ఐదేళ్లలో ఎలా కడతారు? భ్రమలు కల్పించడమెందుకు?రాజధాని మాస్టర్ ప్లాన్ ఏది? ఎక్కడ కడుతున్నారు?ధాన్యాగారాన్ని ఎందుకు ధ్వంసం చేస్తున్నారు?అన్ని ఎకరాల పంటభూములు ఎందుకు?రాజధాని నిపుణుల కమిటీ ఛైర్మన్ శివరామకృష్ణన్ ప్రశ్నచంద్రబాబుది హ్రస్వదృష్టి అంటూ విమర్శ షాంఘై తరహాలో రాజధాని నిర్మిస్తామంటూ.. సింగపూర్, జపాన్, చైనా చుట్టి వస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు ఊ అంటే అంతర్జాతీయ స్థాయిలో క్యాపిటల్ సిటీ ఉంటుందంటూ ఊదరగొడుతున్నారు. అందుకోసం గతంలో ఎక్కడా లేని విధంగా, ఎన్నడూ వినని, చూడని విధంగా ఏకంగా 30 వేల ఎకరాల భూమి సేకరిస్తున్నారు. ఇందుకు కూడా ఇదివరకు ఎక్కడా జరగని విధంగా భూసమీకరణ ప్రక్రియ ఎంచుకున్నారు. కానీ వాస్తవ పరిస్థితులు ఏమిటి ? నిజంగా రాజధాని కోసం అంత భూమి అవసరమా? గతంలో నిర్మించిన నగరాలు, వాటి స్థితిగతులు ఏమిటి ? అసలు ప్రభుత్వం చేస్తున్న పని వల్ల ఎంత నష్టం జరగనుంది ? బాబు చెబుతున్న మాటల్లో నిజం ఎంత ? వాస్తవాలు ఎలా ఉన్నాయి ?.... రాజధాని ఎక్కడ ఉండొచ్చు అనే అంశం మీద శివరామకృష్ణన్ కమిటీ నివేదిక ఇవ్వక ముందే... కనీసం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కూడా కాని ఒక ఫైనాన్షియర్ అధ్యక్షతన మరో కమిటీని నియమించారు.కేంద్ర కమిటీ నివేదిక ఇవ్వకముందే, కేంద్ర కమిటీ మీద ఒత్తిడి తెచ్చే విధంగా నారాయణ కమిటీ పేరుతో చంద్రబాబు ప్రభుత్వం నాటకాలు ఆడి- ముందుగానే ఒక వ్యూహం ప్రకారం తెలుగుదేశం పార్టీ నేతలచే పెద్దఎత్తున భూములు కొనిపించి తుళ్ళూరు ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించింది. ఈ అంశంమీద వైయస్‌ఆర్ కాంగ్రెస్‌తోపాటు అన్ని పార్టీలు అభ్యంతరం చెప్పాయి. రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఒక అల్ పార్టీ మీటింగ్ కానీ, అందరి దగ్గర నుంచి సూచనలు, సలహాలుగానీ ఎప్పుడూ తీసుకోలేదు. కాబట్టే అక్కడి రైతులు తిరగబడ్డారు. ల్యాండ్ పూలింగ్‌పై కోర్టులకు వెళ్ళారు. ఇప్పుడు ఆ రాజధాని నిర్ణయ కమిటీకి అధ్యక్షత వహించిన ఎక్స్‌పర్ట్ కమిటీ చైర్మన్ శివరామకృష్ణన్... రాజధాని విషయంలో చంద్రబాబు ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారో బట్టబయలు చేస్తూ హిందూ పత్రికలో వ్యాసం రాశారు. శివరామకృష్ణన్ అభిప్రాయాలు చూసైనా చంద్రబాబు నాయుడు బుద్ధి తెచ్చుకోవాలి. ‘ఏపీ రాజధాని-లోపించిన దూరదృష్టి’ పేరుతో శివరామకృష్ణన్ రాసిన ఆ వ్యాసంలోని ముఖ్యాంశాలు... రాజకీయాల్లో అపార అనుభవం సాధించిన చంద్రబాబు నాయుడు.. ఇప్పుడు రాజధాని కోసం భూముల సమీకరణతోనే కాలం గడిపేస్తున్నారు. ఈ చిక్కుముడిలో ఆయన ఇరుక్కోవడం వల్ల రాష్ట్రాభివృద్ధిపై తన దృష్టిని మళ్ళించలేకపోతున్నారు. ఇది దురదృష్టకరం. ఇప్పుడు రాజధాని నిర్మాణం చేపడుతున్న విజయవాడ - గుంటూరు - తెనాలి - మంగళగిరి (విజిటిఎం) ప్రాంతం రాష్ట్రంలో ధాన్యాగారంగా పేరు పొందింది. నిస్సందేహంగా ఇది అత్యంత సారవంతమైన భూమి. ఇలాంటి చోట 30 వేల ఎకరాల భూమి సేకరిస్తున్నారు. ఏటా చక్కగా రెండు, మూడు పంటలు పండే తుళ్ళూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లో భూములు సేకరిస్తూ.. రైతులకు ఆర్ధిక ప్రయోజనం కలిగిస్తున్నారని చెప్పడం కచ్చితంగా హ్రస్వదృష్టి చర్యలే. భవిష్యత్‌లో దీని వల్ల చాలా నష్టం జరుగుతుంది. చంద్రబాబు చెబుతున్న గొప్ప రాజధాని నగరానికి సంబంధించి ఇప్పటి వరకూ ఎలాంటి మాస్టర్ ప్లాన్ అందుబాటులో లేదు. ఏపీ వెబ్‌సైట్‌లో కూడా కనిపించడం లేదు. దీని వల్ల ఏది ఎక్కడ కడుతున్నారో తెలుసుకోవడం అసాధ్యమవుతోంది. నీటి సౌకర్యం చాలా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన చాలా కష్టమవుతుంది. రహదారులు, భవనాల తదితర మౌలిక వసతుల కల్పనకు తగినట్టుగా భూమిని సిద్ధం చేయడం, నిర్మాణాలు చేపట్టడం, పూర్తి చేయడం చాలా ఆలస్యం అవుతుంది. ఇందుకు కొంత భూమి ఇప్పటికే అందుబాటులో ఉన్నప్పటికీ మొత్తం ప్రక్రియ పూర్తి కావడానికి చాలా సమయం పడుతుంది.స్వాతంత్య్రానంతరం దేశంలో ఇప్పటి వరకు వేర్వేరు ప్రాంతాల్లో కొత్తగా నిర్మించిన 100కు పైగా పట్టణాలు, నగరాలు.. చండీగఢ్, భువనేశ్వర్, గాంధీనగర్‌తో పాటు, స్టీల్ సిటీలైన బొకారో, దుర్గాపూర్, రూర్కెలా నిర్మాణానికి కనీసం ఏడెనిమిదేళ్ళు పట్టింది. ఒకటి రెండు పరిశ్రమలు, ఇతర సంస్థలతో, కనీస మౌలిక వసతులతో వాటిని నిర్మించడానికే అంత సమయం పట్టింది. అలాంటి నేపథ్యంలో అన్ని సౌకర్యాలతో రాష్ట్ర రాజధానిని అంతర్జాతీయ స్థాయిలో ఐదేళ్ళలో పూర్తి చేస్తామని చెప్పడం అతిశయోక్తి అవుతుంది. ఎలా చూసినా ఇది అసాధ్యం. లేనిపోని భ్రమలు కల్పించడమే అన్నది వాస్తవం.రాష్ట్రం ముందున్న ప్రధాన సవాల్ ఏటా 3 లక్షలకు పైగా ఉద్యోగాల కల్పన. ఇదే విషయాన్ని నిపుణుల కమిటీ కూడా పదే పదే ప్రస్తావించింది. కానీ మీ దృష్టిలో ఈ విషయం ఉన్నట్టు కనిపించడం లేదు. ఇటీవలి తుపానులో నష్టపోయిన ప్రాంతాల్లో పునర్నిర్మాణాలు జరగాల్సి ఉంది. అలాగే కీలకమైన హైకోర్టు వంటి నిర్మాణాలను కూడా కమిటీ సూచించింది. ఇవే రాష్ట్రానికి ఒక ఊపునిస్తాయి. చిత్తూరు, తిరుపతి పరిసరాల్లో వైద్య సదుపాయాలతో పాటు, విద్యా సంస్థల ఏర్పాటుకు చొరవ చూపుతున్నారు. ఇది బాగానే ఉంది. కానీ ఇక్కడ మీరో విషయం గుర్తించాలి. ఇవి హైదరాబాద్‌కు దూరంగా, తమిళనాడుకు చేరువలో సరిహద్దులో ఉన్నాయి కాబట్టి, వాటికి ప్రాధాన్యం ఏర్పడింది. మరి రాయలసీమ పరిస్థితి ఏమిటి ?.