ఆడపిల్లలు చనిపోతున్నా పట్టించుకోకుండా విదేశాల్లో విలాసాలా..!

హైదరాబాద్ః వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని, విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా చంద్రబాబుకు పట్టడం లేదని మండిపడ్డారు. విద్యార్థుల ఆత్మహత్యలు..మహిళా అధికారిణిలపై దాడులు జరుగుతున్నా పట్టించుకోకుండా సింగపూర్, మలేషియా అంటూ చంద్రబాబు విదేశాల్లో విలాసాలు చేస్తున్నారని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా, పంగిడిగూడెం గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థిని భానుప్రీతి..విజయవాడ మారిస్ స్టెల్లా కాలేజ్ హాస్టల్ లో సూసైడ్ చేసుకున్నారు. ఈఘటనపై అనేక అనుమానాలు కలుగుతున్నాయని రోజా అన్నారు. 

చంద్రబాబుకు ఆడపిల్లలు లేనందునే ఆవిలువేంటో ఆయనకు తెలియడం లేదని రోజా విమర్శించారు. విద్యార్థులు, మహిళల ఆత్మహత్యలపై సిట్టింగ్ జడ్జ్ తో విచారణ చేయించాలని రోజా డిమాండ్ చేశారు. నాగార్జున యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్న రిషితేశ్వరి కేసును ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని ఉంటే ఈరోజు భానుప్రీతి ఆత్మహత్య చేసుకునేదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు జిల్లాకో సైకో సూదిగాడు తయారయ్యాడని రోజా ధ్వజమెత్తారు. అచ్చెన్నాయుడు, చింతమనేని ప్రభాకర్ సహా ముగ్గురు మహిళా మంత్రులు ఆత్మహత్యలపై ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు.
Back to Top