రహదారుల దిగ్బంధం విజయవంతం: రోజా

హైదరాబాద్, 6 నవంబర్ 2013:

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ‌ బుధ, గురువారాల్లో 48 గంటల పాటు చేపట్టిన రహదారులు దిగ్బంధానికి ప్రజలంతా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి విజయవంతం చేస్తున్నారని పార్టీ అధికార ప్రతినిధి ఆర్‌కే రోజా తెలిపారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్నామని వారంతా స్పష్టం చేస్తున్నారన్నారు. సమైక్యం ముసుగులో చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డి డ్రామాలు ఆడుతున్నారని ఆమె నిప్పులు చెరిగారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో రోజా మాట్లాడారు. చంద్రబాబు, కిరణ్‌ కుమార్‌రెడ్డి, బొత్స పార్టీలకు రాజీనామాలు చేస్తేనే ఢిల్లీ దిగివస్తుందన్నారు. ప్యాకేజీ నాయుడుగా చంద్రబాబు మారారని ఆమె ఎద్దేవా చేశారు.

రాష్ట్ర విభజనపై చంద్రబాబుకు స్పష్టత లేదన్నారు. గాయం చేయమని కత్తి ఇచ్చి... న్యాయం చేయమన్నట్లు చంద్రబాబు తీరు ఉందని రోజా వ్యాఖ్యానించారు. విభజన లేఖ ఇచ్చి ఇప్పుడు నాటకాలేమిటని నిలదీశారు. చంద్రబాబు డ్రామాలు కట్టిపెట్టి సమైక్యం కోసం పాటుపడాలన్నారు. ఎవరి ఆత్మగౌరవం కోసం ఆయన యాత్రలు చేస్తున్నారని ప్రశ్నించారు. సోనియా కోసం ఇటలీ భాష నేర్చుకుని మాట్లాడిన చంద్రబాబు 75 శాతం ప్రజలు కోరుకుంటున్న సమైక్యాంధ్ర అన్న తెలుగు పదం ఎందుకు మాట్లాడటం లేదని రోజా సూటీగా ప్రశ్నించారు.

 తెలుగువారి ఆత్మగౌరవాన్ని చంద్రబాబు ఢిల్లీలో తాకట్టు పెట్టారని రోజా విమర్శించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా చంద్రబాబు లేఖ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. తెలుగు ప్రజల బాధను అర్థం చేసుకోలేని బండరాయిగా చంద్రబాబు మారిపోయారని విమర్శించారు. తెలుగు తమ్ముళ్ళు ఒక్కొక్కరూ ఒక్కో రకంగా మాట్లాడుతున్నారని విమర్శించారు.

Back to Top