ప్రతిదానికీ చిత్తూరు జిల్లాతో పాటు, తిరుపతికే ప్రాధాన్యం ఇస్తున్నారు. మరి రాయలసీమ పరిస్థితి ఏమిటి ? రాయలసీమలోని ఇతర ప్రాంతాలు పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాయి. కర్నూలు, కడప, అనంతపురం గురించి పట్టించుకోలేదు. ఇది విచారకరం. రాజధానిని ఫైనాన్షియల్ సిటీగా మార్చే ప్రయత్నం వల్ల ఇతర ప్రాంతాల్లో నిరసనలు వ్యక్తమయ్యే ప్రమాదం ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మీపై ఉంది. కానీ అలా కాకుండా కేవలం విజయవాడ - గుంటూరు - తెనాలి - మంగళగిరి (విజిటిఎం) ప్రాంతానికే సిఎంగా వ్యవహరించడం మంచిది కాదు. రాజధాని కమిటీ సిఫార్సులను ఆమోదించారా ? లేదా ? అన్న అంశం అప్రస్తుతం. వాటికి అంత ప్రాధాన్యత లేదు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తే అత్యంత ప్రాధాన్యమైంది. కనీసం ఇప్పటికైనా ముఖ్యమంత్రిగా తన తప్పిదాన్ని గుర్తించి వెనుకడుగు వేయాలి. జరిగిన పొరపాట్లను సరిదిద్దుకోవాలి. రాష్ట్రాభివృద్ధిపై దృష్టి పెట్టాలి.రాష్ట్రంలో అనేక సమస్యలు పరిష్కరించే విధంగా చంద్రబాబుకు విభజన చట్టం చాలా సమయాన్నే ఇచ్చింది. అయితే చంద్రబాబు మాత్రం వాటిపై దృష్టి పెట్టకుండా ఎంతసేపూ రాజధాని కోసం భూసేకరణలో, భూసమీకరణ అన్న సుడిగుండంలోనే కొట్టుమిట్టాడుతున్నాడు. అదే లోకంగా పని చేస్తున్నారు. రాజధాని మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్న సింగపూర్ కంపెనీలు.. ఎపి రాజధాని ప్రాంతానికి అత్యంత చేరువలో విజిటిఎం పరిధిలోనే 3వేల ఎకరాల భూమి కోరుతున్నట్టు సమాచారం. చైనాతో సహా ప్రాంతాల్లో ఈ తరహాలోనే సింగపూర్ కంపెనీలు భూములపై దృష్టి పెట్టినట్టు చెబుతున్నారు. ఎప్పటికో పూర్తయ్యే ప్రపంచ స్థాయిలో రాజధాని నిర్మాణం కంటే.. ఇప్పుడు రాష్ట్రానికి ఏది అవసరం ? ఏది ముఖ్యం ? ప్రస్తుత సమస్యలు ఏమిటి ? వాటి పరిష్కారం ఏమిటి ? అన్నదే చూడాలి. అంతే తప్ప, రాజధాని కోసం రాజకీయ శక్తిని, ఆర్ధిక వనరులను ఫణంగా పెట్టడం కచ్చితంగా ఆత్మహత్యా సదృశమే. ఎవరీ శివరామకృష్ణన్?రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం చేసిన చట్టం మేరకు- రాజధాని నిర్ణయానికి ఓ కమిటీని వేశారు. ఆ కమిటీ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను పరిశీలించి.. మరోసారి ఆంధ్రప్రదేశ్ విడిపోకూడదంటే బ్యాలెన్సెడ్ డెవలప్‌మెంట్ అవసరం అని సలహా ఇచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్‌లోనే అభివృద్ధినంతటినీ కేంద్రీకరించటం వల్ల ఎటువంటి పరిస్థితులు తలెత్తాయో.. మరలా అటువంటి పరిస్థితులు తలెత్తకుండా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తేనే ఆంధ్రప్రదేశ్‌కు భవిష్యత్ ఉంటుందని శివరామకృష్ణన్ కమిటీ చెప్పింది. ఆ కమిటీకి సీనియర్ ఐఏఎస్ అధికారి, కేంద్ర ప్రభుత్వంలో అనేక ఉన్నత పదవులు నిర్వహించిన నిజాయితీ కల్గిన వ్యక్తి శివరామకృష్ణన్ నేతృత్వం వహించారు. ఆ కమిటీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గడువులోగా తన నివేదికను సమర్పించింది. ఆ రిపోర్టు ఎంతో విలువైనదని మేధావులు చెప్పారు. అన్ని రాజకీయ పార్టీలు చెప్పాయి.