంలోనే అత్యున్నత అధికారి అయిన అజయ్ కల్లంకు జరిగిన అవమానం ఐఏఎస్ ఆఫీస‌ర్ల‌కు కనిపించలేదా అని ఎమ్మెల్యే రోజా ప్రశ్నించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆయన ఉండగానే మరో సీఎస్‌గా దినేష్‌ను ఎందుకు నియమించారని, ఈ విషయాన్ని అధికారులు ఎందుకు అడగలేదని అన్నారు. ఎమ్మెల్యే రామకృష్ణ కలెక్టర్ చేతిలోంచి పేపర్లు లాక్కుని చించేసినప్పుడు, మైక్ విసిరిన‌ప్పుడు ఈ సంఘం ఎందుకు స్పందించలేదు, ఆయన మీద తీర్మానం ఎందుకు చేయలేదని అడిగారు. ఉద్యోగులకు జీతం పెరిగినా, జీవితం మెరుగైనా అది  దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి హయాంలోనేనని గుర్తు చేశారు. లిఫ్ట్ ఆపరేటర్ రిటైర్ అవుతున్నట్లు చెబితే సన్మానించి, బట్టలు పెట్టి, ఇల్లు ఇప్పించిన నాయకుడు వైయ‌స్ఆర్ అని కొనియాడారు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి ఏడేళ్లు అవుతున్నా..వైయ‌స్ జ‌గ‌న్ ఏ నాడు అధికారుల‌ను ఏమి అన‌లేద‌ని, ప్ర‌తి ఒక్క‌రిని గౌర‌వంగా ప‌ల‌క‌రించే సాంప్ర‌దాయం ఆయ‌న‌కు ఉంద‌ని తెలిపారు. అటెండ‌ర్ నుంచి క‌లెక్ట‌ర్ వ‌ర‌కు మ‌హానేత వైయ‌స్ఆర్ ప్రేమగా చూసుకున్నార‌ని తెలిపారు. లోకేష్‌కు అండగా ఉన్నాడని కాల్‌మనీ సెక్స్‌రాకెట్‌లో బుద్దా వెంకన్నను ఎలా కాపాడారో అంతా చూస్తున్నారని, నారాయణ కాలేజిలో ఎంతమంది పిల్లలు చనిపోతున్నారో.. ఆ తల్లిదండ్రులు ఏడుస్తున్నారో చూడాలని సూచించారు. నారాయణ కాలేజి గుర్తింపు రద్దుచేసి, ఆయనను మంత్రివర్గం నుంచి తప్పించాలని రోజా డిమాండ్ చేశారు.  
Back to Top