రైతులను ఆదుకోవాలి!

పగిడ్యాల (కర్నూలు) 19 నవంబర్ 2012 : హంద్రీ-నీవా సుజల స్రవంతి కాలువ కింద పొలాలు కోల్పోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి కోరారు. మల్యాల ఎత్తిపోతల పథకం నుంచి ఆదివారం మంత్రి రఘువీరా రెడ్డి పాదయాత్ర చేపట్టిన నేపథ్యంలో మల్యాల క్రాస్ రోడ్డు వద్ద ఆయనను గౌరువెంకటరెడ్డి కలిసి ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, కర్నూలు జిల్లా ఆయకట్టుకు నీరు ఇవ్వకుండా అనంతపురానికి కాలువ ద్వారా నీరు తరలించడాన్ని ఖండించారు. రైతుల శ్రేయస్సు దృష్ట్యా కాలువకు లైనింగ్ పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. అలాగే ట్రయల్స్ సమయంలో కాలువ గుండా సీపేజీ ఏర్పడి వందలాది ఎకరాల్లో పంటనష్టం జరిగిందని, అలా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఆయన మంత్రినికోరారు. పంపింగ్ స్టేషన్ వద్ద సెక్యూరిటీ లేనందున ఇటీవల బ్రాహ్మణకొట్కూరు గ్రామానికి చెందిన నరసింహులు అనే యువకుడు మృతి చెందారని, అతని కుటుంబాన్ని ఆదుకోవాలన్నారు. అన్ని పంపింగ్ స్టేషన్ల వద్ద సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని కోరారు. మల్యాల ఎత్తిపోతల పథకం ద్వారా పొలాలు కొల్పోయిన రైతులకు ఎకరాకు రూ. 3లక్షలు మాత్రమే ఇచ్చారని, ఇంకా రూ. 2లక్షలు ఇవ్వాల్సి ఉందన్నారు. వడ్డెమాను, బ్రాహ్మణకొట్కూరు గ్రామాల మధ్య బ్రిడ్జి నిర్మాణం పూర్తికాకపోవడంతో పొలాలకు వెళ్లడానికి రైతులు ఇబ్బందులు పడుతున్నారని  ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తడనకనపల్లె, ఉలిందకొండ గ్రామాల్లోని చెరువులను పూర్తిస్థాయిలో నింపి సాగునీరు అందించాలని కోరారు. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. హంద్రీనీవా కాలువ కింద ఉన్న పొలాలకు సాగునీరు అందించడానికి డిస్ట్రీబ్యూటరీ పనులు పూర్తి చేయాలన్నారు.
వైయస్ఆర్ సీపీ నాయకులు జయరామిరెడ్డి, మాండ్ర సురేంద్రరెడ్డి, బూజనూరు శివరామిరెడ్డి, పలుచాని మహేశ్వరరెడ్డి, జనార్దన్ రెడ్డి, పుల్యాల సత్యంరెడ్డి, పెరుగు పురుషోత్తంరెడ్డి, జగదీశ్వరరెడ్డి, మునాఫ్, కస్వ శంకరరెడ్డి, ఐజయ్య, కోకిల రమణారెడ్డి, ధర్మారెడ్డి, మహేష్‌నాయుడు తదితరులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. ఇదిలావుండగా రఘువీరా రెడ్డి పాదయాత్రను అడ్డుకునేందుకు వందలాది మంది కార్యకర్తలతో వెళ్తున్న గౌరు వెంకటరెడ్డిని పోలీసులు నిర్బంధించారు. వినతిపత్రం ఇచ్చేంత వరకు మాత్రమే అనుమతి ఇస్తామన్నారు. నల్లబ్యాడ్జీలు ధరించి  వెంకటరెడ్డి తన అనుచరులతో ఉదయం 11 గంటలకు మల్యాలకు బయలుదేరగా వారిని మల్యాల క్రాస్ రోడ్డు వద్ద  పోలీసులు ముందుకు వెళ్ళకుండా అడ్డుకున్నారు. మంత్రి పాదయాత్రను అడ్డుకోరాదని, ఆయనను కలిసి మెమోరాండం ఇచ్చేందుకు మాత్రం అనుమతి ఇస్తామని సర్ది చెప్పడంతో అభిమానులు, కార్యకర్తలు శాంతించారు. మూడు గంటలకు మంత్రి రఘువీరారెడ్డి పాదయాత్ర మల్యాల క్రాస్‌రోడ్డు వద్ద ఉన్న బ్రిడ్జికి చేరుకోగానే కార్యకర్తలు పెద్ద ఎత్తున జై జగన్ అంటూ నినాదాలు చేశారు. వెంకటరెడ్డి ఇచ్చిన వినతి పత్రాన్ని మంత్రి  స్వీకరించారు.

Back to Top