రైతులపై కక్ష కట్టిన ప్రభుత్వం!

ఉరవకొండ

1 నవంబర్ 2012 : రాష్ట్ర ప్రభుత్వం రైతులపై కక్ష కట్టినట్లు వ్యవహరిస్తోందనీ, ఎన్ని రకాలుగా వీలైతే అన్ని అనేక రకాలుగానూ హింసిస్తోందనీ షర్మిల మండిపడ్డారు. అన్నిరంగాలలోనూ విఫలమైన కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం రైతులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని ఆమె విమర్శించారు. పదిహేనవరోజు పాదయాత్రలో భాగంగా ఉరవకొండ నియోజకవర్గంలోని జెల్లిపల్లిలో గురువారం జరిగిన ఒక భారీ బహిరంగసభలో ఆమె ప్రసంగించారు.
"రాజశేఖర్ రెడ్డిగారు హంద్రీ-నీవా ప్రాజెక్టు పూర్తి చేసి అనంతపురంజిల్లాలోని నాలుగులక్షల ఎకరాలకు నీళ్లివ్వాలనుకున్నారు. దీని వల్ల 400 గ్రామాలకు నీళ్లు వస్తాయి. నాలుగువేల కోట్ల వ్యయంతో వైయస్ హయాంలోనే 95 శాతం పనులు పూర్తి కూడా అయ్యాయి. మిగిలిన ఆ కాసిన్ని పనులూ పూర్తి చేసేందుకు ఈ ప్రభుత్వానికి మూడేళ్లు సరిపోలేదు. ఇంకా రెండేళ్లు కూడా వారికి సరిపోవు"అని షర్మిల వ్యంగ్యంగా అన్నారు.
"కేవలం 45 కోట్లు ఖర్చు పెడితే ప్రాజెక్టు పనులు పూర్తి అవుతాయి. ఈ ప్రాంతంలో ప్రతి ఎకరాకూ నీళ్లు వస్తాయి. కానీ వాళ్లు ఆ పని చేయడం లేదు." అని ఆమె విమర్శించారు. రాజశేఖర్ రెడ్డిగారు ఉన్నప్పుడు పిఎబిఆర్‌కు నీళ్లిచ్చారు. ప్రతి సంవత్సరం కూడా నీళ్లు ఇవ్వాలన్నారు. ఎంతో ఆలోచనతో నీళ్లిచ్చే ఏర్పాటు చేశారు. కానీ గత రెండేళ్లుగా ఈ ప్రభుత్వం నీళ్లివ్వడం లేదు." అని ఆమె ఆక్షేపించారు. దాంతో ఇక్కడ భూగర్భజలాలు అడుగంటిపోయాయనీ, తాగునీటికే కటకటగా ఉందని ఆమె అన్నారు.
"వైయస్ ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. రాజశేఖర్ రెడ్డిగారిని గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలీ అని చూపించారు. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో చేశారు. చెప్పినవీ చేశారు. చెప్పనివీ ఎన్నో చేశారు. అప్పుడు రాష్ట్రం ఎంత సస్యశ్యామలంగా ఉండేదో అందరికీ తెలుసు. ఇప్పుడు సబ్సిడీలు లేవు. ఇన్స్యూరెన్స్ లేదట. వానలు లేవు. నీళ్లు లేవు. ఏం తిని బ్రతకాలి? అసలు బతికుండాలా వద్దా అని రైతులు అడుగుతున్నారు. పైగా సర్‌చార్జీల పేరుతో కరెంటు బకాయీలను బలవంతంగా వసూలు చేస్తున్నారు."అని ఆమె విమర్శించారు. రాజశేఖర్ రెడ్డి పాలనకూ, నేటి పాలనకూ ఎంతో తేడా ఉందని ఆమె అన్నారు.
పాదయాత్రలో భాగంగా ఉదిరితికొండ చేరిన షర్మిలకు ఘనస్వాగతం లభించింది. అంతకు ముందు షర్మిల ముద్దలాపురంలోని వైయస్ఆర్ వాటర్ ప్రాజెక్టును సందర్శించారు. ఈ ప్రాజెక్టు నుండే అనంతపురం పట్టణానికి మంచినీరు అందిస్తున్నామని అధికారులు షర్మిలకు వివరించారు. ఈ ప్రాజెక్టు వైయస్ ముందుచూపుకు నిదర్శనమని స్థానికులు వ్యాఖ్యానించారు. గురువారం షర్మిల పలు చోట్ల వర్షంలోనే తడుస్తూ తన పాదయాత్రను కొనసాగించారు.

Back to Top